టాటా సన్స్‌ లిస్టింగ్‌పై తేలని ఉత్కంఠ | Tata Sons IPO Listing Hangs on RBI Final Verdict | Sakshi
Sakshi News home page

టాటా సన్స్‌ లిస్టింగ్‌పై తేలని ఉత్కంఠ

Jul 2 2026 1:31 PM | Updated on Jul 2 2026 1:36 PM

Tata Sons IPO Listing Hangs on RBI Final Verdict

టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ సంస్థ ‘టాటా సన్స్’ ఐపీఓ మార్కెట్లోకి రావాలా వద్దా అనే అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తుది నిర్ణయం తీసుకోనుంది. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (CoR) సరెండర్ దరఖాస్తులపై కేంద్ర బ్యాంక్ స్పష్టత ఇచ్చింది. కేవలం పత్రాలు సమర్పించినంత మాత్రాన ఎన్‌బీఎఫ్‌సీల రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ స్వయంచాలకంగా రద్దు కాదని, ఆ రద్దు దరఖాస్తును ఆమోదించే లేదా తిరస్కరించే పూర్తి హక్కు తమకు ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో, టాటా సన్స్ దాఖలు చేసిన ‘కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ’ (సీఐసీ) లైసెన్స్ సరెండర్ దరఖాస్తుపై ఆర్బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒకవేళ ఆర్బీఐ ఈ దరఖాస్తును ఆమోదించే వరకు టాటా సన్స్‌పై స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ అవ్వాలనే నిబంధనలు యథాతథంగా అమలులో ఉంటాయి.

‘పరోక్ష నిధుల స్వీకరణ’పై కొత్త సర్క్యులర్

ప్రభుత్వ నిధులను పరోక్షంగా స్వీకరించడంపై నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ ఆర్బీఐ మరో కీలక సర్క్యులర్‌ను జారీ చేసింది. దీని ప్రకారం.. ప్రభుత్వ నిధులకు ప్రత్యక్షంగా యాక్సెస్ లేకుండా ప్రభుత్వ నిధులు పొందే అసోసియేట్లు లేదా గ్రూప్ సంస్థల ద్వారా నిధులు అందుకుంటే దాన్ని 'పరోక్ష నిధుల స్వీకరణ'గా పరిగణిస్తారు.

సెంట్రల్ బ్యాంక్ మొదట ఏప్రిల్ 29 నాటి సర్క్యులర్‌లో ఈ నిబంధనను చేర్చింది. అయితే జూన్ 24న ఎన్‌బీఎఫ్‌సీల కోసం విడుదల చేసిన మార్గదర్శకాల్లో ‘నిధులకు పరోక్ష అవకాశం’ను స్పష్టంగా నిర్వచించలేదు. కాబట్టి, ఏప్రిల్ 29 నాటి నిర్వచనాన్ని పునరుద్ఘాటించేందుకే ఆర్బీఐ జూన్ 30న తాజా నోటిఫికేషన్‌ను జారీ చేసినట్లు మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. ఈ కొత్త మార్గదర్శకాలు జులై 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

టాటా సన్స్‌కే ఎందుకీ సమస్య?

టాటా సన్స్ 2024లోనే తనకున్న అన్ని అప్పులను పూర్తిగా తిరిగి చెల్లించింది. టాటా మోటార్స్, టాటా స్టీల్ వంటి కొన్ని ప్రముఖ లిస్టెడ్ సంస్థలకు టాటా సన్స్‌లో వాటాలు ఉన్నాయి. ఈ గ్రూప్ సంస్థల ద్వారా టాటా సన్స్‌కు నిధులకు పరోక్ష అవకాశం ఉన్నందున, కేంద్ర బ్యాంక్ దీనిని ‘కోర్ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ’గానే పరిగణిస్తోంది.

లిస్టింగ్ వివాదం నేపథ్యం

ఆర్బీఐ 2022లో ‘అప్పర్ లేయర్’ ఎన్‌బీఎఫ్‌సీల జాబితాను విడుదల చేస్తూ వారు మూడేళ్ల వ్యవధిలో (సెప్టెంబర్ 2025 నాటికి) స్టాక్ మార్కెట్లో తప్పనిసరిగా లిస్ట్ కావాలని గడువు విధించింది. ఈ లిస్టింగ్ నిబంధనల నుంచి మినహాయింపు పొందడానికి టాటా సన్స్ 2024లో తన సీఓఆర్‌ను సరెండర్ చేయడానికి దరఖాస్తు చేసుకుంది. గత వారం ఆర్బీఐ విడుదల చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం.. రూ.1 లక్ష కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆస్తి పరిమాణం ఉన్న ఏ ఎన్‌బీఎఫ్‌సీ అయినా అ‍ప్పర్‌ లేయర్‌ విభాగంలోకే వస్తుందని పునరుద్ఘాటించింది.

టాటా సన్స్ ఆస్తి పరిమాణం నిర్దేశిత పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉండటం, పైగా పరోక్ష నిధుల స్వీకరణ నిర్వచనం పరిధిలోకి వస్తుండటంతో.. ఆర్బీఐ ఆ సంస్థ లైసెన్స్ సరెండర్ దరఖాస్తును ఆమోదిస్తుందా లేదా తిరస్కరించి లిస్టింగ్‌కు ఆదేశిస్తుందా అనేది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఒకవేళ ఆర్బీఐ దరఖాస్తును తిరస్కరిస్తే టాటా సన్స్ దేశీయ స్టాక్ మార్కెట్లలో మెగా ఐపీఓగా రావాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు యూటర్న్‌!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement