పండుగల వేళ చక్కెర అందుబాటులో ఉంటుందా? ధరలు తగ్గుతాయా? | Festival season Did LPG supply crunch affect sugar prices | Sakshi
Sakshi News home page

పండుగల వేళ చక్కెర అందుబాటులో ఉంటుందా? ధరలు తగ్గుతాయా?

Sep 2 2026 7:43 PM | Updated on Sep 2 2026 8:08 PM

Festival season Did LPG supply crunch affect sugar prices

ఇటీవలి నెలల్లో భారీగా పెరిగిన చక్కెర ధరలు ప్రస్తుతం కొంత తగ్గుముఖం పట్టాయి. రానున్న పండుగల సీజన్‌లో చక్కెర ధరలు నియంత్రణలోనే ఉంటాయని పరిశ్రమ అంచనా వేస్తోంది. డాల్మియా భారత్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్‌లో షుగర్, ఇథనాల్ వ్యాపార విభాగం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కపిల్ నేమా పలు వివరాలు తెలిపారు. ఇటీవల చక్కెర ధరలు పెరగడం తాత్కాలికమేనని చెప్పారు. ఎల్‌పీజీ సరఫరా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత డిమాండ్ ఒక్కసారిగా పుంజుకోవడం కూడా ఇందుకు ఒక కారణమని అన్నారు. ఇథనాల్ డిమాండ్, పరిశ్రమ సామర్థ్యం, పండుగల సీజన్‌లో చక్కెర లభ్యతపై అంచనాల గురించి కూడా ఆయన వివరించారు.

ఏప్రిల్-మే-జూన్ నెలల్లో తీవ్ర ఎల్‌పీజీ కొరత ఏర్పడటంతో ఎల్‌పీజీపై ఎక్కువగా ఆధారపడే స్వీట్ల, టీ దుకాణాలు, బేకరీలు, ఇతర చిన్న వ్యాపారాలు ప్రభావితమయ్యాయని నేమా తెలిపారు. కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడటంతో చక్కెరకు డిమాండ్ తాత్కాలికంగా తగ్గిందని, సరఫరా వ్యవస్థ కూడా ప్రభావితమైందని చెప్పారు. ఎల్‌పీజీ సరఫరా సాధారణ స్థితికి వచ్చిన తర్వాత ఈ వ్యాపారాలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభించాయి. దీంతో చక్కెరకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. ఫలితంగా ధరలు తాత్కాలికంగా పెరిగాయని నేమా తెలిపారు. అయితే ప్రస్తుతం మార్కెట్ మళ్లీ స్థిరపడటం ప్రారంభించిందని చెప్పారు.

చక్కెర ధరలు నియంత్రణలోనే ఉంటాయా?
మహారాష్ట్రలో ప్రస్తుతం మిల్లు నుంచి బయటకు వచ్చే చక్కెర ధర కిలోకు సుమారు రూ.45-48గా ఉందని నేమా తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో కిలోకు సుమారు రూ.50-53గా ఉందన్నారు. రానున్న పండుగలను చక్కెర ధరల నుంచి పెద్దగా ప్రభావం లేకుండా వినియోగదారులు జరుపుకోగలరని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. పండుగల సమయంలో తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా ప్రభుత్వం, పరిశ్రమ రెండూ దృష్టి సారిస్తున్నాయని తెలిపారు.

దిగుమతులతో లభ్యత మెరుగుపడే అవకాశం
ప్రభుత్వం చక్కెర దిగుమతులకు కూడా అనుమతి ఇచ్చిందని నేమా తెలిపారు. దీనివల్ల మార్కెట్‌లోకి అదనపు చక్కెర సరఫరా వచ్చి, లభ్యత మరింత మెరుగుపడే అవకాశం ఉందన్నారు. భారత్‌లో పండుగల వేడుకల్లో స్వీట్లు ముఖ్యమైన భాగమని పేర్కొన్న నేమా.. చక్కెర నిరంతరం లభ్యతలో ఉండేలా చూడటం.. పరిశ్రమ, ప్రభుత్వం రెండింటి ప్రాధాన్యత అని చెప్పారు.

“పండుగల సమయంలో చక్కెర లభ్యతపై ఎలాంటి ప్రభావం ఉండకుండా, తగినంత చక్కెర అందుబాటులో ఉండేలా పరిశ్రమ, ప్రభుత్వం రెండూ చర్యలు తీసుకుంటాయి. స్వీట్లు లేకుండా భారత్‌లో పండుగలు పూర్తికావు. అందుకే పండుగలు పూర్తిస్థాయిలో జరుపుకునేందుకు చక్కెర నిరంతర లభ్యత చాలా ముఖ్యం. వాస్తవానికి ప్రభుత్వం ఇప్పుడు దిగుమతులకు అనుమతి ఇచ్చింది. అక్కడి నుంచి కొంత చక్కెర కూడా వస్తుందని మేము ఆశిస్తున్నాం. ఇది చక్కెర లభ్యతను మెరుగుపరుస్తుంది” అని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement