ప్రముఖ దేశీయ వాహన తయారుదారు టాటా మోటర్స్ తమ వాహన ధరలను త్వరలో పెంచనున్నట్లు తెలుస్తోంది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ (టీఎంపీవీ) ఎండీ, సీఈవో శైలేష్ చంద్ర ఈ మేరకు సంకేతాలిచ్చారు.
గత సంవత్సరంలో ఇన్పుట్ ఖర్చులు ఆదాయంలో దాదాపు 1.5 శాతం పెరిగాయని, అయినా పరిశ్రమ ఈ భారాన్ని పూర్తిగా వినియోగదారులపై మోపలేదని శైలేష్ చంద్ర చెప్పారు.ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ నాలుగో త్రైమాసికంలో ధరల పెంపును అమలు చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ధరల సర్దుబాటు ఉండవచ్చన్నారు.
అయితే జనవరిలో డెలివరీలు ప్రారంభం కానున్న కొత్త ఎస్యూవీ సియెర్రా ధరలను కంపెనీ పెంచబోదని చెప్పారు. టాటా మోటార్స్ ప్రస్తుతం ఎస్యూవీ విభాగంలో 16-17 శాతం వాటాను కలిగి ఉందని, సియెర్రా పూర్తిగా పుంజుకుంటే దీనిని 20-25 శాతానికి పెంచుతుందని శైలేష్ చంద్ర ఆశాభావం వ్యక్తం చేశారు.
టాటా మోటార్స్ సనంద్ -2 ప్లాంట్లో కొత్త సియెర్రా వాహనాలను తయారు చేస్తున్నారు. టాటా మోటార్స్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో సియెర్రా ఎలక్ట్రిక్ ఈవీని కూడా విడుదల చేయనుంది. తద్వారా దాని ఎలక్ట్రిక్ ఎస్యూవీ పోర్ట్ఫోలియోను మరింత విస్తరిస్తుంది.


