పరీక్ష రాయకుండానే టీచర్ ఉద్యోగాలు ఇచ్చిందెవరు?
కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు ఎలా ఇస్తారు?
డీఎస్సీ స్కామ్‌పై సీబీఐ విచారణ కోరితే యువగళం రౌడీలతో దాడులు
నిరసనకారులనే కొట్టి.. తిరిగి వారిపైనే తప్పుడు కేసులు
వాస్తవానికి సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు పెట్టాలి
అక్కడికి టీడీపీ గూండాలు ముందే ఎలా వచ్చారు? ఎవరు పంపితే వచ్చారు?.. పరీక్ష రాయకుండా వారు టీచర్లు ఎలా అవుతారు?
నిజాయితీగా.. మెరిట్‌పై ఉద్యోగాలు పొందిన వారు ఫీలవుతున్నారు
పరీక్ష రాయకుండా టీచర్లు అయిన వారితో తమకు పోలికేంటని ప్రశ్న
ప్రభుత్వం తమ గౌరవం తగ్గించే కార్యక్రమం చేస్తుందని ఆవేదన
ఎల్లో మీడియా సైతం వాస్తవాలు దాచి దుష్ప్రచారం
సాక్షి, అమరావతి: వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వంలో కుంభకోణాలపై నిరసన తెలుపడమే పాపమైపోతోంది. నిరసన తెలిపిన వారిపై యువగళం మూకతో దాడులు చేయించడమే కాక, బాధితులపైనే కేసులు పెట్టి.. అరెస్టులు చేయిస్తుండటం జంగిల్‌రాజ్ పాలనకు అద్దం పడుతోంది. డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన స్కామ్‌పై సీబీఐ విచారణ కోరుతూ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్‌సీపీ శ్రేణులపై దాడులు చేయడంతో ఆగకుండా అక్రమ కేసులు బనాయించడం కలకలం రేపుతోంది. పరీక్ష రాయకుండానే డీఎస్సీ స్పోర్ట్స్ కోటా కింద వందలాది మందికి టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టారు. స్పోర్ట్స్‌లో మెరిట్ చూడకుండా కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అధ్యక్షులుగా ఉన్న క్రీడా సంఘాల ద్వారా ఆయా పోటీల్లో పాల్గొనకపోయినా కూడా పాల్గొన్నట్లు తప్పుడు సర్టిఫికెట్లు జారీ చేసి పప్పు బెల్లాల్లా ఉపాధ్యాయ ఉద్యోగాలను పంచిపెట్టేశారు. ఆధారాలతో సహా ఈ స్కామ్ బయట పడటంతో చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ బాధ్యత వహించి.. లెంపలేసుకోవాల్సింది పోయి.. దొంగే దొంగా దొంగా అనిఅరచినట్లు వ్యవహరిస్తుండటం విస్తుగొలుపుతోంది. డీఎస్సీ కుంభకోణానికి సంబంధించి ఎన్నో ఆధారాలను వైఎస్సార్‌సీపీ బయట పెట్టినా, వాటికి మంత్రి లోకేశ్ నుంచి ఒక్క మాట కూడా సమాధానంగా రాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 21∙శాప్ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతామని వైఎస్సార్‌సీపీ ముందుగానే ప్రకటించింది. ఆ మేరకు సోమవారం విజయవాడలోని శాప్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ, నిరుద్యోగ యువత చేపట్టిన ఆందోళనకు పోటీగా ప్రభుత్వమే పోటీ ఆందోళన నిర్వహింప చేసింది. ఇందుకోసం జిల్లాల నుంచి స్పోర్ట్స్ కోటాలో నియమితులైన టీచర్లను రప్పించింది. వారి ముసుగులో టీడీపీ గూండాలనూ రంగంలోకి దించింది.
జీ హుజూర్ అన్న పోలీసులు
వైఎస్సార్‌సీపీ శాంతియుత నిరసనను అడ్డుకునేందుకు లోకేశ్ యువగళం మూకలు.. స్పోర్ట్స్ కోటాలో టీచర్ ఉద్యోగాలు పొందిన వారిని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడ్డాయి. దాడులను అడ్డుకోవాల్సిన పోలీసులు.. రెడ్‌బుక్ అరాచకాలకు జీ హుజూర్ అంటూ చోద్యం చూశారు. వారి చేతుల్లోని లాఠీలు లాక్కుంటున్నా మిన్నకుండిపోయారు. డీఎస్సీ స్కామ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని, బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌కు మంత్రి లోకేశ్ బదులివ్వలేక సమీకరించిన ఉపాధ్యాయులు, యువగళం మూకలను ఎగదోసినట్లు స్పష్టమవుతోంది. ఆ టీచర్లంతా సోమవారం సెలవుపై వచ్చారా? లేక ఆన్ డ్యూటీపై వచ్చారా? అని సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రభుత్వమే పనిగట్టుకుని వారిని పిలిపించి.. పథకం ప్రకారం వారితో గూండాలను కలిపి వైఎస్సార్‌సీపీ శ్రేణులపైకి ఉసిగొల్పిందని ఆ ఘటన తాలూకు వీడియోలు స్పష్టం చేస్తున్నాయి.
నిరసనకారులనే కొట్టి.. తిరిగి వారిపైనే తప్పుడు కేసులు
శాప్ కార్యాలయం ఎదుట జరిగిన ఘటనకు సంబంధించి వాస్తవానికి సీఎం చంద్రబాబు, లోకేశ్‌పై కేసులు పెట్టాలని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ఎందుకంటే అక్కడికి టీడీపీ గూండాలు ముందే ఎలా వచ్చారు? ఎవరు పంపితే వచ్చారు? అని ప్రశ్నిస్తున్నారు. లోకేశ్ ప్రమేయం లేకుండా యువగళం ముఠా ఇలా రెచ్చిపోయిందంటే ఎవరూ నమ్మరని చెబుతున్నారు. వాస్తవానికి వీరి చేతిలో దాడికి గురైంది దగాకు గురైన అభ్యర్థులు, విద్యార్థులు, యువత, వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు. వీరి ఫిర్యాదుల మేరకు టీడీపీ గూండాలపై కేసులు నమోదు చేయాలి. అయితే అలా కాకుండా టీడీపీ నేతలు చెప్పిన వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దుర్మార్గపు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అదీ ఏకంగా 500 మందికి పైగా కేసులు నమోదు చేయడం చూస్తుంటే ఆటవిక రాజ్య పాలనను తలపిస్తోంది.
వారిని తమతో పోల్చొద్దంటున్న మెరిట్ టీచర్లు
పరీక్ష రాయకుండా, కేవలం పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో టీచర్ ఉద్యోగాలు ఎలా ఇస్తారని.. మెరిట్‌పై టీచర్ ఉద్యోగాలు తెచ్చుకున్న వారు ప్రశ్నిస్తున్నారు. అలా తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన వారు టీచర్లు ఎలా అవుతారని నిలదీస్తున్నారు. అలాంటి వారందరితో తమను కలిపి పోలిక పెట్టవద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే తమ గౌరవం తగ్గించే కార్యక్రమం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిన ప్రతీసారి ఉద్యోగులను రాజకీయంగా వాడుకోవడం సరికాదని, ఉద్యోగ వర్గాల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై ఎల్లో మీడియా సైతం వాస్తవాలు దాచి దుష్ప్రచారం చేయడం దుర్మార్గం అని సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసుల లాఠీలు లాక్కొని దాడి చేసిన గూండాలు వీడియోల్లో కనిపిస్తుంటే.. వైఎస్సార్‌సీపీ నేతలు దాడులు చేశారని తిమ్మినిబమ్మి చేస్తోంది.


