ఆర్ధిక సమస్యల్లో దిగ్గజ కంపెనీ.. ప్రమాదంలో వేలాది ఉద్యోగులు! | Jaguar Land Rover To Cut 4000 Jobs UK Government Rules Out Bailout | Sakshi
Sakshi News home page

ఆర్ధిక సమస్యల్లో దిగ్గజ కంపెనీ.. ప్రమాదంలో వేలాది ఉద్యోగులు!

Sep 7 2026 4:10 PM | Updated on Sep 7 2026 4:26 PM

Jaguar Land Rover To Cut 4000 Jobs UK Government Rules Out Bailout

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటోంది. పెరుగుతున్న తయారీ ఖర్చులు, కార్ల అమ్మకాలు తగ్గడం, అమెరికా టారిఫ్‌ల ప్రభావం వంటి కారణాలతో కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. వచ్చే రెండేళ్లలో సుమారు 4,000 ఉద్యోగాలను తగ్గించే అవకాశం ఉంది. ఇది JLR మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతానికి సమానం.

ప్రత్యర్థుల పోటీ
జాగ్వార్ ల్యాండ్ రోవర్ సమస్యకు మరో ముఖ్యమైన కారణం.. చైనా కార్ల కంపెనీల నుంచి వస్తున్న పోటీ. బీవైడీ, చెరీ వంటి సంస్థలు తక్కువ ధరలకు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లను మార్కెట్లోకి తీసుకువస్తున్నాయి. మంచి ఫీచర్లు, తక్కువ ధరలతో ఈ కంపెనీలు యూరప్‌లో వేగంగా మార్కెట్‌ను పెంచుకుంటున్నాయి. దీంతో జేఎల్ఆర్ వంటి ఖరీదైన ప్రీమియం కార్ల కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది.

ఆర్థిక నష్టాల్లో ఉన్న జేఎల్ఆర్ సంస్థకు గవర్నమెంట్ సహాయం అందిస్తుందా? అనే ప్రశ్నకు.. ప్రభుత్వం ఒక ప్రైవేట్ కంపెనీ వ్యాపారాన్ని నేరుగా నడపదని బ్రిటన్ బిజినెస్ సెక్రటరీ రెనాల్డ్స్ పేర్కొన్నారు. అయితే ఉద్యోగాల నష్టాన్ని సాధ్యమైనంత.. వరకు తగ్గించేందుకు ప్రభుత్వం కంపెనీతో, కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతోంది. గతంలో జేఎల్ఆర్ ఎదుర్కొన్న సప్లయ్ చైన్ సమస్యల సమయంలో బ్రిటన్ ప్రభుత్వం సుమారు 1.5 బిలియన్ పౌండ్ల రుణానికి హామీ ఇచ్చింది.

ప్రమాదంలో జేఎల్ఆర్
జేఎల్ఆర్ బ్రిటన్‌లో సుమారు 33,000 మందికి ఉద్యోగాలు కల్పిస్తోంది. కాబట్టి ఉద్యోగాల కోత బ్రిటన్ తయారీ రంగంపై కూడా ప్రభావం చూపుతుంది. ఒకప్పుడు ప్రపంచంలోని ప్రముఖ ఆటోమొబైల్ తయారీ దేశాల్లో ఉన్న బ్రిటన్ ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోయింది. జేఎల్ఆర్ అమెరికా మార్కెట్‌పై ఎక్కువ దృష్టి పెట్టడం, అక్కడ ఉత్పత్తిని పెంచుకునే అవకాశాలను పరిశీలించడం వల్ల బ్రిటన్ ఒక ప్రధాన కార్ల తయారీ కేంద్రంగా తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన ఉంది.

మొత్తం మీద జేఎల్ఆర్ ఉద్యోగాల కోత అనేది.. కేవలం ఒక కంపెనీకి సంబంధించిన సమస్య కాదు. ఇది చైనా కార్ల కంపెనీల పెరుగుతున్న పోటీ, ఈవీ మార్కెట్‌లో వస్తున్న మార్పులు, పెరుగుతున్న తయారీ ఖర్చులు యూరప్ ఆటో పరిశ్రమపై ఎంత ప్రభావం చూపుతున్నాయో అనే విషయాలను తెలియజేస్తోంది. కాబట్టి ఇలాంటి సమయంలో జేఎల్ఆర్ తన ఖర్చులను తగ్గించుకుని, ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి: భారీగా పెరిగిన ఇళ్ల ధరలు.. కారణాలు ఇవే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement