సాయికృష్ణ లాకప్‌డెత్‌ వ్యవహారంపై ముగిసిన వాదనలు | Arguments over Sai Krishnas lockdown death case conclude | Sakshi
Sakshi News home page

సాయికృష్ణ లాకప్‌డెత్‌ వ్యవహారంపై ముగిసిన వాదనలు

Sep 23 2026 5:30 AM | Updated on Sep 23 2026 5:30 AM

Arguments over Sai Krishnas lockdown death case conclude

తల్లి విజయలక్ష్మి దాఖలు చేసిన వ్యాజ్యాల్లో తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు 

చార్జిషీట్‌ను సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని పోలీసులకు ఆదేశం  

సాక్షి, అమరావతి: తన కుమారుడు గాదె సాయికృష్ణ ఆచూకీ తెలియడం లేదని, అతడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని.. అలాగే అతడి లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆ­దేశించాలని కోరుతూ తల్లి గాదె విజయలక్ష్మి దా­ఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టులో వాదనలు మంగళవారం ముగిశాయి. వాదనలు విన్న హైకో­ర్టు తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. సా­యికృష్ణ లాకప్‌డెత్‌ వ్యవహారంపై కింది కోర్టులో దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను సీల్డ్‌ కవర్‌లో తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రవినాథ్‌ తిల్హరి, జస్టిస్‌ ఆలపాటి గిరిధర్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ­చేసింది. 

ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి తన కుమారుడు సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీసులు తీసుకొచ్చారని, తరువాత అతడి ఆచూకీ తెలియడం లేదని, ఈ నేపథ్యంలో అతన్ని కోర్టుముందు హాజరుపరిచేలా ఆదేశాలు జారీచేయాలని కోరు­తూ విజయలక్ష్మి ఈ ఏడాది జూన్‌లో హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం పెండింగ్‌లో ఉండగానే సాయికృష్ణను పోలీసులే కొట్టి చంపి, మృతదేహాన్ని దహనం చేశారన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో సాయికృష్ణ లాకప్‌డెత్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఆమె అనుబంధ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై జస్టిస్‌ తిల్హరీ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.  

అసాధారణ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు ఇవ్వొచ్చు  
ఈ వ్యాజ్యాలపై మంగళవారం ధర్మాసనం మరో­సారి విచారణ జరిపింది. విజయలక్ష్మి న్యాయవాది నర్సీపట్నం అశ్వనీకుమార్‌ వాదనలు వినిపిస్తూ.. సాయికృష్ణను పోలీసులు కస్టడీలోకి తీసుకుని దారుణంగా హింసించి, చంపేశారని చెప్పారు. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. అనంతరం ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సిట్‌కు అప్పగించిందని తెలిపారు. సిట్‌లో కూడా రాష్ట్ర పోలీసులే ఉండటంతో దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని, అందువల్ల దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని కోరుతున్నామని చెప్పారు. అసాధారణ కేసుల్లో సీబీఐ దర్యాప్తునకు న్యాయస్థానాలు ఆదేశించవచ్చని సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో చెప్పిందని వివరించారు. చార్జిషీట్‌ దాఖలు చేసిన తరువాత కూడా సీబీఐ దర్యాప్తునకు ఆదేశించవచ్చన్నారు.  

ఇది అంత అరుదైన కేసు కాదు  
పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. సాయికృష్ణ లాకప్‌డెత్‌ వ్యవహారంలో దర్యాప్తు పూర్తిచేసి సంబంధిత కోర్టులో చార్జిషీట్‌ దాఖలు చేశామన్నారు. నిందితులందరినీ అరెస్ట్‌ చేశామని తెలిపారు. కస్టోడియల్‌ హింస వల్లే సాయికృష్ణ మృతిచెందినట్లు ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు స్నేహితుడు, ఈ కేసులో నిందితుడు అయిన సురేష్‌ వాంగ్మూలం ఇచ్చారని చెప్పారు. సాయికృష్ణ మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేసినట్లు కూడా చెప్పారన్నారు. ఈ వాంగ్మూలంపై నిజానిజాలను నిర్ధారించాల్సి ఉందని తెలిపారు. అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సి ఉంటుందన్నారు. ఇది అలాంటి అత్యంత అరుదైన కేసు కాదని పేర్కొన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement