పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు | Commercial LPG Prices Hiked and ATF Rates Also Raised | Sakshi
Sakshi News home page

LPG Gas Price: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

Sep 1 2026 10:39 AM | Updated on Sep 1 2026 10:42 AM

Commercial LPG Prices Hiked and ATF Rates Also Raised

సెప్టెంబర్ 1 నుంచి కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు మాత్రమే కాకుండా.. విమానాల్లో ఉపయోగించే ఏటీఎఫ్ (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ధరలు పెరిగాయి. దీంతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ వంటి వ్యాపారాల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో విమానయాన సంస్థలపై కూడా ఇంధన భారం పెరగనుంది.

19 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరను రూ.9.50 పెంచారు. దీంతో రూ.2,738గా ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.2,747.50కి చేరింది. 5 కిలోల కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధర కూడా రూ.2 పెరిగి రూ.764కి చేరింది. గత రెండు నెలల్లో కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గిన తర్వాత.. ఇప్పుడు మళ్లీ పెరగడం గమనార్హం. ఆగస్టు 1న రూ.192, జూలై 1న రూ.183.50 చొప్పున ధరలు తగ్గాయి.

ఇక విమాన ఇంధనం ధర కూడా భారీగా పెరిగింది. దేశీయ విమానయాన సంస్థలకు ఏటీఎఫ్ ధర లీటరుకు రూ.6.28 పెరిగి రూ.121.28కి చేరింది. అంటే దాదాపు 5.46 శాతం పెంపు జరిగింది. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో ATFకు పెద్ద వాటా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మొత్తం ఆపరేటింగ్ ఖర్చుల్లో ఇది 40 శాతం వరకు ఉండొచ్చు. కాబట్టి ఇంధన ధర పెరగడం వల్ల విమాన సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడుతుంది.

అయితే సాధారణ ప్రజలు వంటకు ఉపయోగించే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. కాబట్టి ఇది రూ.942 వద్దనే ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలలో కూడా ఎలాంటి మార్పులు జరగలేదు. కమర్షియల్ ఎల్‌పీజీ, ఏటీఎఫ్ ధరలను సాధారణంగా ప్రతి నెల ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్‌లోని ధరలు, విదేశీ మారకపు విలువ వంటి అంశాలను బట్టి సవరించుతారు. రాష్ట్రాలను బట్టి స్థానిక పన్నుల కారణంగా ధరల్లో కొంత తేడా ఉండొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement