షియోమి, సోనీల తర్వాత.. హువావే కంపెనీ తీసుకొచ్చిన 'మాక్స్ట్రో ఎస్800' (Maextro S800) కారు ఆటోమోటివ్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. దీనిని సంస్థ తన ఆటో తయారీ భాగస్వాములతో కలిసి రూపొందించింది. ప్రస్తుతం చైనా మార్కెట్లో మాత్రమే అమ్మకానికి ఉంది. దీని ధర పది లక్షల యువాన్లు. భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ.1.19 కోట్లు.
హువావే కంపెనీ చైనాలోని లగ్జరీ కార్ల మార్కెట్‌లో మెర్సిడెస్ బెంజ్, రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి దిగ్గజ బ్రాండ్లకు పోటీ ఇవ్వడమే లక్ష్యంగా మాక్స్ట్రో ఎస్800 కారును తీసుకొచ్చింది. రోల్స్-రాయిస్ డిజైన్, మెర్సిడెస్ మేబ్యాక్ వంటి విలాసవంతమైన అంశాలను కలిగిన మాక్స్ట్రో ఎస్800 అత్యాధునిక టెక్నాలజీని పొందింది. అంతే కాకుండా ఇది 838 Bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది.
మాక్స్ట్రో ఎస్800 డిజైన్‌ను చూస్తే ఖరీదైన లగ్జరీ కార్లను గుర్తుకు తెస్తుంది. ముందు భాగంలో క్లోజ్డ్ ప్యానెల్‌తో పాటు ఇరువైపులా సన్నని ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉన్నాయి. బంపర్‌పై సిల్వర్ కలర్ మెష్, పెద్ద మల్టీ స్పోక్ అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిషింగ్, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, కూపే తరహా రూఫ్‌లైన్ వంటివి కారుకు ప్రీమియం లుక్ ఇస్తాయి. విండ్‌షీల్డ్ పైభాగంలో LiDAR సెన్సార్ కూడా కనిపిస్తుంది. అందుకే ఈ కారు రోల్స్ రాయిస్ తరహా లుక్, మెర్సిడెస్ మేబ్యాచ్ స్థాయి లగ్జరీ కలయికతో వచ్చిందని స్పష్టమవుతోంది.
కారు లోపలికి వెళ్లిన తర్వాత లగ్జరీ అనుభూతి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. రోల్స్ రాయిస్ కారులో కనిపించే స్టార్‌రీ స్కై తరహా క్రిస్టల్ షిమ్మర్ సీలింగ్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. క్యాబిన్‌లో ట్రిపుల్ స్క్రీన్ డ్యాష్‌బోర్డ్‌ను అందించారు. అంతేకాకుండా.. రాడార్, LiDAR, కెమెరాలతో కలిపి 32కు పైగా ఏడీఏఎస్ సెన్సర్లు ఉన్నాయి. ఇవి హువావే అభివృద్ధి చేసిన అధునాతన డ్రైవర్-అసిస్టెన్స్ టెక్నాలజీకి సహాయపడతాయి.
లగ్జరీతో పాటు పనితీరులోనూ మాక్స్ట్రో ఎస్800 తగ్గేదేలే అన్నట్లుగా ఉంది. ఈ కారు గరిష్ఠంగా 838 bhp పవర్ ఉత్పత్తి చేయగలదని కంపెనీ పేర్కొంది. ప్రత్యేకంగా రూపొందించిన ప్లాట్‌ఫామ్‌పై ఈ కారును నిర్మించారు. ఇందులో పలు రకాల పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు అందుబాటులో ఉండనున్నాయి.
హర్ష్ గోయెంకా ట్వీట్
హువావే, జేఏసీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన Maextro S800, చైనాలో అత్యధికంగా అమ్ముడవుతున్న అల్ట్రా-లగ్జరీ సెడాన్. ఇది బీఎండబ్ల్యూ, ఆడి, మెర్సిడెస్ వంటి అగ్రశ్రేణి మోడళ్లతో పోటీ పడుతోందని హర్ష్ గోయెంకా ట్వీట్ చేశారు. కారుకు సంబంధించిన వీడియోను కూడా షేర్ చేశారు. ఇది డబ్బుకు తగిన విలువను అందిస్తుందని, ఒకవేళ భారతదేశానికి ఈ కారు వస్తే.. లగ్జరీ మార్కెట్‌ను పూర్తిగా ఆక్రమించుకుంటుందని అన్నారు.
Maextro S800, developed by Huawei and JAC, is the top-selling ultra-luxury sedan in China, competing with the top end models of BMW, Audi and Mercedes. Good value for money and will sweep the luxury market if it ever comes here. pic.twitter.com/LsywfZ07RG
— Harsh Goenka (@hvgoenka) August 25, 2026


