అక్రమ కేసులు.. ఆపై అరెస్టులు | Police register a large number of cases and arrests against YSRCP cadre | Sakshi
Sakshi News home page

అక్రమ కేసులు.. ఆపై అరెస్టులు

Sep 23 2026 5:03 AM | Updated on Sep 23 2026 5:03 AM

Police register a large number of cases and arrests against YSRCP cadre

నరసరావుపేటలో డాక్టర్‌ గజ్జల గృహంలో పోలీసుల సోదాలు

ఏకంగా 500 మందిపై చంద్రబాబు సర్కారు దాష్టీకం

డీఎస్సీ స్కామ్‌పై నిరసన ర్యాలీ నిర్వహించడమే పాపం

నిరసనకారులపై దాడి చేసిన వారిపై మాత్రం కేసులు నిల్‌  

పోలీసులతో మూడు.. శాప్‌ డైరెక్టర్‌తో ఒక ఫిర్యాదు   

ఎస్సీ, ఎస్టీ కేసు కోసం నంద్యాల జిల్లా ఉపాధ్యాయుడితో ఫిర్యాదు 

నంద్యాల నుంచి వచ్చిన వ్యక్తికి ఇక్కడి నేతల పేర్లన్నీ ఎలా తెలుసు? 

అర్ధరాత్రిళ్లు ఇళ్ల వద్దకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేస్తూ పలువురి అరెస్ట్‌ 

సర్కారు, పోలీసుల తీరుపై సర్వత్రా విస్మయం

సాక్షి ప్రతినిధి, విజయవాడ/గుణదల (విజయవాడ తూర్పు)/తాడేపల్లి రూరల్‌/నరసరావుపేట: డీఎస్సీ స్కామ్‌పై నిరసన తెలిపే కార్యక్రమంలో పాల్గొన్నందుకు పోలీసులు పెద్ద సంఖ్యలో కేసులు పెట్టారు. మూడు కేసులు పోలీసులే పెట్టగా, మరో రెండు కేసులు శాప్‌ డైరెక్టర్, నంద్యాలకు చెందిన ఒక డీఎస్సీ ఉపాధ్యాయుడితో పెట్టించారు. ఈ ఐదు కేసులకు సంబంధించి ఐదు వందల మందికి పైగా కేసు నమోదు చేశారు. ఇదే సమయంలో యువగళం నేతలు పోలీసుల చేతుల్లో లాఠీలు లాక్కుని వైఎస్సార్‌సీపీ నేతలు, వికలాంగులపై దాడి చేసినా కేసులు పెట్టక పోవడం విస్తుగొలుపుతోంది. 

సెక్షన్‌ 30 అమలులో ఉందని చెబుతున్న పోలీసులు.. ప్లకార్డులు పట్టుకుని పోటీగా ఆందోళనకు దిగడానికి క్రీడల కోటాలో ఎంపికైన ఉపాధ్యాయులకు ఎలా అనుమతి ఇచ్చారో చెప్పడం లేదు. షామియానాలు వేసుకుని.. ప్లకార్డులు పట్టుకుని.. డీజే పెట్టుకుని.. వైఎస్సార్‌సీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిన వారిపై ఎందుకు కేసులు పెట్టలేదన్న ప్రశ్నకు పోలీసుల నుంచి స్పందన లేదు. ఉపాధ్యాయుల ముసుగులో అక్కడికి పెద్ద సంఖ్యలో చేరిన యువగళం కార్యకర్తలను అడ్డుకోకపోగా, వారికి ఎందుకు అండగా నిలబడాల్సి వచ్చిందో పోలీసులు చెప్పడం లేదు. 

పైగా తమ చేతుల్లో లాఠీలు లాక్కుని దాడులు చేసిన వారిపై పోలీసులు కేసులు ఎందుకు పెట్టలేదన్న వైఎస్సార్‌సీపీ నేతల ప్రశ్నలకు విజయవాడ పోలీసులు మౌనం వహిస్తున్నారు. ప్రభుత్వం చెప్పినట్లుగానే కేసులు నమోదు చేసి, వైఎస్సార్‌సీపీ నేతల కోసం పోలీసులు సోమవారం అర్ధరాత్రి నుంచి పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే విజయవాడ, గుంటూరు జిల్లాలో 33 మందిని అరెస్టు చేశారు. వీరికి ప్రభుత్వాస్పత్రిలో పరీక్షలు చేయించిన అనంతరం కోర్టులో హాజరు పరచనున్నారు. మంగళవారం ఉదయం నుంచి మాచవరం పోలీసు స్టేషన్‌ వద్ద పోలీసులు ఓవరాక్షన్‌ చేశారు. ఎవరినీ స్టేషన్‌ పరిసరాల్లోకి రానివ్వకుండా అడ్డుకున్నారు. పోలీసుస్టేషన్‌ గేట్లు కూడా వేసేశారు.  

హాస్యాస్పదంగా కేసుల నమోదు 
పోలీసులు పెట్టిన కేసులు కూడా ఎంత హాస్యాస్పదంగా ఉన్నాయంటే నంద్యాల నుంచి వచ్చిన ఒక ఉపాధ్యాయుడికి వైఎస్సార్‌సీపీ నేతల పేర్లు అన్నీ తెలుసు అన్నట్లుగా అతని నుంచి ఫిర్యాదు తీసుకున్నారు. పైగా తనను అడ్డుకుని పేరు, కులం అడిగి మరీ తిట్టారంటూ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. నంద్యాలకు చెందిన డీఎస్సీ ఉపాధ్యాయుడు సుగాలి వెంకటరాముడు నాయక్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్రైం నంబర్‌ 296/2026 కింద 221,223,285,127(2), 132, 189(3), సెక్షన్‌  3(1)(ఎస్‌) ఎస్సీ, ఎస్టీ(పీఓఏ) యాక్ట్‌ 1869 ప్రకారం దుర్గారావు, అరవ సత్యం, జోగారావు, రవిచంద్ర, షేక్‌ సుభానీ, జాన్సీ రాణి, గుండె సుందర్‌పాల్, పానుగంటి చైతన్య, అరుణ్, సందీప్, దొడ్డా అనీల్‌రెడ్డి, ఎ.రవిచంద్ర, నాగిరెడ్డి, గోవింద్, ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, బలసాని కిరణ్‌కుమార్, కల్లం ప్రభాకర్, నాగార్జున యాదవ్, పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా, దేవినేని అవినాష్‌ మరికొందరిపై కేసు నమోదు చేశారు. మాచవరం పోలీసు స్టేషన్‌లో 295/2026 కింద శాప్‌ ఉద్యోగి సుధాబత్తుల సంతోష్‌కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదుపై 221, 223, 127(2)132,189(3), 109(1), బీఎన్‌ఎస్‌3(2)(వీ) ఎస్సీ, ఎస్టీ పీఓఏ యాక్ట్‌ కింద పార్టీ నేతలు పానుగంటి చైతన్య, ఎస్‌.సందీప్, ప్రవీణ్‌ యాదవ్‌ మరికొందరిపై కేసు నమోదు చేశారు. 

రెడ్‌సర్కిల్‌ వద్ద ప్రదర్శనగా వచ్చిన వైఎస్సార్‌సీపీ నేతలపై మాచవరం ఎస్‌ఐ ఉంగరాల యోగేష్‌ సూర్యారావుపేటలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు 116/2026 కింద 250 మందిపై 221, 223(బీ), 285, 126(2), 132, 191(2), రెడ్‌ విత్‌ 190 ఆఫ్‌ బీఎన్‌ఎస్‌ఎస్‌ 2023 సెక్షన్, 32 ఆఫ్‌ పోలీసు యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. కృష్ణలంక పోలీసు స్టేషన్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ ఐదో ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ ఫణేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు 250 మందిపై ఫిర్యాదు చేశారు. 174/2026 కింద 189(2), 189(3), 221, 132, 223, 126(2), 191(2), 190, పోలీసు యాక్టు 1861 ప్రకారం, సెక్షన్‌ 30 యాక్టు ప్రకారం కేసు నమోదు చేశారు. కృష్ణలంక ఎస్‌ఐ ఎన్‌.వి.లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 175/2026 ప్రకారం వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్‌ హుస్సేన్, పార్టీ నేతలు యడ్ల గంగా సురేష్, చాట్ల షఫీ, షేక్‌ నాగుల్‌మీరా, దొండపాటి ఇంద్రారెడ్డిపై కేసు నమోదు చేశారు.

గుంటూరు జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షులు సురేంద్రను అరెస్ట్‌ చేసి తీసుకువెళుతున్న విజయవాడ పోలీసులు 

అరెస్టుల పర్వంలో పోలీసుల ఓవర్‌ యాక్షన్‌
సోమవారం ర్యాలీలో పాల్గొన్న విజయవాడకు చెందిన నాగరాజు, సురేంద్ర, సుందర్‌పాల్‌పై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు, పలు నాటకీయ పరిణామాల మధ్య అదే రోజు అర్ధరాత్రి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై పలు పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ తిప్పారు. అర్ధరాత్రి దాటాక మాచవరం స్టేషన్‌కు తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం అక్కడికి చేరుకున్న బాధి­తుల కుటుంబ సభ్యులు, సానుభూతి పరులు ఎవరూ లోనికి రాకూడదంటూ పోలీసులు హుకుం జారీ చేశారు. ఇక్కడి నుంచి వెళ్లకపోతే తీవ్ర చర్యలు తప్పవంటూ బెదిరించారు.

వైద్య పరీక్షల అనంతరం ఆ ముగ్గురిని మొగల్రాజపురం ప్రాంతంలోని జడ్జి ఇంటి వద్ద హాజరు పరిచారు. మరోవైపు వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం గుంటూరు జిల్లా అధ్యక్షుడు గడ్డేటి సురేంద్ర నివసిస్తున్న కుంచనపల్లిలోని అపార్టుమెంట్‌ వద్దకు విజయవాడ పోలీసులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. నలుగురు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలు, మహిళా ఎస్‌ఐ, 10 మంది సిబ్బంది.. సురేంద్ర కుటుంబ సభ్యులను, అక్కడ నివసించే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ అపార్ట్‌మెంట్‌ మొత్తం తిరిగారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, వైఎస్సార్‌సీపీ రూరల్‌ అధ్యక్షుడు అమరా నాగయ్య, తాడేపల్లి రాష్ట్ర కార్యదర్శి (పార్లమెంట్‌), తాడేపల్లి పట్టణ అధ్యక్షులు బుర్రముక్కు వేణుగోపాల సోమిరెడ్డి, న్యాయవాది బాజి గంగాధర్‌ సురేంద్ర ఇంటికి చేరుకున్నారు. 

41 నోటీసులు ఇవ్వకుండా ఎలా తీసుకువెళతారని వేమారెడ్డి, బాజీ గంగాధర్‌ తదితరులు పోలీసులను ప్రశ్నించారు. వారు ఎటువంటి సమా­ధా­నం ఇవ్వలేదు. ఈ క్రమంలో తాడేపల్లి సీఐ.. సురేంద్ర కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సోమవారం అర్ధరాత్రి పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఉంటున్న సత్తెనపల్లి వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ గజ్జల సుధీర్‌భార్గవరెడ్డి గృహంలో సోదాల పేరిట విజయవాడ మాచవరం పోలీసులు హల్‌చల్‌ చేశారు. స్థానిక టుటౌన్‌ పోలీసుల సహాయంతో తెల్లవారే వరకు సోదాలు కొనసాగించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ గోపిరెడ్డి శ్రీని­వా­సరెడ్డి మీడియాతో మాట్లాడుతూ డాక్టర్‌ గజ్జల బెడ్‌రూమ్‌లలో కూడా సోదాలు నిర్వహించటం అమానుషం అన్నారు. మెరిట్‌ ఆధారంగా ఉద్యోగాలు పొందిన వారికి తాము వ్యతిరేకం కాదని, డీఎస్సీ స్కామ్‌కు బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement