మానసిక సమస్యలు వస్తాయి
23 వేలకు పైగా ఇంజెక్షన్లు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: శస్త్ర చికిత్సల అనంతరం రోగి నొప్పులు తగ్గడానికి, అదీ అవసరమైతేనే వైద్యులు ఇచ్చే ట్రామడాల్ ఇంజెక్షన్లను కొందరు మందుల విక్రేతలు పక్కదారి పట్టించి, యువతను దానికి బానిసలను చేస్తున్నారు. గంజాయి వంటి నిషేధిత డ్రగ్స్‌కంటే చవగ్గా లభిస్తుండటం, ఎక్కువ మత్తు కలుగుతుండటంతో యువత కూడా వీటికి బానిసలై ఆరోగ్యాన్ని చెడగొట్టుకొంటున్నారు. వీటిని ఎక్కువగా వాడితే నరాల బలహీనత, నడవలేని స్థితికి చేరుకోవడంతో పాటు మూర్ఛ వ్యాధి కూడా వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేనిదే వీటిని ఎవరికీ విక్రయించకూడదు. అయినా మందుల డీలర్లు డబ్బు కోసం యువతను వీటికి బానిసలుగా మార్చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఇంజెక్షన్లను విచ్చలవిడిగా వాడేస్తున్నట్లు ఇటీవల సంఘటనలు వెల్లడిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో పదులు, వందల సంఖ్యలో కాదు.. చిన్న మెడికల్ షాపుల్లోనే వే ల సంఖ్యలో ఇంజెక్షన్లు అమ్మడవుతున్నాయంటే ఏ స్థాయిలో వీటి దందా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలంలోని వేగవరం హైస్కూల్ సమీపంలోని ఆయిల్‌పామ్ తోటలో వాడేసిన వందలాది ట్రామడాల్ ఇంజెక్షన్లు కుప్పలుగా లభించడం కలకలం రేపింది. దీంతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఔషధ నియంత్రణ శాఖాధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.
ప్రిస్కిప్షన్ ఉంటేనే అమ్మాలి
2018లో భారత ప్రభుత్వం ట్రామడాల్‌ను హెచ్–1 డ్రగ్‌గా గుర్తించి వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలని ఆదేశించింది. ఈ ఇంజెక్షన్లను సర్జరీలు అయిన తరువాత తీవ్ర నొప్పులు ఉండే రోగులకు, యుద్ధరంగంలో ఉండే సైనికులకు అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగించాలనేది అధికారిక నిబంధన. అయినా అతి తక్కువకు దొరుకుతున్న మత్తు ఉత్ప్రేరకం కావడం, ఔషధ నియంత్రణ శాఖ, ఇతర శాఖల పర్యవేక్షణ లేకపోవడంతో ట్రామడాల్ విక్రయాలు అడ్డగోలుగా సాగిపోతున్నాయి.
ట్రామడాల్ మత్తు ఇంజెక్షన్లకు బానిసవుతున్న యువత
ఆపరేషన్ల తరువాత తీవ్ర నొప్పులు తగ్గించడానికి వినియోగించే మందు ఇది
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేనిదే విక్రయించకూడదని నిబంధనలు
నిబంధనలు బేఖాతరు చేస్తున్న కొన్ని మందుల దుకాణాలు
వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండానే యువతకు ఎంఆర్‌పీ కంటే ఎక్కువ ధరకు విక్రయం
ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో విచ్చలవిడిగా విక్రయాలు
ట్రామడాల్ వంటి ఇంజెక్షన్లను ఇష్టానుసారం వినియోగించడం తీవ్ర ప్రమాదకరం, చట్టరీత్యానేరం. వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా వీటిని ఇవ్వకూడదు. ట్రామడాల్ ఇంజెక్షన్లు అధికంగా వాడటం వల్ల మానసిక సమస్యలు పెరుగుతాయి. వీటికి బానిసై పూర్తిగా మానసిక స్థితిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. మూర్చ వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది.
– డాక్టర్ బంకా రవికుమార్, న్యూరోసర్జన్
ఏజెన్సీలో గత రెండేళ్లలోనే రెండు మెడికల్ షాపుల్లో 23 వేలకు పైగా ఇంజెక్షన్లు అమ్ముడైనట్టు తేలడంతో అధికారులు అవాక్కయ్యారు. వేగవరంలో లభ్యమైన ఇంజెక్షన్లు జంగారెడ్డిగూడెంలోని లక్ష్మీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ, రూప పెద్దింటి మెడికల్ ఏజెన్సీలో విక్రయించినట్లు నిర్ధారించుకున్నారు. లక్ష్మీ శ్రీనివాసలో కేవలం రెండు నెలల్లోనే రూ.5 లక్షల విలువైన 20 వేల ట్రామడాల్ ఇంజెక్షన్లను ఎలాంటి బిల్లు లేకుండా అమ్మినట్లు నిర్ధారించారు. రూప పెద్దింటి మెడికల్ ఏజెన్సీలో 3,800 వైల్స్‌ను ఆంధ్రతో పాటు సరిహద్దుల్లోని తెలంగాణ మెడికల్ షాపునకు విక్రయించినట్లు సమాచారం. దీంతో ఆ ఏజెన్సీల నిర్వాహకులు లక్ష్మణ సాయికిషోర్, ఏలూరు సతీష్, దుర్గాప్రసాద్, దేవర రాజశేఖర్, తమ్మిశెట్టి చిరంజీవి, మాధవరపు శివ కృష్ణలను అరెస్టు చేశారు. అలాగే కుక్కునూరు మండలంలో ఆర్‌ఎంపీ డాక్టర్ పగిళ్ల నాగేంద్ర వద్ద 73 ఇంజెక్షన్లు స్వాధీనం చేసుకుని, ఆయన్ని అరెస్టు చేశారు. ఇలా జిల్లాలో మొత్తం 44 షాపుల్లో తనిఖీలు చేసి, కొన్నింటిపై కేసులు నమోదు చేశారు. జంగారెడ్డిగూడెం, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి తదితర ప్రాంతాల్లోని మందుల దుకాణాల్లో రెండేళ్లల్లోనే వేల సంఖ్యలో ఇంజెక్షన్లు అమ్ముడైనట్లు గుర్తించారు. అది కూడా ఎంఆర్‌పీ రేటు కంటే ఎక్కువకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.


