పోలవరానికి ‘నిధి’ వంచన | PPA and Central Jal Shakti Ministry criticize ChandraBabu governments approach on Polavaram Project | Sakshi
Sakshi News home page

పోలవరానికి ‘నిధి’ వంచన

Sep 23 2026 5:19 AM | Updated on Sep 23 2026 5:19 AM

PPA and Central Jal Shakti Ministry criticize ChandraBabu governments approach on Polavaram Project

అడ్వాన్సు నిధులు రూ.1,404.30 కోట్లు ఇతర అవసరాలకు మళ్లింపు  

బాబు సర్కారు తీరును తప్పుబట్టిన పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖ 

నిధులను తక్షణమే ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయాలని ఆదేశం

ఆ నిధులతో నిర్వాసితులకు పునరావాసం కల్పన, భూసేకరణ వేగవంతం చేయాలని నిర్దేశం 

మళ్లించిన నిధులు ఖర్చు చేసి, యూసీలు ఇస్తేనే 2026–27 బడ్జెట్‌లో కేటాయించిన నిధులు విడుదల చేస్తామని స్పష్టీకరణ   

అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను మళ్లించడంపై సర్వత్రా విస్మయం 

గత ప్రభుత్వంలో కేంద్రం రీయింబర్స్‌ చేసిన నిధులను ఖర్చు చేస్తేనే మళ్లించారంటూ చంద్రబాబు రాద్ధాంతం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అడ్వాన్సుగా ఇచ్చిన నిధుల్లో రూ.­1,404.30 కోట్లను చంద్రబాబు సర్కార్‌ ఇతర అవసరాలకు మళ్లించేసింది. ఇది నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి నిర్మిస్తున్న పునరావాస కాలనీల పనులు, భూసేకరణపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ తక్షణమే ఆ నిధులను ఎస్‌ఎస్‌ఏ(సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ) ఖాతాలో జమ చేసి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, భూసేకరణకు వ్యయం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ), కేంద్ర జల్‌ శక్తి శాఖ ఆదేశించింది. 

ఆ నిధులను ఖర్చు చేసి, యూసీలు(వినియోగ ధ్రువీకరణపత్రాలు) సమర్పిస్తేనే.. 2026–­27 బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేస్తామని తేల్చిచెప్పింది. గతంలో పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసిన నిధులను కేంద్రం రీయింబర్స్‌ చేస్తే– అంటే రాష్ట్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకుంటే దారి మళ్లించారంటూ ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు రాద్ధాంతం చేశారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేయాలనే ఉద్దేశంతో కేంద్రం అడ్వాన్సుగా ఇచ్చిన నిధులను పదే పదే చంద్రబాబు సర్కార్‌ ఇతర అవసరాలకు మళ్లించేస్తూ ప్రాజెక్టు పనులను నిర్లక్ష్యం చేస్తుండటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

నిధుల మళ్లింపుతో 2025–26 బడ్జెట్‌లో కోత
కనీస నీటిమట్టం 41.15 మీటర్ల ఎత్తు వరకే నీటి నిల్వను పరిమితం చేస్తూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు మిగిలిన పనులకు అయ్యే రూ.12,157.53 కోట్లను మాత్రమే ఇచ్చేందుకు 2024, ఆగస్టు 28న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. పోలవరం రిజర్వాయర్‌ను బ్యారేజ్‌గా మార్చేస్తూ.. జీవనాడికి ఉరేస్తూ తీసుకున్న ఆ నిర్ణయాన్ని చంద్రబాబు సర్కార్‌ ఆమోదించింది. ఇక 2026, మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని.. వరదలు వంటి విపత్తులు ఉత్పన్నమైతే ప్రాజెక్టు పూర్తికి మరో ఏడాది గడువు పొడిగిస్తామని కేంద్రం పేర్కొంది. ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు అడ్వాన్సుగా నిధులు ఇస్తామని తెలిపింది. 

ఆ మేరకు 2024–25లో తొలి విడత రూ.2,384 కోట్లు.. రెండో విడత రూ.2,704.41 కోట్లు వెరసి రూ.5,052.71 కోట్లు అడ్వాన్సుగా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ నిధులను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేసి.. పోలవరం ప్రాజెక్టు పనులకు మాత్రమే ఖర్చు చేయాలని నిర్దేశించింది. కానీ.. 2024–25లో రెండు విడతలుగా విడుదల చేసిన నిధులను చంద్రబాబు సర్కార్‌ ఇతర అవసరాలకు మళ్లించింది. పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖ పదే పదే లేఖలు రాయడంతో అప్పుడు కొంత అప్పుడు కొంత ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేసి ఖర్చు చేసింది. 2024–25 ఆరి్థక సంవత్సరం ముగిసే సమయానికి ఇంకా రూ.700 కోట్లు జమ చేయలేదు. దాంతో.. 2025–26 బడ్జెట్‌లో కేటాయించిన రూ.5,936 కోట్లలో రూ.2,918.80 కోట్లు కోత వేసింది. రూ.3,017.20 కోట్లు మాత్రమే కేటాయిస్తూ 2025–26 బడ్జెట్‌ను సవరించింది.

అయినా మారని తీరు 
2025–26 బడ్జెట్‌లో సవరించిన అంచనాల మేరకు పోలవరానికి కేటా­యించిన రూ.3,017.20 కోట్ల­లో ఫిబ్రవరి 23న రూ.1,508.61 కోట్లు, మార్చి 31న రూ.1,301.61 కోట్లు వెరసి రూ.2,810.22 కోట్లను విడుదల చేసింది. వాటిని ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయకుండా ఇతర అవసరాలకు మళ్లించేసింది. పీపీఏ, కేంద్ర జల్‌ శక్తి శాఖ పదే పదే లేఖలు రాస్తుండటంతో ఇప్పటికి రూ.­1,405.92 కోట్లు ఎస్‌ఎన్‌ఏ ఖాతా­లో జమ చేసి వ్యయం చేసింది. ఇప్పటికీ రూ.1,404.30 కోట్లను ఎస్‌ఎన్‌ఏ ఖాతాలో జమ చేయకపోవడం గమనార్హం. ఇక 2026–27 బడ్జె­ట్‌లో పోలవరానికి రూ.­3,320.39 కోట్లను కేంద్రం కేటాయించింది. 2025–26లో అడ్వా­న్సుగా ఇచ్చిన నిధులను పూర్తి స్థాయి­లో వినియోగించుకుని యూసీలు కేంద్రానికి సమర్పిస్తేనే 2026–27 బడ్జెట్‌లో కేటాయించిన నిధులను విడుదల చేస్తామని కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement