పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం | Director of Piduguralla Lalitha Institute swallowed sleeping pills | Sakshi
Sakshi News home page

పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం

Sep 23 2026 5:23 AM | Updated on Sep 23 2026 5:23 AM

నిద్రమాత్రలు మింగిన పిడుగురాళ్ల లలిత ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌  

సెల్ఫీ వీడియో విడుదల  

పిడుగురాళ్ల:  పోలీసుల వేధింపులు తాళలేక లలిత ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం హోటల్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌ పసుమర్తి కిషోర్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కిషోర్‌ సెల్ఫీ వీడియో, లెటర్‌లో వెల్లడించారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో మంగళవారం ఈ ఘటన జరిగింది. కిషోర్‌ పిడుగురాళ్ల శ్రీనివాస కాలనీలో ఉంటున్నారు. 2024లో రొంపిచర్ల మండలం రామిరెడ్డిపేటకు చెందిన హనుమాన్‌మూర్తి లలిత ఇన్‌స్టిట్యూట్‌లో హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు పూర్తి చేశారు. హనుమాన్‌ విదేశాలకు వెళ్లాలని భావించి కిషోర్‌ సాయం కోరారు. తాను విదేశాలకు పంపలేనని తెలిపిన కిషోర్‌ తనకు తెలిసిన వారు హైదరాబాద్‌లో ఉన్నట్టు తెలిపారు. 

ఈ సమయంలో హనుమాన్‌ నుంచి సుమారు రూ.ఏడు లక్షలు తీసుకుని అందులో హైదరాబాద్‌ వారికి రూ.3 లక్షలు ఇవ్వగా, వీసా కోసం రూ.1.50 లక్షలు ఖర్చు అయినట్టు తెలిపారు. రెండుసార్లు వీసా ఇంటర్వ్యూలో ఫెయిల్‌ కావటంతో ఇక తన వల్ల కాదని లెటర్‌ రాసినట్లు బాధితుడు తెలిపారు. దీనిపై హనుమాన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు పెట్టడంతోపాటు కోర్టును కూడా ఆశ్రయించాడు. అయితే కోర్టు తనకు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లు కిషోర్‌ సెల్ఫీ వీడియో,  లెటర్‌లో వెల్లడించాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రామిరెడ్డిపేటకు చెందిన టీడీపీ నాయకుడు కృష్ణారెడ్డిని హనుమాన్‌ సంప్రదించడంతో నరసరావుపేట డీఎస్పీ హనుమంత్‌రావు వద్ద పంచాయితీ పెట్టారు. 

గత వారం రోజులుగా తనను పిడుగురాళ్ల, నరసరావుపేట, నకరికల్లు స్టేషన్లు తిప్పారని కిషోర్‌ ఆవేదన చెందాడు. సోమవారం ఉదయం పిలిపించిన డీఎస్పీ మొత్తం రూ.25 లక్షలు కట్టాల్సిందేనని తనను బెదిరించినట్లు కిషోర్‌ తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు సెల్ఫీ వీడియోలో తెలిపారు. కిషోర్‌ తల్లి లలిత మాట్లాడుతూ, తన కుమారుడు దళితుడు కాబట్టే చిత్ర హింసలకు గురి చేస్తున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన కుమారుడిని ఇబ్బందులకు గురి చేస్తూనే ఉన్నారని, తన కుమారుడికి ఏదైనా జరిగితే కోర్టును ఆశ్రయిస్తామని ఆమె వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement