భారీ రేంజ్‌తో ‘సింపుల్‌’ ఎలక్ట్రిక్ స్కూటర్.. | Simple Wave Electric Scooter Launched 243 Km Range price | Sakshi
Sakshi News home page

భారీ రేంజ్‌తో ‘సింపుల్‌’ ఎలక్ట్రిక్ స్కూటర్..

Sep 2 2026 6:05 PM | Updated on Sep 2 2026 6:21 PM

Simple Wave Electric Scooter Launched 243 Km Range price

మార్కెట్‌లోకి మరో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వచ్చేసింది. ఎలక్ట్రిక్‌ టూవీలర్‌ కంపెనీ ‘సింపుల్‌ ఎనర్జీ’ మరో కొత్త మోడల్‌తో సందడి చేసింది. కుటుంబ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన సింపుల్‌ వేవ్‌ (Simple Wave) ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1,09,999 (ఎక్స్‌షోరూమ్‌)గా నిర్ణయించింది. మాస్‌ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకున్న ఈ స్కూటర్‌కు ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌ 25 నుంచి డెలివరీలు మొదలుకానున్నాయి.

నాలుగు బ్యాటరీ ఆప్షన్లు.. 243 కి.మీ. వరకు రేంజ్‌

సింపుల్‌ వేవ్‌ను వేవ్‌ ఎస్‌, వేవ్‌, వేవ్‌+ పేర్లతో మూడు ప్రధాన వేరియంట్లలో, మొత్తం ఆరు కాన్ఫిగరేషన్లలో అందిస్తోంది. ఇందులో 2.2kWh, 2.7kWh, 3.7kWh, 5kWh బ్యాటరీ ఆప్షన్లు ఉన్నాయి. బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి IDC రేంజ్‌ 110 కి.మీ. నుంచి 243 కి.మీ. వరకు ఉంటుంది.

టాప్‌ వేరియంట్‌ సింపుల్‌ వేవ్‌+లో 5kWh బ్యాటరీ ప్యాక్‌, 6.4kW PMSM మోటార్‌ ఉన్నాయి. ఇది ఒక్కసారి ఛార్జ్‌తో 243 కి.మీ. వరకు IDC రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ చెబుతోంది. దీని గరిష్ఠ వేగం గంటకు 90 కి.మీ. కాగా, 179Nm వీల్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3.7kWh బ్యాటరీ వెర్షన్‌ 171 కి.మీ., 2.7kWh వెర్షన్‌ 132 కి.మీ., 2.2kWh వెర్షన్‌ 110 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తాయి.

ఛార్జింగ్‌..

సింపుల్‌ వేవ్‌లో పోర్టబుల్‌ ఛార్జర్‌ సదుపాయం ఉంది. టాప్‌ వేరియంట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఫాస్ట్‌ ఛార్జర్‌తో 0 నుంచి 80 శాతం వరకు బ్యాటరీని సుమారు 2 గంటల 15 నిమిషాల్లో ఛార్జ్‌ చేయవచ్చని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ, మోటార్‌ రెండింటికీ IP67 రేటింగ్‌ ఉండటంతో పాటు 300 మి.మీ. వరకు వాటర్‌ వాడింగ్‌ సామర్థ్యం ఉందని సంస్థ తెలిపింది.

70 లీటర్ల స్టోరేజ్‌..

వేవ్‌ ప్రధాన ఆకర్షణల్లో భారీ స్టోరేజ్‌ ఒకటి. మొత్తం 70 లీటర్ల వరకు స్టోరేజ్‌ స్పేస్‌ లభిస్తుంది. ఇందులో 63 లీటర్ల వరకు అండర్‌-సీట్‌ స్టోరేజ్‌, 3 లీటర్ల గ్లోవ్‌ బాక్స్‌, మరో 4 లీటర్ల ‘పిల్‌’ అనే ప్రత్యేక స్టోరేజ్‌ కంపార్ట్‌మెంట్‌ ఉన్నాయి. రోజువారీ షాపింగ్‌, హెల్మెట్‌, బ్యాగులు, ఇతర వస్తువులను సులభంగా పెట్టుకునేలా ఈ స్కూటర్‌ను రూపొందించారు.

కుటుంబ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని 920 మి.మీ. పొడవైన ఫ్లాట్‌ సీటును కూడా అందించారు. 1,347 మి.మీ. వీల్‌బేస్‌, 775 మి.మీ. సీటు ఎత్తు, 150 కిలోల పేలోడ్‌ సామర్థ్యం, 175 మి.మీ. గ్రౌండ్‌ క్లియరెన్స్‌ ఉన్నాయి.

ఫీచర్లు అదుర్స్‌..

వేరియంట్‌ను బట్టి 7 అంగుళాల TFT డిస్‌ప్లే లేదా EBN డిస్‌ప్లే లభిస్తుంది. అధిక వేరియంట్లలో బ్లూటూత్‌ కనెక్టివిటీ, టర్న్‌-బై-టర్న్‌ నావిగేషన్‌, GPS, కాల్‌-మ్యూజిక్‌ కంట్రోల్స్‌, USB ఛార్జింగ్‌, OTA అప్‌డేట్స్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి.

అదనంగా ట్రాక్షన్‌ కంట్రోల్‌, రీజెనరేటివ్‌ బ్రేకింగ్‌, హిల్‌-హోల్డ్‌ అసిస్ట్‌, రివర్స్‌ మోడ్‌, క్రాల్‌ మోడ్‌, వెహికల్‌ ట్రాకింగ్‌ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. రైడ్‌, ఎకో, ECOX రైడింగ్‌ మోడ్‌లు అన్ని వేరియంట్లలో ఉండగా.. అధిక వేరియంట్లలో స్పోర్ట్‌ మోడ్‌ కూడా లభిస్తుంది. పూర్తి LED లైటింగ్‌ స్టాండర్డ్‌గా ఉంటుంది.

డిజైన్‌, సేఫ్టీ..

సింపుల్‌ ఎనర్జీ తన గత స్పోర్టీ మోడళ్లకు భిన్నంగా వేవ్‌కు సింపుల్‌, కర్వీ డిజైన్‌ను అందించింది. ఫ్యామిలీ కస్టమర్లను ఆకట్టుకునేలా ఫ్లాట్‌ ఫుట్‌బోర్డ్‌, పెద్ద సీటు, ఎక్కువ స్టోరేజ్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. ట్యూబ్యులర్‌ స్టీల్‌ ఫ్రేమ్‌, టెలిస్కోపిక్‌ ఫ్రంట్‌ సస్పెన్షన్‌, ట్విన్‌ రియర్‌ షాక్‌ అబ్జార్బర్లు, 12 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ ఉన్నాయి. ముందు డిస్క్‌, వెనుక డ్రమ్‌ బ్రేక్‌లతో పాటు కంబైన్డ్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ లభిస్తుంది.

ఆకర్షణీయ రంగుల్లో..

సింపుల్‌ వేవ్‌ పెర్ల్‌ వైట్‌, కోరల్‌ రెడ్‌, ట్విలైట్‌ బ్లాక్‌, పోలార్‌ బ్లూ, డాల్ఫిన్‌ గ్రే, ఫారెస్ట్‌ గ్రీన్‌ వంటి ఆకర్షణీయ రంగుల్లో లభిస్తుంది. ధర, రేంజ్‌, భారీ స్టోరేజ్‌తో ఫ్యామిలీ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ విభాగంలో ఇది ఏథర్‌ కొనార్క్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌, బజాజ్‌ చేతక్‌ వంటి మోడళ్లకు పోటీ ఇవ్వనుంది.

ఇక దేశవ్యాప్తంగా సర్వీస్‌ సదుపాయాలను విస్తరించేందుకు ‘సింపుల్‌ సూపర్‌ ల్యాబ్స్‌’ను కంపెనీ ఏర్పాటు చేయనుంది. తొలి దశలో బెంగళూరు, చెన్నై, కొచ్చి, గోవా, పుణె, ఢిల్లీ, ఒడిశా, కోల్‌కతాలో ఈ సదుపాయాలను ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement