దేశంలో ఎల్‌పీజీ వినియోగదారులకు తప్పనిసరి చేసిన ఈ-కేవైసీ గడువును.. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు మరో వారం పొడిగించారు. దీంతో ఈ-కేవైసీ పూర్తి చేసుకోలేకపోయిన వారికి అదనపు సమయం లభించింది.
ఈ-కేవైసీ కోసం గడువు పెరిగినా.. వినియోగదారుల ఇబ్బందులు మాత్రం తగ్గడం లేదు. ఆధార్ ఆథెంటికేషన్ కోసం గ్యాస్ ఏజెన్సీలకు వెళ్తున్న వారికి సర్వర్లు డౌన్ అవడం, యాప్‌లు సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. దీంతో సాధారణంగా.. సులభంగా పూర్తయ్యే ప్రక్రియ కోసం గంటల తరబడి క్యూలో నిలబడాల్సి వస్తోంది.
గడువు పెంచడం వల్ల ఆగస్టు 16 నాటికి ఉన్న ఒత్తిడి కొంత తగ్గుతుందని భావించినా.. అసలు సమస్య మాత్రం సాంకేతిక వ్యవస్థలోనే ఉందని డీలర్లు చెబుతున్నారు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల సర్వర్లు లేదా యాప్‌లు సరిగ్గా పనిచేయకపోతే గ్యాస్ ఏజెన్సీల్లో సిబ్బంది ఎంతమంది ఉన్నా ఈ-కేవైసీ ప్రక్రియ ముందుకు సాగదు. కొన్ని గంటల పాటు సర్వర్ పనిచేయకపోతే.. ఆ రోజు పూర్తి కావాల్సిన ఈ-కేవైసీలు పెండింగ్‌లో పడిపోతాయి. దీంతో రోజురోజుకి ఈ-కేవైసీ చేసుకోవాల్సిన వారి క్యూ పెరిగిపోతోంది.
దీంతో ఇప్పటికే గంటల సమయం వెచ్చించిన వినియోగదారులకు గడువు పొడిగింపు పెద్దగా ఊరటనివ్వడం లేదు. ఏజెన్సీకి వెళ్లిన తర్వాత సర్వర్ పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా వృద్ధులు, ఉద్యోగాలకు వెళ్లేవారు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఇది మరింత ఇబ్బందిగా మారుతోంది. ఒకరోజు సర్వర్ సమస్య కారణంగా.. పని పూర్తికాకపోతే మళ్లీ మరో రోజు ఏజెన్సీకి వెళ్లాల్సి వస్తోంది.
కాబట్టి ఆగస్టు 23 వరకు గడువు ఉన్నప్పటికీ.. చివరి వరకు వేచి ఉండకుండా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవడం మంచిది. అయితే.. వినియోగదారులకు అదనపు సమయం ఇవ్వడంతో పాటు సర్వర్ సామర్థ్యాన్ని పెంచడం, యాప్‌ల పనితీరును మెరుగుపరచడం, సాంకేతిక సమస్యలను త్వరగా పరిష్కరించడం కూడా అవసరం. ఎందుకంటే గడువు పెంచడం ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు.. ఈ-కేవైసీ ప్రక్రియ సజావుగా జరిగేలా డిజిటల్ వ్యవస్థ పనిచేయడమే అసలు పరిష్కారం.
ఇదీ చదవండి: కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇంకెప్పుడు ఇస్తారు?


