వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1 | Nitin Gadkari Says India’s EV Market Could Reach ₹20 Lakh Crore By 2030 And Create Nearly 5 Crore Jobs, Check Details Inside | Sakshi
Sakshi News home page

వచ్చే ఐదేళ్లలో ప్రపంచంలోనే నంబర్ 1

Aug 28 2026 8:33 AM | Updated on Aug 28 2026 8:33 AM

EV Market to Hit Rs 20 Lakh Cr Gadkari Predicts 50 Million Jobs by 2030

రూ.20 లక్షల కోట్లకు ఈవీ మార్కెట్‌

2030 నాటికి దేశీ మార్కెట్‌పై అంచనాలు

కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి 

భారత్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) మార్కెట్‌ 2030 నాటికి రూ.20 లక్షల కోట్ల స్థాయికి ఎదుగుతుందనే అంచనాలు ఉన్నాయని కేంద్ర రహదారి రవాణా, హైవేస్‌ శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. అలాగే దాదాపు 5 కోట్ల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని చెప్పారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ–ఐటీసీ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ ఫర్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు.

ప్రస్తుతం దేశీయంగా రిజిస్టర్‌ అయిన ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య 57 లక్షల పైగా ఉందని, వీటి మార్కెట్‌ వాటా 7 శాతంగా ఉందని పేర్కొన్నారు. రెండు దేశీ దిగ్గజాలు బజాజ్‌ ఆటో, హీరో మోటోకార్ప్‌ తాము ఉత్పత్తి చేసే వాహనాల్లో 50 శాతం పైగా వాహనాలను ఎగుమతి చేస్తున్నాయని చెప్పారు. భారత్‌లో ఏటా ఒక లక్ష ఎలక్ట్రిక్‌ బస్సులకు డిమాండ్‌ ఉన్నప్పటికీ, కేవలం 50,000–60,000 బస్సులను మాత్రమే తయారు చేయగలుగుతున్నామని వివరించారు. భారత్‌లో వాహనాల తయారీ వ్యయం తక్కువగా ఉంటుందని, నాణ్యత అత్యుత్తమంగా ఉంటుందని గడ్కరీ చెప్పారు. అందుకే టాప్‌ ఆటోమొబైల్‌ దిగ్గజాలన్నీ భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయని వివరించారు.  

అయిదేళ్లలో నంబర్‌ వన్‌ లక్ష్యం..

వచ్చే ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ ఆటోమొబైల్‌ పరిశ్రమగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ‘సుశిక్షితులైన సిబ్బంది పెద్ద సంఖ్యలో ఉన్న నేపథ్యంలో మన ఆటోమొబైల్‌ పరిశ్రమ భవిష్యత్తు చాలా బాగా ఉండబోతోంది. వచ్చే ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే నంబర్‌ 1 ఆటోమొబైల్‌ పరిశ్రమగా తీర్చిదిద్దాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఇది కొంత కష్టం కావచ్చు కానీ అసాధ్యం కాదు’ అని ఆయన తెలిపారు. ‘నేను రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు భారత ఆటోమొబైల్‌ పరిశ్రమ పరిమాణం రూ. 14 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడది రూ. 22 లక్షల కోట్లకు చేరుకుంది’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం అమెరికా ఆటోమొబైల్‌ పరిశ్రమ రూ. 78 లక్షల కోట్లుగా ఉండగా చైనా (రూ. 47 లక్షల కోట్లు), భారత్‌ (రూ. 22 లక్షల కోట్లు) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకోవడంపై భారత్‌ లక్షల కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తోందని, వీటి వల్ల కాలుష్య సమస్య కూడా తలెత్తుతోందని గడ్కరీ చెప్పారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు, లాజిస్టిక్స్‌ వ్యయాలు తగ్గకపోతే అంతర్జాతీయ మార్కెట్లలో పోటీపడటం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నారు. అందుకే ఈ వ్యయాలను 8 శాతం స్థాయికి తగ్గించాలని కేంద్రం నిర్దేశించుకున్నట్లు వివరించారు. దేశీయంగా ఎక్స్‌ప్రెస్‌వేలు, ఎకనమిక్‌ కారిడార్లను నిర్మించడమనేది దేశీయంగా లాజిస్టిక్స్‌ వ్యయాలను 16 శాతం స్థాయి నుంచి 10 శాతానికి తగ్గించేందుకు దోహదపడినట్లు ఐఐటీ చెన్నై, ఐఐటీ కాన్పూర్, ఐఐఎం బెంగళూరు రూపొందించిన నివేదికలో వెల్లడైనట్లు చెప్పారు.

ఇదీ చదవండి: మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement