దివ్యాంగుల బతుకులతో ‘సదరం’గం! | How to apply for new pensions without submitting certificates | Sakshi
Sakshi News home page

దివ్యాంగుల బతుకులతో ‘సదరం’గం!

Sep 23 2026 5:35 AM | Updated on Sep 23 2026 5:35 AM

How to apply for new pensions without submitting certificates

‘భరోసా’ కాదు.. బాబు ద్రోహం

సదరం సర్టిఫికెట్లు ఇవ్వకుండా కొత్త పింఛన్లకు దరఖాస్తు ఎలా?

సాక్షి, అమరావతి: రెండేళ్లుగా రకరకాల సాకులతో ఉన్న పింఛన్లే ఏరివేస్తూ అవ్వా తాతలను ఏడిపిస్తూ.. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకు రావడంతో మభ్యపెడుతున్న చంద్రబాబు సర్కారు దివ్యాంగుల జీవితాలతోనూ చెలగాటమాడుతోంది! ఒకవైపు కొత్తగా పింఛన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించామంటూ మరోవైపు కీలకమైన సర్టిఫికెట్లు ఇవ్వకుండా దివ్యాంగులను వేధిస్తోంది. రాష్ట్రంలో వివిధ వైకల్య సమస్యలతో బాధపడుతున్న దివ్యాంగులకు సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయకుండా తూతూమంత్రంగా పింఛన్ల దరఖాస్తు ప్రక్రియ ముగించి ఎన్నికల డ్రామాలాడుతోంది.

దివ్యాంగుల పట్ల కర్కశంగా వ్యవహరిస్తోంది. గద్దెనెక్కిన నాటి నుంచి సామాజిక భద్రత పింఛన్లకు పెద్ద మొత్తంలో కోత పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు పన్నుతోంది.గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ప్రస్తుతం పింఛన్ల సంఖ్య ఏకంగా 6.42 లక్షలకుపైగా తగ్గిపోవడం దీనికి నిదర్శనం. 50 ఏళ్లకే పింఛన్‌ హామీకి మంగళం పాడింది. ఎడాపెడా పింఛన్లు ఎగరగొడుతూ దివ్యాంగ పింఛన్‌దారులను సైతం కనికరించకుండా స్క్రీనింగ్‌ పేరిట ముప్పుతిప్పలు పెట్టింది. వెరిఫికేషన్‌ పేరుతో వేధిస్తూ లక్ష మందిపై అనర్హత కత్తి వేలాడదీసింది. 

అంతేకాదు.. కొత్తగా దివ్యాంగ పింఛన్‌లు పొందే వారి సంఖ్యను కట్టడి చేసే వ్యూహంతో సదరం సర్టిఫికెట్ల జారీపై తీవ్ర ఆంక్షలు విధించింది. ఫలితంగా దివ్యాంగులకు సదరం స్లాట్‌లు అందని ద్రాక్షగా మారిపోయాయి. అష్టకష్టాలు పడి స్లాట్స్‌ దక్కించుకుని స్క్రీనింగ్‌కు హాజరైన వారికి సైతం శాశ్వత వైకల్య ధ్రువీకరణ పత్రాలను ప్రభుత్వం మంజూరు చేయడంలేదు. దీంతో ఇటీవల కొత్త పింఛన్‌ల కోసం దరఖాస్తులు స్వీకరించినప్పటికీ సదరం సర్టిఫికెట్లు లేని కారణంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున దివ్యాంగులు కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేని దౌర్భాగ్య పరిస్థితులు నెలకొన్నాయి.   

స్లాట్లు గల్లంతు.. సర్టిఫికెట్లు బంద్‌ 
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా దివ్యాంగుల కోసం ప్రతి నియోజకవర్గంలో సదరం క్యాంప్‌లను అందుబాటులోకి తెచ్చింది. దీంతో 2019కు ముందు చంద్రబాబు పాలనలో కేవలం 50  ప్రభుత్వాస్పత్రుల్లో అరకొరగా నడిచిన సదరం క్యాంప్‌లు గత ప్రభుత్వంలో ఏకంగా 175 నియోజకవర్గాల్లోని ఆస్పత్రుల్లో అందుబాటులోకి వచ్చాయి. తద్వారా ప్రతి మూడు నెలలకు 90 వేల స్లాట్స్‌ అందుబాటులో ఉండేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 

2024లో తిరిగి చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే దివ్యాంగ పింఛన్ల వెరిఫికేషన్‌ పేరిట కొత్తగా సదరం సర్టిఫికెట్ల జారీని ఆపేసింది. అనంతరం సర్టిఫికెట్ల జారీని తగ్గించడం కోసం క్యాంప్‌లు నిర్వహించే ఆస్పత్రులను 115కు కుదించింది. ఆ ఆస్పత్రుల్లో సైతం వారంలో ఒక్క రోజుకే సదరం స్క్రీనింగ్‌ను పరిమితం చేశారు. ఫలితంగా ఇప్పుడు ప్రతి మూడు నెలలకు 60 వేల స్లాట్స్‌ కూడా అందుబాటులో ఉండటం లేదు. స్లాట్స్‌ విడుదల చేసిన కొద్ది సమయంలోనే అన్ని బుక్‌ అయిపోతుండటంతో దివ్యాంగులు అల్లాడుతున్నారు. 

నడవలేనిస్థితిలో నరక యాతన.. 
సైకియాట్రీ, బహుళ వైకల్యంతో బాధపడుతున్న వారికి సైతం చంద్రబాబు ప్రభు­త్వం సదరం సర్టిఫికెట్లు జారీ చేయడం లేదు. నానా తిప్పలు పడి స్లాట్స్‌ దక్కించుకుని, నడవలేని స్థితిలో ఉన్న బాధితులను రూ. వేలల్లో ఖర్చు చేసి ప్రత్యేక వా­హనాల్లో కుటుంబ సభ్యులు స్క్రీనింగ్‌ క్యాంప్‌లకు తీసుకొస్తున్నారు. స్క్రీనింగ్‌ అంతా పూర్తయ్యాక సైకియాట్రీ సమస్యలున్న బాధితులకు ప్రభుత్వం తాత్కాలిక ధ్రువీకరణ పత్రా­లే మంజూరు చేస్తోంది. ఇక బహుళ వైకల్య బాధితులకు అసలు సర్టిఫికెట్లే ఇవ్వడం లేదు. ఇలాంటి బాధితులు రాష్ట్రంలో పెద్దఎ­త్తున ఉన్నారు. వీరితో పాటు ఇతర వైకల్య సమస్యలతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం సదరం సర్టిఫికెట్లు మంజూరు చేయకపోవడంతో కొత్త పింఛన్లకు కనీసం దరఖాస్తు కూడా సమరి్పంచలేకపోయామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

ఎంత తిరిగినా సర్టిఫికెట్‌ ఇవ్వలేదు.. 
పక్షవాతం కారణంగా నా రెండు కాళ్లు పనిచేయడం లేదు. ఈ ఏడాది మే నెలలో సదరం క్యాంప్‌ వద్దకు వెళితే వైద్యులు స్క్రీనింగ్‌ చేశారు. సర్టిఫికెట్‌ మాత్రం మంజూరు చేయలేదు. మావాళ్లు ఎన్నిసార్లు ఆస్పత్రి చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. ఎట్టకేలకు ఇటీవల కొత్త పింఛన్లకు అవకాశం కల్పించినా సర్టిఫికెట్‌ లేకపోవడంతో నేను దరఖాస్తు చేసుకోలేకపోయా.  – పద్మావతి, రాజమండ్రి 

సదరం స్లాట్‌ దొరకలేదు.. 
గతంలో నాకు యాక్సిడెంట్‌ అయింది. కాళ్ల­లో రాడ్‌ కూడా వేశా­రు. సర్జరీ అనంతరం నడవలేని పరిస్థితికి దారి తీసింది. ఇంట్లో మంచానికే పరిమితం అయ్యా. భరోసా పింఛన్‌కు దరఖాస్తు చేసుకోవడానికి సదరం సర్టిఫికెట్‌ కావాలన్నారు. సదరం స్లాట్‌ దొరకడం లేదు. నా భార్య క్యాన్సర్‌ పేషెంట్‌. ఇద్దరం పని చేయలేని పరిస్థితి. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నాం. సర్టిఫికెట్‌ లేకపోవడంతో పింఛన్‌కు దరఖాస్తు చేసుకోలేకపోయా.  – రంగబాబు, బొమ్మూరు, తూర్పుగోదావరి జిల్లా 

ఈ ఫొటోలో మహిళ సాయంతో నడుస్తున్న ఏడేళ్ల బాలుడి పేరు ఎం.అభిరామ్‌. బాలుడి తండ్రి ప్రైవేట్‌ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. విజయవాడ మురళీనగర్‌లో నివాసం ఉంటారు. వైకల్యం బాధితుడైన అభిరామ్‌ ఇతరుల సాయం లేకుండా నడవలేడు. తన పనులు తాను చేసుకోలేడు. ఈ ఏడాది జూలైలో విజయవాడ జీజీహెచ్‌లో బాలుడికి స్క్రీనింగ్‌ చేసిన వైద్యులు 90 శాతం వైకల్యం ఉన్నట్లు నిర్ధారించారు. 

అయితే శాశ్వత వైకల్య ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకుండా తాత్కాలిక పత్రం జారీ చేశారు. ఇటీవల అభిరామ్‌ తల్లిదండ్రులు సచివాలయానికి వెళ్లగా పింఛన్‌ పొందాలంటే శాశ్వత వైకల్య ధ్రువీకరణ పత్రం తప్పనిసరి అని, అది లేకుండా దరఖాస్తు స్వీకరించబోమని సిబ్బంది చెప్పడంతో తెల్లబోయారు. ‘90 శాతం వైకల్యం ఉన్నట్లు ప్రభుత్వమే ఇచ్చిన సర్టిఫికెట్‌ ఉన్నా దరఖాస్తు ఎందుకు తీసుకోరు?’ అని అభిరామ్‌ తల్లి దుర్గాభవాని ప్రశ్నిస్తే ఎటువంటి సమాధానం లేదు.  

ఈ ఫొటోలోని రాజమండ్రికి చెందిన సత్యఫణి కార్తీక్‌ బహుళ వైకల్యం (మల్టిపుల్‌ డిసెబిలిటీ) బాధితుడు. వైకల్య ధ్రువీకరణ పత్రం కోసం కుటుంబ సభ్యులు స్లాట్‌ బుక్‌ చేసుకుని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వాస్పత్రిలో సదరం క్యాంప్‌ వద్దకు తీసుకెళ్లారు. వైద్యులు కార్తీక్‌ను పరిశీలించినా  ఇంతవరకూ వైకల్య ధ్రువీకరణ పత్రం మంజూరు కాలేదు. దీంతో కొత్తగా పింఛన్‌ కోసం దరఖాస్తు సమర్పించలేకపోయాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement