సాక్షి, హైదరాబాద్: ఆమె ఎయిర్ ఇండియాలో క్యాబిన్ క్రూ. ఆమె ఫొటోలను ఇన్‌స్ట్రాగామ్ ఖాతా నుంచి సేకరించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) టూల్స్‌తో అశ్లీలంగా మార్ఫింగ్ చేశాడు ఓ గుర్తు తెలియని వ్యక్తి. సోషల్‌మీడియాలో పోస్టు చేసి వేధిస్తుండటంతో సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో మంగళవారం కేసు నమోదైంది. ఆర్మీలో మేజర్‌గా పనిచేస్తున్న ఆమె భర్త ఫిర్యాదు కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇన్‌స్ట్రాగామ్ ఖాతాలో ఉన్న ఆమె ఫొటోలను సేకరించి ఏఐ ఆధారిత సాంకేతికతతో నగ్న, అసభ్యకర చిత్రాలు, వీడియోలుగా మారుస్తున్నాడు. బాధితురాలి ముఖాన్ని పోలిన విధంగా రూపొందించిన ఈ కంటెంట్‌ను రెడిట్, ఇన్‌స్ట్రాగామ్, డిస్కార్డ్ సోషల్ మీడియా వేదికల్లో పోస్టు చేస్తున్నాడు. ఈ విధంగా రూపొందించిన చిత్రాలు, వీడియోలు, పోస్టులను బాధితురాలి బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు చేరేలా చేసి ఆమె పరువుకు భంగం కలిగించేందుకు ప్రయత్నించాడు. రోజూ సోషల్ మీడియా ద్వారా వేధింపులకు పాల్పడుతూ డబ్బు డిమాండ్ చేస్తున్నాడు.
ఏడాదిన్నరగా 200కుపైగా పోస్టులు
ఏడాదిన్నర కాలంగా మొత్తం 200కుపైగా పోస్టులు వివిధ వేదికల్లో నిందితుడు పోస్టు చేశాడు. ఈ వ్యవహారంపై బాధితురాలి భర్త ఆన్‌లైన్‌లో పరిశీలించి కొన్ని యూజర్ ఐడీలు, యూజర్ నేమ్స్, తొలగించిన పోస్టులు, కామెంట్లు తదితరాలకు సంబంధించిన లింకులను గుర్తించారు. వీటి ఆధారంగా సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది.


