కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వంటగ్యాస్ (LPG) రీఫిల్ బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో కీలక మార్పు చేసింది. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో ఒకసారి సిలిండర్ బుక్ చేసిన తర్వాత మరో సిలిండర్‌ను బుక్ చేసుకోవడానికి 45 రోజుల గడువు ఉండేది. అయితే.. ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి మెరుగుపడటంతో ఈ గడువును 25 రోజులకు తగ్గించినట్లు కేంద్ర మంత్రి సురేష్ గోపి ప్రకటించారు. దీంతో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులందరూ ఇకపై 25 రోజుల వ్యవధిలోనే తదుపరి ఎల్‌పీజీ సిలిండర్‌ను బుక్ చేసుకోవచ్చు.
తగ్గిన వ్యవధి
మధ్యప్రాచ్యంలో ఏర్పడిన సంక్షోభం కారణంగా.. ఎల్‌పీజీ సరఫరాపై ఒత్తిడి పెరిగింది. దీంతో దేశంలో ఎల్‌పీజీ వినియోగాన్ని నియంత్రించేందుకు.. గతంలో బుకింగ్ గడువును పెంచాల్సి వచ్చింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజుల వ్యవధి అమలు చేశారు.
అయితే.. ప్రస్తుతం ఎల్‌పీజీ సరఫరా పరిస్థితి క్రమంగా మెరుగుపడటంతో పాటు పెండింగ్‌లో ఉన్న రీఫిల్ బుకింగ్‌లు కూడా గణనీయంగా తగ్గాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పాత నిబంధనలను సడలించి 25 రోజుల గడువును అమలు చేయాలని చమురు మార్కెటింగ్ కంపెనీలను ఆదేశించింది.
మరోవైపు.. దేశంలో ఎల్‌పీజీ అమ్మకాలు కూడా తగ్గుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఆగస్టులో ఎల్పీజీ అమ్మకాలు 16.1 శాతం తగ్గి 2.42 మిలియన్ టన్నులకు చేరాయి. అంతకుముందు.. జూలైలో కూడా ఎల్‌పీజీ డిమాండ్ 17.4 శాతం తగ్గింది. పశ్చిమాసియా సంక్షోభం తర్వాత హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థల్లో ఎల్‌పీజీ వినియోగంపై ఆంక్షలు రావడంతో పాటు, కొంతమంది వినియోగదారులు ఇప్పుడు పీఎన్‌జీ వైపు మారారు. దీంతో ఎల్‌పీజీ డిమాండ్ క్రమంగా తగ్గుతోందని సమాచారం.
పెరుగుతున్న పీఎన్‌జీ వినియోగం
పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఎల్‌పీజీ సరఫరాలో అంతరాయాలు ఏర్పడిన సమయంలో.. హోటళ్లు, రెస్టారెంట్లు వంటి రంగాల్లో వినియోగాన్ని నియంత్రించారు. జూన్‌లో ఆంక్షలు ఎత్తివేయడంతో ఎల్‌పీజీ అమ్మకాలు కొంత పెరిగినా, గత సంవత్సరాలతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయి. దీనికి ప్రధాన కారణాల్లో ఒకటి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు తమ అవసరాల కోసం ఎల్‌పీజీకి బదులుగా పీఎన్‌జీని ఉపయోగించడం. అందువల్ల భవిష్యత్తులో కూడా ఎల్‌పీజీ వినియోగంలో కొంత భాగం పైపుల ద్వారా వచ్చే సహజ వాయువు వైపు మళ్లే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఆర్ధిక సమస్యల్లో దిగ్గజ కంపెనీ.. ప్రమాదంలో వేలాది ఉద్యోగులు!


