‘‘పుట్టామా..ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్-జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్-జీ ఔట్‌లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997- 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్-జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 - 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా.
మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, ఛైర్మన్ వంటి హోదాల కంటే పనికి - జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్-జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్‌ఫుల్ కెరియర్‌కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని
లోకలే మేలు...
ఒకప్పుడు ఎంతో పాప్యులర్ అయిన విదేశీ చదువులపై జెన్-జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు. విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69 శాతం మంది చెబుతున్నారు. ఒకట్రెండు సెమిస్టర్లకు విదేశాలకు వెళతారా? అంటే అప్పటి వరకూ విదేశీ చదువులపై ఆసక్తి చూపని వారిలోనూ 12 శాతం మంది సై అంటూండటం విశేషం.
ఎందుకీ పోకడ...
జెన్-జీలో వచ్చిన ఈ మార్పునకు చాలా కారణాల ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఐటీ కంపెనీల్లో రాత్రికి రాత్రి వేలమంది ఉద్యోగులకు లేఆఫ్‌లు పలుకుతున్న తీరు, వీసా నిబంధనల్లో తరచూ వస్తున్న మార్పులు, అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్న కృత్రిమ మేధ వంటివి జెన్-జీ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మంచి మార్కులు తెచ్చుకుని ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు (ఇంజినీరింగ్, వైద్యం, సీఏ, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంబీఏ వంటివి) పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడితే జీవితం సార్థకం అన్న భావన ఉండేదని, ఇప్పుడు ఈ పాత కెరీర్ మ్యాప్ పనిచేయడం లేదని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన సంస్థ ఎమిరైటస్ సీఈవో దామెర అశ్విన్ చెబుతున్నారు.
అయితే జెన్-జీ ఈ మార్గంలో ఎవరూ ఊహించనంత వేగంగా మార్పులు చేస్తోందని తెలిపారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న నైపుణ్య అవసరాలను సంస్థలు అందుకోలేకపోతూంటే జెన్-జీలు ఈ మార్పులను పరిశీలిస్తూ తమనితాము మార్చుకుంటున్నారని, కొత్త నైపుణ్యాలతో కొత్త రకం ఉద్యోగ డిమాండ్లను అందుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ నివేదిక చెబుతోందన్నారు. ‘‘జెన్-జీ గురించి ప్రస్తుతం జరుగుతున్నంత చర్చ ఏ తరంపైనా జరిగి ఉండదేమో. కొందరు ఈ తరం పోకడలను చూసి ఆనందిస్తే.. అపార్థం చేసుకున్న వాళ్లూ చాలామందే ఉన్నారు. అంతేకాకుండా.. తక్కువ అంచనా వేసిన వాళ్లకూ కొదవేమీ లేదు. అందుకే అసలీ తరం ఏమనుకుంటోందో, ఏం చెప్పదలచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం’’ అని చెప్పారు.


