చంద్రబాబు సర్కార్ సరికొత్త రికార్డు.. మంగళవారం మరో రూ.2,600 కోట్ల అప్పు
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అప్పుల చిట్టాను రోజు రోజుకూ భారీగా పెంచేస్తున్నారు. కేవలం 27 నెలల పాలనలోనే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారు. మంగళవారం రాష్ట్రప్రభుత్వ సెక్యూరిటీలు విక్రయించి మరో రూ.2,600 కోట్లు అప్పుచేశారు. దీంతో చంద్రబాబు చేసిన అప్పులు రూ.4 లక్షల కోట్లకు చేరువయ్యాయి. అప్పులు చేయడంలో సీఎం చంద్రబాబు సరికొత్త రికార్డు సృష్టించారు. గత ఐదేళ్ల తన రికార్డును తానే తిరగరాశారు. 2014–19 ఐదేళ్ల పాలనలో చంద్రబాబు సర్కారు రూ.2.49 లక్షల కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు 27 నెలల పాలనలోనే తన పాత రికార్డును అధిగమించి ఏకంగా దాదాపు రూ.4 లక్షల కోట్లు అప్పు చేసింది. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇంత తక్కువ వ్యవధిలో ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసిన దాఖలాలు లేవు.
సెక్యూరిటీలు అమ్మేసి రూ.2,600 కోట్ల అప్పు..
మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలను వేలంలో విక్రయించడం ద్వారా రూ.2,600 కోట్లు బడ్జెట్ అప్పు చంద్రబాబు సర్కారు చేసింది. దీంతో బడ్జెట్ అప్పులే రూ.2,24,537 కోట్లకు చేరాయి. ప్రభుత్వ గ్యారెంటీ ఇస్తూ కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులు రూ.1,24,974 కోట్లకు చేరాయి. ఇక రాజధాని పేరుతో చేసిన అప్పులు రూ.47,687 కోట్లకు చేరాయి. దీంతో 27 నెలల్లోనే బాబు తన పాలనలో చేసిన అప్పులు దాదాపు నాలుగు లక్షల కోట్లకు చేరుతున్నాయి. మంగళవారం నాటికి చంద్రబాబు చేసిన అప్పులు మొత్తం రూ.3,97,198 కోట్లకు చేరాయి.
అప్పుల కోసం జీవోల మీద జీవోలు..
ఎన్నికల ముందు సంపదసృష్టి అంటూ గొప్ప కబుర్లు చెప్పారు. కానీఅప్పులు సృష్టించడంలో తనకు ఎవరూ సాటి లేరని నిరూపిస్తున్నారు. గత 27 నెలలుగా పరిపాలన సాగించడానికి అప్పులపైనే చంద్రబాబు ప్రధానంగా ఆధారపడ్డారు. బడ్జెట్ అప్పులే ఏడాదికి రూ.లక్ష కోట్లు చొప్పున చేసేస్తున్నారు. ఇది చాలదన్నట్లు గనులు, మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి మరీ అప్పులు చేస్తున్నారు. మరో పక్క కార్పొరేషన్ల పేరుతో దొరికిన చోటల్లా గ్యారెంటీలు ఇస్తూ అప్పులకు జీవోల మీద జీవోలు జారీ చేస్తున్నారు. ఇంకో పక్క ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ పరం చేస్తున్నారు. కార్పొరేషన్ల పేరుతో అప్పులు చేయడానికి ప్రభుత్వ గ్యారెంటీలను ఎడా పెడా ఇచ్చేస్తున్నారు.
ఇలాగైతే భవిష్యత్ అంధకారమేనంటున్న కాగ్...
అప్పులతోనే గడిపే స్థితికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చంద్రబాబు దిగజార్చేశారు. 2024–25 ఆర్థిక ఏడాదిలో దేశంలోనే అత్యధికంగా చేబదుళ్ల అప్పులు చంద్రబాబు సర్కారు చేసిందని కాగ్ నివేదిక తెలిపింది. చేబదుళ్లకు కూడా ఏకంగా రూ.303 కోట్ల మేర వడ్డీ చెల్లించిందని, ఏడాదిలో 357 రోజులు అప్పులతోనే పాలన సాగించారని, ఇలా అయితే రాష్ట్ర భవిష్యత్ అంధకారమేనని కాగ్ హెచ్చరించింది. అయినా సరే లెక్క చేయకుండా దొరికిన చోటల్లా అప్పులు తేవడమే లక్ష్యంగా బాబు పాలన కొనసాగిస్తున్నారు.
అప్పులు చేయడం కోసం.. రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి (జీఎస్‌డీపీ) పెరిగిందంటూ చంద్రబాబు ఊదరగొడుతున్నారు. జీఎస్‌డీపీకి తగినట్లు రాష్ట్ర ఆదాయం పెరగకపోవడం చూస్తుంటే అప్పులు చేయడం కోసం తప్పుడు గణాంకాలను చెబుతున్నారని స్పష్టం అవుతోంది. ఇబ్బడి ముబ్బడిగా తెస్తున్న అప్పులను.. ఆస్తులు సృష్టించే, ఆదాయం వచ్చే మార్గాలపై వెచ్చించకుండా ఎలాంటి ప్రతిఫలాన్ని ఇవ్వని రంగాలకు మళ్లించేస్తున్నారు. దీంతో రాష్ట్ర అప్పుల భారం పెరిగిపోతూ ఆస్తులు తరిగిపోతున్నాయి.


