దగా డీఎస్సీపై అధికార దుర్వినియోగం
జిల్లాల నుంచి బస్సుల్లో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎంపికైన టీచర్ల తరలింపు
మంత్రి కార్యాలయం ఆదేశాలను పాటించాలంటూ డీఈవోలకు ఆదేశం
జిల్లాకు ఇద్దరు ఎంఈవోల పర్యవేక్షణ
ఏసీ లగ్జరీ బస్సుల్లో విజయవాడకు తరలింపు
రాకుంటే ఉద్యోగాలు పోతాయని బెదిరింపు
రూ.7 లక్షల ఖర్చు.. అధికారుల జేబులకు చిల్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిభ గల ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువునా మోసం చేసి, టీచర్ పోస్టులు అమ్ముకున్న కుంభకోణంలో అవాస్తవాలను ప్రచారం చేసేందుకు ప్రభుత్వంలోని పెద్దలు ఓ ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేశారు. పరీక్షలు రాయకుండా, నకిలీ స్పోర్ట్సు సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులతో ఆందోళనలు చేయించేందుకు ప్రణాళిక అమలు చేస్తున్నారు. మెగా డీఎస్సీ–2025 పేరుతో గొప్పగా ప్రచారం చేసిన టీడీపీ కూటమి ప్రభుత్వం దాన్ని దగా డీఎస్సీగా మార్చేసింది. పరీక్షలు లేకుండా, కనీసం ప్రతిభా సర్టిఫికెట్లు సైతం లేకుండా స్పోర్ట్స్ కోటాలో 382 టీచర్ పోస్టుల్లో చాలా వరకు దొంగ సర్టిఫికెట్ల ద్వారా తమకు కావాల్సిన వారికి ఇచ్చేసింది. తమకున్న ప్రతిభకు ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగం వస్తుందని ఆశించిన ప్రతిభగల క్రీడాకారులు, కష్టపడి చదివిన పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన లక్షలాది మంది ఉపాధ్యాయ అభ్యర్థులను నిలువునా ముంచేసింది.
ఆధారాలతో సహా కుంభకోణం బయట పడడం, నష్టపోయిన అభ్యర్థులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇదే క్రమంలో బాధితులకు ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ అండగా నిలిచి పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో జరిగిన తప్పును సరిచేయాలని, నిష్పాక్షికంగా సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 21న ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) కార్యాలయం వద్ద శాంతియుత ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే, ఈ ఆందోళనను హింసాత్మకంగా మార్చేందుకు ఓపక్క కుట్రపన్ని, మరోపక్క జిల్లాల నుంచి స్పోర్ట్స్ డీఎస్సీ ద్వారా ఎంపికైన టీచర్లను రెండు రోజులు ముందే విజయవాడకు తరలించారు.
ఈ బాధ్యతను ఆయా జిల్లాల డీఈవోలకు అప్పగించి వారికి అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కార్యాలయం ఆదేశించినట్టు విశ్వసనీయ సమాచారం. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఇద్దరు ఎంఈవోలు బాధ్యతలను భుజాన వేసుకుని జాబితా ఆధారంగా స్పోర్ట్స్ కోటా టీచర్లను పిలిచారు. రెగ్యులర్ డీఎస్సీ–2025 అభ్యర్థులు వచ్చేందుకు అంగీకరించక పోవడంతో స్పోర్ట్స్ టీచర్లను తరలించారు. రాకుంటే ఉద్యోగాలు పోతాయని బెదిరించి మరీ రప్పించినట్టు తెలిసింది. అంతేగాకుండా వీరి కోసం ఏసీ బస్సులు ఏర్పాటు చేసి విజయవాడకు తరలించి ఇక్కడ హోటళ్లలో లగ్జరీ సదుపాయాలు కల్పించారు. ఈనెల 20వ తేదీన సభ నిర్వహించి, మరుసటి రోజు ప్రతిపక్షం చేపట్టిన నిరసనను అడ్డుకునేందుకు శాప్ కార్యాలయానికి తరలించారు.
యథేచ్ఛగా అధికార దుర్వినియోగం
డీఎస్సీ స్కామ్ బయట పడినప్పటి నుంచి ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. ఉద్యోగాలు పొందిన వారితో తొలుత ఆందోళనలు నిర్వహించింది. ఆ తర్వాత వారిని జిల్లా విద్యాశాఖ అధికారులు తరలించి సభలు పెట్టించారు. దీనిపై ఆ అభ్యర్థులతో పాటు అన్ని వర్గాల నుంచి తీవ్రంగా వ్యతిరేకత రావడంతో బెదిరింపులకు దిగారు. తాము పరీక్ష రాసి ఉద్యోగాల్లోకి వచ్చామని, ఇలాంటి సభలకు వచ్చేది లేదని తేల్చి చెప్పడంతో ఇప్పుడు పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు పొందిన స్పోర్ట్స్ డీఎస్సీ టీచర్లతో కథ నడిపిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి 35 మంది చొప్పున రవాణా కోసం ఏసీ బస్సులు, అల్పాహారం, భోజనం తదితర ఖర్చులకు రూ.7 లక్షల వరకు బడ్జెట్ ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ మొత్తం విద్యాశాఖ అధికారులే వెచ్చించాల్సి రావడంతో తమ జేబులకు చిల్లు పడుతోందని వారు లబోదిబోమంటున్నట్లు సమాచారం.
‘ఓడీ’ పెట్టి మరీ ఆందోళనకు..
సోమవారం విజయవాడలో శాప్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళనలో స్పోర్ట్స్ డీఎస్సీ ద్వారా నియామకమైన టీచర్లు సెలవు తీసుకోకుండా ‘అదర్ డ్యూటీ’ (ఓడీ)పై వెళ్లడం కలకలం రేపుతోంది. సాధారణంగా ఉపాధ్యాయులు పాఠశాలలో విధులకు హాజరు కాకపోతే సెలవు పెట్టాలి. విద్యా సంబంధ విధులపై అధికారికంగా వెళితే ఓడీకి దరఖాస్తు చేయాలి. కానీ, సోమవారం విజయవాడలో జరిగిన ఆందోళనకు జిల్లాల నుంచి కొత్తగా నియామకమైన స్పోర్ట్స్ ఉపాధ్యాయులు ఓడీపై వెళ్లడం చూస్తుంటే ప్రభుత్వమే వారిని ప్రోత్సహించినట్టు స్పష్టమవుతోంది. సోమవారం విధులకు హాజరు కాకుండా అటెండెన్స్ యాప్‌లో ‘ఓడీ’ పెట్టిన టీచర్లకు కొన్ని జిల్లాల్లో అధికారులు మంగళవారం షోకాజ్ నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది.


