భీమడోలు: జిల్లాలో త్వరలో వంద మీ మార్ట్‌లు ఏర్పాటు చేయనున్నామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. మంగళవారం పూళ్ల, ఎంఎంపురం గ్రామాల్లో సర్, రీసర్వే, మీ మార్ట్ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. సర్, రీసర్వేలపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఎంఎం పురంలో రేషన్ షాపు–32లో ఏర్పాటు చేస్తున్న మీ మార్ట్‌ను సందర్శించారు. జిల్లాలోని రేషన్ షాపులను కార్పొరేట్ మార్ట్‌లకు దీటుగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇక్కడ నిత్యావసర సరుకులు తక్కువ ధరకు లభిస్తామన్నారు. తహసీల్దార్ బి.రమాదేవి, డీఎస్‌వో విలియమ్స్, సీఎస్‌డీటీ భరత్‌కుమార్, ఆర్‌ఐ ఎంపీ జగన్నాథం ఉన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే నెలలో జిల్లాలోని 38 గ్రామాల్లో 27,114 పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ జి.జయలక్ష్మి రాష్ట్ర సచివాలయం నుంచి జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్ మాట్లాడారు. ఈ నెలలో 32 గ్రా మాల్లో 13,131 పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ చేశామన్నారు. జిల్లాలో 22ఏ భూ సమస్యలపై జూన్ 15 నుంచి ఈనెల 21 వరకు 480 దరఖాస్తులు అందగా వాటిలో 210 పరిష్కరించామని, నిబంధనల మేరకు లేని 193 దరఖాస్తులను తిరస్కరించామన్నారు. పెండింగ్‌లో ఉన్న 77 దరఖాస్తులను నిర్దేశిత సమయంలోపు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. పీజీఆర్‌ఎస్ అర్జీలకు నాణ్యమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్‌చార్జి డీఆర్వో ఎం.ముక్కంటి, నూజివీడు సబ్ కలెక్టర్ బి.వినూత్న, ఆర్డీఓలు లక్ష్మీప్రసన్న, రమణ పాల్గొన్నారు.
పెదవేగి: మండలంలోని వంగూరు గ్రామంలో పేరుమల పెద్దింట్లు (65) అనే వృద్ధురాలు మంగళవారం ప్రమాదవశాత్తూ కోనేరు పడి మృతిచెందింది. పెదవేగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తణుకు అర్బన్: ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఐలు) జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని న్యాయవాదులు పిలుపునిచ్చారు. మంగళవారం తణుకు బార్ అసోసియేషన్ భవనం వద్ద ఈనెల 26న భీమవరంలో నిర్వహించనున్న మహాసభల కరపత్రాలను ఆవిష్కరించారు. బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బింకం రవికుమార్ మాట్లాడుతూ ఆలిండియా లాయర్స్ యూనియన్ న్యాయవాదుల కోసం, న్యాయ విద్యార్థులు, న్యాయ అధ్యాపకులు, ప్రజా సమస్యలపైనా పనిచేసే సంఘం అని అన్నారు. ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా కమిటీ సభ్యుడు కౌరు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ న్యాయవాదులకు కూటమి ప్రభుత్వం వృత్తి రక్షణ చట్టాన్ని చేయాలని విజ్ఞప్తి చేశారు. న్యాయవాదులు పొట్ల సురేష్, జి.అంబేడ్కర్, కొండా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.


