క్రిప్టో మార్కెట్‌లో బిట్‌కాయిన్ మరోసారి దూకుడు పెంచింది. సోమవారం బిట్‌కాయిన్ ధర సుమారు 2 శాతం పెరిగి 80,000 డాలర్లకు చేరువలో ట్రేడైంది. మే తర్వాత ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. బిట్‌కాయిన్‌తో పాటు ఈథర్ కూడా దాదాపు 2 శాతం లాభపడి 2,500 డాలర్లకు చేరుకుంది. దీంతో క్రిప్టోకు సంబంధించిన కంపెనీల షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి.
మూడు రోజుల్లో 20 శాతానికి..
గత కొంతకాలంగా బిట్‌కాయిన్ ధర పరిమిత శ్రేణిలోనే కదులుతోంది. అయితే.. ఇటీవల మూడు రోజుల్లోనే 20 శాతానికి పైగా పెరగడంతో మార్కెట్‌లో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది. బిట్‌కాయిన్‌లో భారీగా షార్ట్ పొజిషన్లు తీసుకున్న ట్రేడర్ల స్థానాలు మూసివేయబడటం కూడా.. ఈ ర్యాలీకి మరింత బలం ఇచ్చింది. మొత్తం 4 బిలియన్ డాలర్లకు పైగా బేరిష్ క్రిప్టో పొజిషన్లు లిక్విడేట్ అయినట్లు సమాచారం.
ETFల్లోకి భారీగా పెట్టుబడులు
బిట్‌కాయిన్ ర్యాలీకి మరో ముఖ్యమైన కారణం.. పెట్టుబడిదారుల నుంచి పెరిగిన డిమాండ్. గత వారం స్పాట్ బిట్‌కాయిన్ ETFల్లోకి సుమారు 1.92 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. గత అక్టోబర్ తర్వాత ఒక వారంలో వచ్చిన అత్యధిక పెట్టుబడులు ఇవే. దీంతో పెద్ద ఇన్వెస్టర్లు మళ్లీ క్రిప్టోపై ఆసక్తి చూపుతున్నారనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఆర్థిక ఆందోళనలు కూడా కారణమే
అమెరికా ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఆర్థిక లోటు, పెరుగుతున్న రుణభారం వంటి అంశాలు కూడా బిట్‌కాయిన్‌కు అనుకూలంగా మారుతున్నాయి. అమెరికా ట్రెజరీ దీర్ఘకాలిక ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను పెంచనున్నట్లు ప్రకటించడంతో బాండ్ ఈల్డ్స్ కొంత తగ్గాయి. దీంతో బిట్‌కాయిన్, బంగారం వంటి ప్రత్యామ్నాయ ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరిగింది.
ర్యాలీ కొనసాగుతుందా?
బిట్‌కాయిన్ ప్రస్తుత ర్యాలీ నిజంగా కొత్త అప్‌ట్రెండ్‌కు సంకేతమా, లేక తాత్కాలిక పెరుగుదల మాత్రమేనా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. 2023 జనవరిలో కూడా బిట్‌కాయిన్ మూడు రోజుల్లో సుమారు 20 శాతం పెరిగింది. అయితే ఆ సమయంలో ర్యాలీ ఎక్కువ కాలం కొనసాగలేదు. ప్రస్తుతం కూడా అదే పరిస్థితి వస్తుందా అనే విషయంలో మార్కెట్ నిపుణులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
రే డాలియో కీలక వ్యాఖ్యలు
ప్రముఖ పెట్టుబడిదారుడు రే డాలియో ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలు రాబోయే సంవత్సరాల్లో సంక్షోభాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ పోర్ట్‌ఫోలియోలో కొంత మొత్తాన్ని బిట్‌కాయిన్‌లో ఉంచుకోవచ్చని ఆయన సూచించారు. దీంతో బిట్‌కాయిన్ భవిష్యత్తుపై చర్చ మరింత వేడెక్కింది. మొత్తం మీద.. ETF పెట్టుబడులు, షార్ట్ స్క్వీజ్, ఆర్థిక ఆందోళనలు కలిసి బిట్‌కాయిన్ ర్యాలీకి ప్రస్తుతం మద్దతుగా నిలుస్తున్నాయి.
ఇదీ చదవండి: ద్రవ్యోల్బణం ముప్పు తప్పదా?.. పీటర్ షిఫ్ సంచలన వ్యాఖ్యలు


