దందాకు‘సహకారం’ | Corruption in primary agricultural cooperatives | Sakshi
Sakshi News home page

దందాకు‘సహకారం’

Sep 23 2026 5:14 AM | Updated on Sep 23 2026 5:14 AM

Corruption in primary agricultural cooperatives

అవినీతికి అడ్డాగా ‘పీఏసీఎస్‌’లు 

ఉమ్మడి పశ్చిమలో 25 సొసైటీల్లో గోల్‌మాల్‌ 

టి.నర్సాపురంలో రూ.23 కోట్ల అవకతవకలు 

విచారణ పేరిట పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం 

బాధ్యులపై చర్యలు, సొమ్ము రికవరీ నిల్‌  

సాక్షి ప్రతినిధి, ఏలూరు: అన్నదాతలకు సీజన్‌లో ఎరువులు, రుణాలు అందించి చేదోడు వాదోడుగా నిలవాల్సిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌) అవినీతికి అడ్డాగా మారుతున్నాయి. అత్యధిక టర్నోవర్‌ ఉండే సొసైటీల్లో అడ్డగోలుగా అవకతవకలు సాగుతున్నా శాఖాపరమైన చర్యలు శూన్యం. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోనే గత ఏడాది వ్యవధిలో 25 సొసైటీల్లో భారీ అవకతవకలు జరిగినట్లు తేలడం కలకలం రేపుతోంది. అత్యధికంగా టి.నర్సాపురంలో రూ.23 కోట్ల మేర అవినీతి జరిగినట్టు నిర్ధారించారు. అక్ర­మాలకు పాల్పడిన వారితో కుమ్మక్కై ఒక ప్యాకేజీ మాట్లా­డుకుని అవినీతిని తక్కువగా చూపించడం.. మొక్కుబడిగా విచారణ తంతు ముగించడం సహకార శాఖలో ఆనవాయితీగా మారింది. 

బాధ్యత వదిలేసి బరి తెగింపు..
ఉమ్మడి పశ్చిమ గోదావరిలో 256 కో–ఆపరేటివ్‌ సొసైటీలు ఉండగా వీటి ద్వారా రైతులకు రుణాలతోపాటు ఎరువులు, పురుగు మందులు సరఫరా చేయాలి. అయితే సొసైటీల్లో పెద్దఎత్తున గోల్‌మాల్‌ జరిగినా బాధ్యులపై ఎలాంటి చర్యలు ఉండటం లేదు. ఏకంగా జిల్లా సహకార శాఖాధికారి ఆరిమిల్లి శ్రీని­వాస్‌పైనా రైతులు ఫిర్యాదులు చేస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. 

తాడేపల్లిగూడెం మెయిన్‌బజార్, పెనుగొండ, పెనుమంట్ర, కొమ్మర్రు, టి.నర్సాపురం, రంగాపురం, రాఘవాపురం, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, లక్కవరం, కామవరపుకోట, సరిపల్లి, పందలపర్రు, రాపాక, సిద్ధాంతం, తీపర్రు, అన్నవ­రప్పాడు, బాదంపూడి, కట్కూ­రు, గోపాలపురం, చాగల్లు, యలమంచిలి తదితర సొసైటీల్లో అవకతవ­కలు జరిగినట్లు నిర్ధారించారు. నకిలీ బంగారంపై రుణాలు మంజూరు చేసిన ఘటనలు, బినామీ రుణాలపై సెక్షన్‌ 51 ప్రకారం ఎంక్వయిరీలు నిర్వహించారు. వీటిలో రాఘవాపురం, చింతలపూడి, లక్కవరం, పెరవలి మినహా మిగతా చోట్ల విచారణలు పూర్తయినా బాధ్యులపై చర్యలు గానీ క్రిమినల్‌ కేసులు గానీ రికవరీలు గానీ లేకపోవడం గమనార్హం.

సస్పెండ్‌ చేసి సెట్‌రైట్‌..!
టి.నర్సాపురం సొసైటీలో రూ.23.25 కోట్ల మేర అవినీతి జరిగిందని విచారణాధికారి నిర్ధారించారు. రంగాపురం సొసైటీలో రూ.2.06 కోట్లు, కామవరపుకోటలో రూ.2 కోట్లు, జంగా­రెడ్డిగూడెం సొసైటీలో రూ.2 కోట్లు, వట్లూరు సొసైటీలో రూ.కోటి, విజయరాయి సొసైటీలో రూ.కోటి, కోరుమిల్లి సొసైటీలో రూ.కోటి మేర అవినీతి జరిగినట్లు తేలింది. విచారణ అనంతరం సొసైటీ కార్యదర్శిని బ్యాంకు అధికారులు సస్పెండ్‌ చేసి అంతా సరైపోయిందనే రీతిలో వ్యవహరిస్తున్నారు. అవినీతి పరిమాణాన్ని తగ్గించినందుకు, బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోనందుకు విచారణాధికారి మొదలు జిల్లా అధికారుల వరకు ముడుపులు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి.

రూ.కోటికి రూ.10 లక్షల చొప్పున..
అవినీతి ఫిర్యాదులపై సొసైటీల్లో విచారణ అధికారులకు కాసులు కురిపిస్తోంది. రూ.కోటి అవినీతి జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించి కార్యాలయానికి నోటీసులిచ్చి బాధ్యులను పిలిపిస్తున్నారు. అనంతరం వారితో మాట్లాడుకుని అవినీతి పరిమాణాన్ని తగ్గించి వసూళ్లకు తెర తీస్తున్నారు. రూ.30 లక్షలే గుర్తించినట్లు నివేదిక సిద్ధం చేస్తున్నారు. అవినీతి పరిమాణంలో రూ.70 లక్షలు తగ్గించాం కాబట్టి రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండటానికి మరో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేస్తున్నారు. 

సాధారణంగా జిల్లా సహకార శాఖ కార్యాలయం లేదా డివిజనల్‌ కార్యాలయంలో సీనియర్‌ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్‌ డీసీవో స్థాయి అధికారులను విచారణాధికారులుగా నియమి­స్తారు. విచారణాధికారిగా నియామకాల కోసం భారీ డిమాండ్‌ నెలకొంది. ఉమ్మడి పశ్చిమలో ఉన్నతా­ధికారులకు అనుకూలంగా ఉండే ముగ్గురి ద్వారానే విచారణలు నిర్వహిస్తున్నారు. నిబంధనల ప్రకారం అవినీతి నిర్ధారణ అయిన మొత్తాన్ని రికవరీ చేయడం, బా«ధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం, ప్రాపర్టీ అటాచ్‌ చేసుకోవడం లాంటివి చేయాలి. అయితే ముగ్గురు నలుగురు కార్యదర్శుల సస్పెన్షన్‌ మినహా మిగిలిన వారిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement