తీవ్ర ఇబ్బంది
మాపై చిన్నచూపు
● చిన్నపాటి గాలికే కోతలు
● గంటల తరబడి సరఫరా నిలిపివేత
● పదేళ్లుగా తీరని విద్యుత్ కష్టాలు
కుక్కునూరు: పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో రాష్ట్రంలో విలీనమైన కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు విద్యుత్ కష్టాలు వీడటం లేదు. విలీనమైన నాటి నుంచి ఇప్పటివరకూ విద్యుత్ సరఫరాలో అంతరాయాలు కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోజూ గంటల తరబడి విద్యుత్ అంతరాయం కలుగుతుండటంతో ముఖ్యంగా రాత్రివేళల్లో పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారు. దోమల బెడదతో నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తోందని వాపోతున్నారు.
చిన్నపాటి గాలికే..
కొద్దిపాటి గాలి వీచినా, వర్షం పడినా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం సర్వసాధారణంగా మారింది. ఒకసారి సరఫరా నిలిచిపోతే గంటల తరబడి పునరుద్ధరణ కావడం లేదు. దీంతో విద్యుత్‌పై ఆధారపడి సాగుతున్న అన్నివర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడుతోంది.
హామీలకే పరిమితం
విలీన మండలాల విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పోలవరం జిల్లా నెల్లిపాక 33 కేవీ విద్యుత్ కేంద్రం నుంచి గోదావరి మీదుగా కొత్త విద్యుత్ లైన్ ఏర్పాటుకు గతంలో సర్వే నిర్వహించారు. దీనివల్ల కుక్కునూరు, వేలేరుపాడు మండలాలకు విద్యుత్ సరఫరా మరింత మెరుగుపడుతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు చెప్పినా ఆచరణలో మాత్రం పనులు ముందుకు సాగలేదు.
సర్వే.. టెండర్లతోనే సరి
కొత్త లైన్ ఏర్పాటుకు ఇటీవల సర్వే కోసం టెండర్లు పిలిచినట్లు ప్రచారం జరిగినా, ఆ ప్రక్రియ ప్రస్తుతం ఏ దశలో ఉందో స్పష్టత లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్త 33 కేవీ లైన్ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రస్తుత విద్యుత్ సరఫరా వ్యవస్థను బలోపేతం చేయాలని కోరుతున్నారు.
నిర్వాసితుల పరిస్థితి ఇదేనా?
పోలవరం ప్రాజెక్టు కారణంగా విలీన మండలాల ప్రజలు ఇప్పటికే పునరావాసం, పరిహారం, మౌలిక వసతులు తదితర సమస్యలను ఎదుర్కొంటున్నారని, కనీస అవసరమైన విద్యుత్ విషయంలోనూ ఏళ్ల తరబడి ఇబ్బందులు పడాల్సి రావడం బాధాకరమని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. కూటమి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి సారించి శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తున్నారు.
మేం ఆంధ్రప్రదేశ్‌లో విలీనం అయినప్పటి నుంచి విద్యుత్ కష్టాన్ని ఎదుర్కొంటున్నాం. ఎప్పుడు కరెంటు ఉంటుందో.. పోతే ఎప్పుడు వస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. అధికారులు మా సమస్యను త్వరగా పరిష్కరించాలి.
– గంధం సుమంత్,
గుండంబోరు, కుక్కునూరు మండలం
ప్రభుత్వం నిర్వాసితులను చిన్నచూపు చూస్తోంది. కాంటూరు పేరుతో కొందరికే పరిహారం ఇచ్చారు. మిగిలిన వారికి ఎప్పుడిస్తారో తెలియదు. అలాగే కరెంటు సమస్య తీవ్రంగా ఉన్నా పట్టించుకోవడం లేదు.
– బాసిబోయిన సంతోష్,
వింజరం, కుక్కునూరు మండలం


