8వ వేతన సంఘంపై పెన్షనర్ల కన్ను! | 8th Pay Commission Pensioners Demand Pension Revision | Sakshi
Sakshi News home page

8th Pay Commission: 8వ వేతన సంఘంపై పెన్షనర్ల కన్ను!

Aug 17 2026 5:05 PM | Updated on Aug 17 2026 5:46 PM

8th Pay Commission Pensioners Demand Pension Revision

దేశంలో 8వ వేతన సంఘం చర్చలు ఇప్పుడు కీలక దశకు చేరుకున్నాయి. 2025 నవంబర్ 3న ఏర్పాటు చేసిన ఈ కమిషన్‌కు 18 నెలల గడువు ఇచ్చారు. ఇప్పటికే అందులో సగానికి పైగా సమయం పూర్తయింది. దీంతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా, పెన్షనర్లు కూడా తమ డిమాండ్లపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా 2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన ఉద్యోగుల పెన్షన్, ఫ్యామిలీ పెన్షన్‌ను కూడా సవరించాలనే డిమాండ్ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది.

పాత పెన్షనర్లకు కూడా ప్రయోజనాలు కావాలని.. భారత్ పెన్షనర్స్ సమాజ్ (BPS), ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ (AIDEF) వంటి పెన్షనర్ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి చెబుతున్నాయి. 8వ వేతన సంఘం నిబంధనల్లో పాత పెన్షనర్ల పెన్షన్ సవరణపై స్పష్టత లేదని, అందుకే దీనిని స్పష్టంగా చేర్చాలని కోరుతున్నాయి.

2026 జనవరి 1కి ముందు రిటైర్ అయిన వారితో పాటు ఆ తర్వాత రిటైర్ అయ్యే ఉద్యోగుల పెన్షన్‌ను కూడా సవరించాలని, పాత-కొత్త పెన్షనర్ల మధ్య తేడాలు లేకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాయి. ఫ్యామిలీ పెన్షన్, ఇతర రిటైర్మెంట్ ప్రయోజనాలను కూడా ఇందులో భాగం చేయాలని కోరుతున్నాయి.

8వ వేతన సంఘం టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో ఉన్న 'అన్‌ఫండెడ్ కాస్ట్ ఆఫ్ నాన్-కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్' అనే పదంపై కూడా పెన్షనర్ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ ఉద్యోగి ఎన్నో ఏళ్ల పాటు పనిచేసిన తర్వాత పొందే పెన్షన్‌ను కేవలం ప్రభుత్వంపై పడే అదనపు ఖర్చుగా చూడటం సరికాదని AIDEF వాదిస్తోంది. BPS కూడా ఈ పదాన్ని తొలగించాలని, లేదా మార్చాలని కోరింది. పెన్షన్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని, వేతన సవరణతో పాటు పెన్షన్ సవరణ కూడా సమగ్రంగా జరగాలని సంఘాలు కోరుతున్నాయి.

పెన్షనర్ల ఇతర డిమాండ్లు
పెన్షన్ సవరణ ఒక్కటే కాకుండా.. మరికొన్ని అంశాలను కూడా పెన్షనర్ సంఘాలు ప్రభుత్వం ముందు ఉంచాయి. ఇందులో పాత పెన్షన్ విధానం (OPS) పునరుద్ధరణ, మెరుగైన ఆరోగ్య సేవలు, కేంద్ర నిధులతో నడిచే స్వయం ప్రతిపత్తి, చట్టబద్ధ సంస్థలకు 8వ వేతన సంఘం ప్రయోజనాలు అందించడం వంటి డిమాండ్లు ఉన్నాయి. అంతే కాకుండా.. పోస్టల్ శాఖలో కీలకంగా పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవక్ (GDS)లకు కూడా తగిన ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు.

ఇక నిర్ణయం ఎప్పుడు?
ప్రస్తుతం పెన్షనర్లలో ప్రధానంగా ఉన్న ఆందోళన.. తాము 8వ వేతన సంఘం పరిధిలోకి వస్తామా? లేదా? అనే విషయంలో స్పష్టత లేకపోవడమే. కమిషన్ తుది నివేదిక ఇచ్చేలోపు ఈ సందేహానికి ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పెన్షనర్ సంఘాలు కోరుతున్నాయి. రాబోయే రోజుల్లో చెన్నై, పుదుచ్చేరి, చండీగఢ్, జైపూర్ వంటి ప్రాంతాల్లో 8వ వేతన సంఘం మరిన్ని సమావేశాలు నిర్వహించనుంది. ఈ సమావేశాల్లో పెన్షనర్ల డిమాండ్లపై ఎలాంటి చర్చ జరుగుతుంది, చివరకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ఇదీ చదవండి: ఉద్యోగుల కనీస వేతనం.. రూ.55 నుంచి రూ.18,000 వరకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement