జేఎల్‌ఆర్‌పై సైబర్ దాడి.. సెప్టెంబర్ 24 వరకు ఉత్పత్తి నిలిపివేత | Why Jaguar Land Rover extended production shutdown until September 24? | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఆర్‌పై సైబర్ దాడి.. సెప్టెంబర్ 24 వరకు ఉత్పత్తి నిలిపివేత

Sep 17 2025 10:34 AM | Updated on Sep 17 2025 10:52 AM

Why Jaguar Land Rover extended production shutdown until September 24?

బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్‌) తన ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 30న జరిగిన సైబర్‌దాడితో దాని ప్రపంచ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ అటాక్‌తో తయారీని తక్షణమే రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికీ దానిపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ఉత్పత్తి నిలిపివేత గడువును కొంతకాలంపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.  

ఈ సందర్భంగా కంపెనీ ప్రకటన విడుదల చేసింది. ‘మేము మా ఉత్పత్తి నిలిపివేతను సెప్టెంబర్ 24 బుధవారం వరకు పొడిగించాం. సైబర్ అటాక్‌ సంఘటనపై ఫోరెన్సిక్ దర్యాప్తు కొనసాగుతోంది. దాంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నాం. కంపెనీ ప్రపంచ కార్యకలాపాల నియంత్రిత వ్యవస్థలపై వివిధ దశలను పరిశీలిస్తున్నాం. దీనికి కొంత సమయం పడుతుంది. ఈ నిరంతర అంతరాయానికి చింతిస్తున్నాం. దర్యాప్తు పురోగతి వివరాలను అప్‌డేట్‌ చేస్తాం’ అని కంపెనీ తెలిపింది.

మూడు ప్లాంట్లపై ప్రభావం..

టాటా మోటార్స్ యాజమాన్యంలోని కంపెనీ మూడు ప్రధాన యూకే ప్లాంట్లు - సోలిహల్, హేల్‌వుడ్‌, వోల్వర్ హాంప్టన్ ఈ సైబర్‌ అటాక్‌ వల్ల ఉత్పత్తిని నిలిపేశారు. ఇప్పటికే రెండు వారాలకు పైగా ఇవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా సాధారణంగా రోజుకు దాదాపు 1,000 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ మూసివేత జేఎల్‌ఆర్‌, టాటా మోటార్స్ త్రైమాసిక ఆర్థిక పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

33 వేల మంది ఉద్యోగులు..

ఈ ప్లాంట్లలో 33,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ షట్‌డౌన్ సమయంలో సిబ్బంది విధులకు రాకూడదని ఆదేశించారు. ఇప్పటివరకు సైబర్ దాడి మూలాలు లేదా దాని స్వభావం గురించి బహిరంగంగా వివరాలు వెల్లడికాలేదు. రాన్సమ్‌వేర్‌ లేదా ఇతర రకాల మాల్వేర్ దాడి జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది.

ఇదీ చదవండి: ‘రాత్రిళ్లు పనిచేసి రూ.1 కోటి సంపాదించాను’

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement