భారతదేశంలో ప్రస్తుతం ఎస్‌యూవీలకు మంచి డిమాండ్ ఉంది. అయినప్పటికీ.. మారుతి సుజుకి డిజైర్ (సెడాన్) మాత్రం అమ్మకాలలో దూసుకుపోతోంది. FY27లో ఏప్రిల్ నుంచి జూలై వరకు డిజైర్ 89,816 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అంతకుముందు FY26లో 2,29,130 యూనిట్ల అమ్మకాలతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన కారుగా నిలిచింది. సెడాన్ కార్ల మార్కెట్ వాటా భారీగా పడిపోయినప్పటికీ డిజైర్ అమ్మకాలు గణనీయంగా ఉండటం విశేషం.
డిజైర్‌కు ఇంత ఆదరణ రావడానికి ప్రధాన కారణాలు.. మంచి మైలేజ్, తక్కువ మెయింటెనెన్స్ ఖర్చు, విశాలమైన క్యాబిన్, మంచి రీసేల్ వాల్యూ. మారుతి సుజుకి బ్రాండ్‌పై ప్రజలకు ఉన్న నమ్మకం, దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద సర్వీస్ నెట్‌వర్క్ కూడా దీనికి కలిసొస్తున్నాయి. అందుకే చాలా కుటుంబాలు డిజైర్ ఒక మంచి ఎంపికగా భావిస్తారు.
భద్రత విషయంలో.. కూడా కొత్త డిజైర్ మంచి ఫలితాలు సాధించింది. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో అడల్ట్, చైల్డ్ ప్రొటక్షన్ రెండింటిలోనూ 5 స్టార్ రేటింగ్ సాధించింది. ఈ కారులో 6 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. కాగా ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, సీఎన్జీ ఎంపికలలో కూడా లభిస్తుంది. పెట్రోల్ వెర్షన్ 24.79 కిమీ/లీ మైలేజ్, సీఎన్జీ మోడల్ 33.73 కిమీ/కేజీ మైలేజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. డిజైర్ ధరలు సుమారు రూ.6.26 లక్షల నుంచి రూ.9.36 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకు ఉంటుంది


