పతాకస్థాయికి చంద్రబాబు సర్కార్ రాజకీయ కక్షసాధింపు
ఐదేళ్ల నాటి కేసుతో ఇప్పుడు వేట.. 51 మందిపై రౌడీషీట్లు!
జాబితాలో ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, దేవినేని అవినాష్ సహా పలువురు నేతలు
విజయవాడలోని 9 పోలీస్ స్టేషన్లకు ప్రత్యేక ఆదేశాలు
నలుగురు ఏసీపీలకు ప్రత్యక్ష పర్యవేక్షణ బాధ్యతలు.. 2024లో అధికారం చేపట్టగానే ఇదే కేసులో అక్రమ అరెస్టులు, దారుణమైన నిర్బంధం
కోర్టు రక్షణ పొందినవారిపై ఇప్పుడు చర్య ఎందుకంటున్న న్యాయనిపుణులు
డీఎస్సీ అక్రమాలపై డైవర్ట్ చేయడానికి ఇది మరో కుట్ర
స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాన్ని భయపెట్టే కుతంత్రం
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ అరాచకాలకు పరాకాష్టగా కక్ష సాధింపు రాజకీయాలకు చంద్రబాబు ప్రభుత్వం మరో కుట్రకు తెరతీసింది. తప్పు మీద తప్పు చేస్తున్న చంద్రబాబు సర్కారును ప్రశ్నిస్తున్న ప్రతిపక్షంపై ‘రౌడీ ముద్ర’ వేయడానికి బరితెగించింది. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్‌సీపీకి చెందిన ఎమ్మెల్సీతోపాటు ఏకంగా 51 మంది నేతలు, మాజీ కార్పొరేటర్లు, కార్యకర్తలపై ఒకేసారి రౌడీషీట్లు తెరిచేందుకు ఆదేశాలు జారీచేసింది. డీఎస్సీ స్కామ్‌లో ప్రజా కోర్టులో దోషిగా నిలబడిన తన తనయుడు లోకేశ్‌ను రక్షించుకునేందుకు చంద్రబాబు మరో డైవర్షన్ కుట్రకు పోలీసులను ప్రయోగించారు.
మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తరుణంలో వైఎస్సార్‌సీపీ నేతలపై అణచివేత చర్యలకు దిగారు. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు ఈ అసాధారణ ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఐదేళ్ల క్రితం నాటి ఘటనను సాకుగా చూపి ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ తోపాటు 51మందిపై రౌడీషీట్లు తెరవాలంటూ విజయవాడ సీపీ ఆయా పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఉత్తర్వులు ఇచ్చారు. ఇది ప్రతిపక్ష పార్టీపై రౌడీ ముద్ర వేసే కుట్ర అని పలువురు విమర్శిస్తున్నారు.
డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ పోరు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న వేళ చంద్రబాబు ప్రభుత్వం సమాధానం చెప్పలేక చేతులెత్తేసింది. అందుకే ఐదేళ్ల క్రితం నాటి కేసును ఇప్పుడు డైవర్షన్ కోసం వాడుకుంటోంది. హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చిన వారిని, పోలీసులే అరెస్టు అవసరం లేదని నోటీసులు ఇచ్చిన వదిలేసిన వారిని ఇప్పుడు రౌడీలుగా చిత్రీకరించేందుకు సిద్ధమైంది. వైఎస్సార్‌సీపీ నేతలపై రౌడీషీట్లు తెరిచే బాధ్యతలను తొమ్మిది పోలీస్స్టేషన్లకు ఆదేశాలు ఇవ్వడంతోపాటు నలుగురు ఏసీపీలకు ప్రత్యక్ష పర్యవేక్షణ అప్పగించారు. ఒక్కరు కూడా తప్పించుకోకుండా పకడ్బందీ కుట్ర ఇది. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో సాగుతున్న రాజకీయ వేట కాక మరేమిటన్న ప్రశ్న ఇప్పుడు రాష్ట్రమంతా ప్రతిధ్వనిస్తోంది.
2021 కేసు.. ఐదేళ్లకు ఆగమేఘాలపై ఆదేశాలు..
మంగళగిరి టీడీపీ కార్యాలయంపై 2021 జరిగిన ఘటనకు సంబంధించి మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన క్రైం నంబర్ 650/2021 కేసును సాకుగా చూపుతూ ఈ ఆదేశాలు ఇచ్చారు. సీరియల్ నెంబర్ 210/ఎస్‌బీ/ఎస్3/2026 పేరిట మంగళవారం(22.09.2026) కమిషనరేట్ నుంచి మెమో జారీ అయింది. భవానీపురం, అజిత్‌సింగ్‌నగర్, నున్న, కృష్ణలంక, మాచవరం, పటమట, గవర్నర్‌పేట, గుణదల, సత్యనారాయణపురం స్టేషన్ల ఎస్‌హెచ్‌ఓలు తమ పరిధిలోని వారిపై రౌడీషీట్లు తెరిచి వెంటనే నివేదిక పంపాలని ఆదేశించారు. వెస్ట్, నార్త్, సౌత్, సెంట్రల్ ఏసీపీలు ఈ ప్రక్రియను ‘వ్యక్తిగతంగా‘ పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. ఒక కేసులో నిందితులపై ఇంత హడావుడిగా, ఇంత పెద్దఎత్తున రౌడీషీట్ల ఆపరేషన్ చేపట్టడం వెనుక ఉన్న రాజకీయ లక్ష్యం ఏమిటో చెప్పనక్కర్లేదు.
ప్రజాప్రతినిధులూ ‘రౌడీలే’నట!
జాబితాలో ఎమ్మెల్సీ తలశిల రఘురాం, విజయవాడలో వైఎస్సార్‌సీపీకి వెన్నెముకగా ఉన్న దేవినేని అవినాష్, మాజీ ఫ్లోర్ లీడర్ అరవ సత్యం, మాజీ కార్పొరేటర్ కాలపాల అంబేడ్కర్ సహా డివిజన్ స్థాయి నాయకులంతా ఉన్నారు. చట్టసభ సభ్యుడిని, ప్రజలు ఓట్లేసి గెలిపించిన ప్రతినిధులను రౌడీల జాబితాలో చేర్చడం ప్రజాస్వామ్యం ముఖంపై ఉమ్మేయడమేనని ప్రజాస్వామ్యవాదులు మండిపడుతున్నారు. ఆటో డ్రైవర్లు, డీజే ఆపరేటర్, చిరుద్యోగులు, సామాన్య కార్యకర్తలు, చివరకు ఒక మహిళ కూడా ఈ జాబితాలో ఉండటం సర్కారు కక్ష ఎంత లోతుగా ఉందో చెబుతోంది.
న్యాయస్థానం రక్షణ కల్పించినవారిపై రౌడీషీట్లా..?
రౌడీషీట్లు తెరవాలంటూ పంపిన జాబితానే పోలీసుల తీరును నిలదీస్తోంది. 51 మందిలో 19 మందికి హైకోర్టు ముందస్తు బెయిల్ (క్రిమినల్ పిటిషన్ నం.6546/2024, తేదీ 01.10.2024) మంజూరు చేసింది. తలశిల రఘురాం, దేవినేని అవినాష్ సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు కూడా చేయలేదు, కేవలం నోటీసులు ఇచ్చి పంపారు. మరో 14 మంది విషయంలో అరెస్టు, బెయిల్ వివరాలేవీ జాబితాలో లేవు. అంటే న్యాయస్థానం రక్షణ కల్పించినవారిని, స్వయంగా పోలీసులే అరెస్టు అవసరం లేదని భావించినవారిపై ఇప్పుడు ఉన్నపళంగా రౌడీషీట్లు ఓపెన్ చేయడమేమిటి? ఇది కోర్టు ఇచ్చిన రక్షణను దొడ్డిదారిన నిర్వీర్యం చేసే ప్రయత్నమేనని, ప్రజాస్వామ్య వ్యవస్థలో అధికారంలో ఉన్నవారు ఇలాంటి కక్షసాధింపు చర్యలకు దిగడం విచారకరమని న్యాయనిపుణులంటున్నారు.
డీఎస్సీ అక్రమాలు... స్థానిక ఎన్నికలు.. ఇదే నేపథ్యం..
ఘటన జరిగింది 2021లో. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటింది. సంబంధం లేనివారిపై కేసులు, అరెస్టులు, నోటీసులు, బెయిళ్లు అన్నీ కూటమి ప్రభుత్వం వచ్చీరాగానే 2024లోనే ముగిశాయి. మరి ఇన్నాళ్లూ గుర్తుకురాని రౌడీషీట్లు సరిగ్గా డీఎస్సీ పోరు ఊపందుకున్న వేళ, మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ ఎందుకు గుర్తొచ్చాయి? అలవాటుగా నేరాలు చేసేవారిపై, శాంతిభద్రతలకు నిరంతర ముప్పుగా మారినవారిపై తెరవాల్సిన రౌడీషీట్లను.. కోర్టులో విచారణ దశలో ఉన్న ఒక్క కేసు ఆధారంగా టోకుగా 51 మందిపై ఎలా తెరుస్తారు? ఏ నిబంధనలు ఇందుకు అనుమతిస్తున్నాయి? ఈ ప్రశ్నలకు పోలీసు పెద్దల దగ్గర సమాధానం లేదు. ఉన్నదల్లా పైనుంచి వచ్చిన ఆదేశాలేనన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
డీఎస్సీ పోరుపై ఉక్కుపాదం
డీఎస్సీ అక్రమాలపై నిరుద్యోగుల పక్షాన వైఎస్సార్‌సీపీ వీధుల్లోకి రావడంతో సర్కారు ఉక్కిరిబిక్కిరవుతోంది. లక్షలాది మంది నిరుద్యోగుల ఆవేదనకు జవాబు చెప్పలేక, ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న నాయకులను భయపెట్టి ఇళ్లకే పరిమితం చేయాలన్న కుట్రే ఈ రౌడీషీట్ల వెనుక ఉందని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. రౌడీషీట్ పడితే వారం వారం స్టేషన్‌లో హాజరు, నిరంతర నిఘా, కదలికలపై ఆంక్షలు. ప్రతిపక్షాన్ని నోరెత్తకుండా చేయడమే అసలు లక్ష్యం.
రాష్ట్ర చరిత్రలో చీకటి అధ్యాయం..
అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెడ్‌బుక్ పేరుతో సాగుతున్న వేధింపులు ఇప్పుడు అధికారిక మెమోల రూపం దాల్చాయి. అక్రమ కేసులు, అరెస్టులతో ఆగని కక్షసాధింపు.. ఇప్పుడు ఏకంగా ఒక పార్టీ నాయకత్వాన్నే నేరగాళ్ల జాబితాలోకి ఎక్కించే స్థాయికి చేరింది. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం గొంతు నొక్కేందుకు పోలీసు వ్యవస్థను ఇంత బాహాటంగా పావుగా వాడుకోవడం రాష్ట్ర చరిత్రలో ఓ చీకటి అధ్యాయంగా మిగిలిపోతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. నేడు ప్రతిపక్ష నేతలు.. రేపు ప్రశ్నించే ప్రతి పౌరుడు. ఇదే కొనసాగితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి ఇక చోటెక్కడ?


