భార్యను కాదని పిల్లలకు పెన్షన్ రాసేయొచ్చా? | Can Husband Cut His Wife From Family Pension Here What the Law Says | Sakshi
Sakshi News home page

భార్యను కాదని పిల్లలకు పెన్షన్ రాసేయొచ్చా?

Aug 26 2026 4:29 PM | Updated on Aug 26 2026 4:36 PM

Can Husband Cut His Wife From Family Pension Here What the Law Says

సహధర్మచారిణిగా భార్యకు జీవితంలోనూ, ఆర్థిక భద్రతలోనూ ప్రాథమిక హక్కు ఉంటుందనేది జగమెరిగిన సత్యం. మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న భర్త, తన భార్యను పూర్తిగా మినహాయించి (Exclude) కేవలం పిల్లలకే ఫ్యామిలీ పెన్షన్ దక్కేలా నామినేషన్ చేయవచ్చా? కుటుంబంలో మనస్పర్థలు, కలహాలు వచ్చినా చట్టపరంగా భార్యకు దక్కాల్సిన హక్కును భర్త ఏకపక్షంగా కాలరాయవచ్చా? అంటే, కేంద్ర సీసీఎస్ (పెన్షన్) నిబంధనలు ఏం చెబుతున్నాయో కింద చూద్దాం.

మొదటి ప్రాధాన్యత ఎవరికంటే..

కేంద్ర సివిల్ సర్వీసెస్ (పెన్షన్) నిబంధనలు, 2021 (సీసీఎస్‌ పెన్షన్‌ రూల్స్‌)లోని రూల్ 50 ప్రకారం.. ఒక ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే ఆయన పొందే ఫ్యామిలీ పెన్షన్‌పై పూర్తి హక్కు చట్టబద్ధమైన భార్యకే ఉంటుంది. భర్త తన సర్వీస్ రికార్డుల్లో లేదా నామినేషన్ ఫారమ్‌లో భార్య పేరు కాదని పిల్లల పేర్లు రాసినప్పటికీ సాంకేతికంగా అది చెల్లదు. భర్త తన ఇష్టారాజ్యంగా నామినేషన్ మార్చడానికి వీల్లేదు. పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీ చట్టబద్ధ నిబంధనల ప్రకారమే నడుచుకుంటుంది. భార్య మరణించినా లేదా చట్టబద్ధంగా విడాకులు పూర్తయినా లేక ఆమె పెన్షన్‌కు అనర్హురాలైనా రెండో ప్రాధాన్యతగా 25 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు (లేదా దివ్యాంగులైన సంతానానికి) ఆ ఫ్యామిలీ పెన్షన్ అందుతుంది.

మహిళా ఉద్యోగులకే ఆ ప్రత్యేక మినహాయింపు!

ఇక్కడ ఒక ముఖ్యమైన చట్టపరమైన సవరణను గమనించాలి. 2024 ప్రారంభంలో కేంద్ర పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ నిబంధనల్లో ఒక మార్పు తెచ్చింది. దాంపత్య వివాదాలు, విడాకుల పిటిషన్లు లేదా గృహహింస చట్టం కింద కేసులు నడుస్తున్న సందర్భాల్లో.. మహిళా ఉద్యోగులు తమ భర్తను మినహాయించి, తమ పిల్లలకు ఫ్యామిలీ పెన్షన్ వెళ్లేలా ముందస్తుగా అభ్యర్థించే వెసులుబాటు కల్పించారు. అయితే ఈ మినహాయింపు కేవలం మహిళా ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. పురుష ఉద్యోగులకు తమ భార్యను నామినేషన్ నుంచి తొలగించే హక్కును చట్టం ఎక్కడా ఇవ్వలేదు.

అవగాహన లేకపోతే తీవ్ర నష్టం!

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు పరిస్థితి చేయిదాటాక బాధపడేకంటే పెన్షన్ నిబంధనలపై స్పష్టత కలిగి ఉండటం శ్రేయస్కరం. భార్యాభర్తల మధ్య ఎన్ని అభిప్రాయభేదాలు ఉన్నప్పటికీ చట్టబద్ధమైన విడాకుల డిక్రీ కోర్టు నుంచి పొందే వరకు భార్య పెన్షన్ హక్కుదారుగానే ఉంటుంది. కాబట్టి నామినేషన్ల విషయంలో సొంత నిర్ణయాలు చెల్లవని న్యాయ నిపుణులు తేల్చిచెబుతున్నారు.

ఇదీ చదవండి: పసిడి, వెండి ధరల హొయలు.. నేటి ధరలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement