జియో మెంబర్‌షిప్‌.. రూ.300తో టెన్షన్‌ లేని రీఛార్జ్! | Reliance Jio Relaunches Jio Prime for Rs 300 to Protect Against Future Tariff Hike | Sakshi
Sakshi News home page

జియో మెంబర్‌షిప్‌.. రూ.300తో టెన్షన్‌ లేని రీఛార్జ్!

Aug 17 2026 5:46 PM | Updated on Aug 17 2026 6:01 PM

Reliance Jio Relaunches Jio Prime for Rs 300 to Protect Against Future Tariff Hike

రిలయన్స్ జియో తన కస్టమర్ల కోసం 'జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌'ను(Jio Prime Membership) తీసుకొచ్చింది. జియో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ మెంబర్‌షిప్‌ను రీలాంచ్ చేసింది. అయితే.. ఈసారి ప్రైమ్‌లో ప్రధాన ఆకర్షణ కేవలం అదనపు ఆఫర్లు కాదు.. టారిఫ్ ధరలు పెరిగినా కస్టమర్లపై ఆ భారం పడకుండా రక్షణ కల్పించడం.

రూ.300 చెల్లిస్తే..
జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ కోసం ఒక్కసారి రూ.300 చెల్లించాలి. ఈ మెంబర్‌షిప్ జియో ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ కస్టమర్లందరికీ అందుబాటులో ఉంటుంది. సభ్యత్వం తీసుకున్న తర్వాత.. ప్లాన్స్ ధరలు పెరిగినా, ప్రస్తుతం ఉన్న ధరలకే రీఛార్జ్ చేసుకోవచ్చు. ఈ అవకాశం మెంబర్‌షిప్‌ తీసుకున్న వాళ్లకు మాత్రమే. ఇది 5 సెప్టెంబర్ 2027 వరకు వర్తిస్తుంది. అంటే ఏడాది పాటు రీఛార్జ్ ధరలు పెరిగినా భయం లేదన్నమాట.

రూ.600 క్యాష్‌బ్యాక్
జియో ప్రైమ్‌లో సభ్యత్వం తీసుకున్న వారికి రూ.600 విలువైన క్యాష్‌బ్యాక్ వోచర్లు కూడా లభిస్తాయి. ఇందులో రూ.300 క్యాష్‌బ్యాక్‌ను కొత్త జియో హోమ్ లేదా జియో పీసీ కనెక్షన్ తీసుకునేటప్పుడు ఉపయోగించుకోవచ్చు. మరో రూ.300 వోచర్‌ను స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల కోసం కొత్త జియో సిమ్ కనెక్షన్ తీసుకునేటప్పుడు పొందవచ్చు.

కొత్త సేవలకు ముందుగానే యాక్సెస్
ప్రైమ్ సభ్యులకు జియో తీసుకొచ్చే కొత్త ఉత్పత్తులు, సేవలు, ట్రయల్స్‌కు ముందస్తు యాక్సెస్ కూడా లభిస్తుంది. అంతేకాదు.. కస్టమర్లకు ప్రత్యేకంగా ప్రయారిటీ కస్టమర్ సపోర్ట్ అందించేందుకు ప్రత్యేక సర్వీస్ ఛానల్‌ను కూడా జియో ఏర్పాటు చేయనుంది. మెంబర్‌షిప్ వ్యవధిలో మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటిస్తామని కంపెనీ తెలిపింది.

ఎవరు తీసుకోవచ్చు?
ప్రస్తుతం జియో ప్రీపెయిడ్ లేదా పోస్ట్ పెయిడ్ వాడుతున్న అందరు జియో కస్టమర్లు రూ.300 చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్‌ తీసుకోవచ్చు. అయితే.. ఇతర నెట్‌వర్క్‌లలో ఉన్నవారు జియోకి మారడం లేదా కొత్త జియో కనెక్షన్ తీసుకోవడం ద్వారా ఈ మెంబర్‌షిప్‌లో చేరవచ్చు.

ఎక్కడ తీసుకోవాలి?
జియో ప్రైమ్ మెంబర్‌షిప్‌ కావాలనుకునే వారు మైజియో యాప్ లేదా జియో.కామ్, జియో స్టోర్స్, జియో పార్ట్‌నర్ స్టోర్స్ ద్వారా తీసుకోవచ్చు. తరచూ రీఛార్జ్ ధరలు పెరుగుతాయేమోనని ఆందోళన చెందే జియో కస్టమర్లకు ఇది ఉపయోగపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement