శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్‌ను పొగిడిన ట్రంప్‌! | Trump Praises Irans Goodwill Gesture After Release of US Citizen | Sakshi
Sakshi News home page

శత్రువే అయినా ప్రశంసించాల్సిందే.. ఇరాన్‌ను పొగిడిన ట్రంప్‌!

Jul 16 2026 8:05 AM | Updated on Jul 16 2026 8:07 AM

Trump Praises Irans Goodwill Gesture After Release of US Citizen

అమెరికా-ఇరాన్‌ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ.. డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయంగా ఆసక్తి రేపుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌పై సైనిక ఒత్తిడి కొనసాగిస్తూనే.. మరోవైపు అదే దేశానికి ట్రంప్‌ బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. శత్రుదేశాన్నే ప్రశంసించేలా ఆయన చేసిన వ్యాఖ్యల వెనుక ఓ ఆసక్తికర పరిణామం ఉంది.

2024 డిసెంబర్‌ నుంచి ఇరాన్‌లో నిర్బంధంలో ఉన్న అమెరికా-ఇరాన్‌ ద్వంద్వ పౌరసత్వం కలిగిన డెనా కరారీకి తాజాగా విముక్తి లభించింది. ఆమెను ఇరాన్‌ విడుదల చేయడాన్ని 'సద్భావ సంకేతం' (Goodwill Gesture)గా అభివర్ణించిన ట్రంప్‌.. ఆ దేశ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రూత్‌ సోషల్‌లో స్పందిస్తూ.. "ఆమె ఇప్పుడు సురక్షితంగా ఇరాన్‌ వెలుపల ఉంది. ఆరోగ్యం కూడా బాగానే ఉంది. ఈ సద్భావ చర్యను అమెరికా అభినందిస్తోంది" అని పేర్కొన్నారు.

ట్రంప్‌ పోస్టు అనంతరం మానవ హక్కుల న్యాయవాది జారెడ్‌ జెన్సర్‌.. విడుదలైన మహిళ డెనా కరారీనేనని ధృవీకరించారు. 2024లో కుటుంబ సభ్యులను కలిసేందుకు ఇరాన్‌కు వెళ్లిన ఆమెను అక్కడి అధికారులు దేశం విడిచి వెళ్లనీయలేదు. అనంతరం 2025లో అమెరికా-ఇజ్రాయెల్‌ సంయుక్త వైమానిక దాడుల తర్వాత ఆమెపై గూఢచర్యం ఆరోపణలు నమోదు చేశారు. అంతకుముందు.. 

డెనా అమెరికాలోని ఓ టెక్నాలజీ కంపెనీలో ఉద్యోగం చేయడంతో పాటు ఇరాన్‌లో పేద పిల్లల కోసం సేవా కార్యక్రమాలు నిర్వహించే స్వచ్ఛంద సంస్థను నడిపేవారు. డెనా కరారీ విడుదలకు ట్రంప్‌ చేసిన నిరంతర ప్రయత్నాలే కారణమని జారెడ్‌ జెన్సర్‌ తెలిపారు. ప్రస్తుతం ఆమె అమెరికాకు తిరుగు ప్రయాణంలో ఉన్నట్లు వెల్లడించారు. గత రెండు దశాబ్దాల్లో 20 దేశాల్లో 340 మందికిపైగా ఖైదీల విడుదలకు జెన్సర్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఇదిలా ఉండగా.. ఇరాన్‌తో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ట్రంప్‌ మరోసారి పేర్కొన్నారు. ‘‘ఇరాన్‌ చర్చలు కోరుకుంటోంది. వారితో ఒప్పందం కుదురుతుందేమో చూడాలి. అయితే వారు సరిగ్గా, మర్యాదగా ప్రవర్తించాలి (They better behave)’’ అంటూ హెచ్చరించారు. అలా కాదని ఘర్షణలు కొనసాగితే ఇరాన్‌ త్వరలోనే ఓటమి పాలవుతుందని కూడా వ్యాఖ్యానించారు. అయితే చర్చలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.

మరోవైపు అమెరికా హర్ముజ్‌ జలసంధి పరిసరాల్లో ఇరాన్‌కు చెందిన తీర రక్షణ వ్యవస్థలు, క్షిపణి ప్రయోగ కేంద్రాలపై రెండో విడత దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిస్పందించిన ఇరాన్‌.. ఇది తమ ఉనికికే సంబంధించిన యుద్ధమని పేర్కొంటూ, అవసరమైతే ప్రాంతీయ ఇంధన ఎగుమతులకు అంతరాయం కలిగించే చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement