
బ్రిటీష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) తన ఉత్పత్తి నిలిపివేతను అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఆగస్టు 30న జరిగిన సైబర్‌దాడితో దాని ప్రపంచ కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మొదట ఈ అటాక్‌తో తయారీని తక్షణమే రెండు వారాలపాటు తాత్కాలికంగా నిలిపివేయాలని కంపెనీ నిర్ణయించుకుంది. అయితే ఇప్పటికీ దానిపై దర్యాప్తు కొనసాగుతుండడంతో ఉత్పత్తి నిలిపివేత గడువును మరికొంతకాలంపాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.
దశలవారీగా ఉత్పత్తి పునప్రారంభ ప్రణాళికలపై పని చేస్తున్నాం. సైబర్ అటాక్‌కు సంబంధించిన దర్యాప్తును కొనసాగిస్తున్నందున రాబోయే వారంలో దీనిపై స్పష్టత వస్తుంది. జేఎల్‌ఆర్ సైబర్ సెక్యూరిటీ నిపుణులతో, బ్రిటన్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ)తో కలిసి పని చేస్తోంది. ఈ ఉత్పత్తి అంతరాయాన్ని నిర్వహించడానికి కంపెనీ సహోద్యోగులు, సరఫరాదారులు, భాగస్వాములతో పని చేస్తున్నాం’ అని కంపెనీ తెలిపింది. ఇప్పటికే కంపెనీ సెప్టెంబర్ 24 వరకు ఉత్పత్తిని నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. దాన్ని అక్టోబర్ 1 వరకు తాజాగా పొడిగించడం గమనార్హం.
మూడు ప్లాంట్లపై ప్రభావం..
టాటా మోటార్స్ యాజమాన్యంలోని కంపెనీ మూడు ప్రధాన యూకే ప్లాంట్లు - సోలిహల్, హేల్‌వుడ్, వోల్వర్ హాంప్టన్ ఈ సైబర్ అటాక్ వల్ల ఉత్పత్తిని నిలిపేశారు. ఇప్పటికే మూడు వారాలకు పైగా ఇవి ఖాళీగా ఉన్నాయి. ఈ ప్లాంట్ల ద్వారా సాధారణంగా రోజుకు దాదాపు 1,000 వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఈ మూసివేత జేఎల్‌ఆర్, టాటా మోటార్స్ త్రైమాసిక ఆర్థిక పనితీరుపై ప్రభావాన్ని చూపుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.
33 వేల మంది ఉద్యోగులు..
ఈ ప్లాంట్లలో 33,000 మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ షట్‌డౌన్ సమయంలో సిబ్బంది విధులకు రాకూడదని ఆదేశించారు. ఇప్పటివరకు సైబర్ దాడి మూలాలు లేదా దాని స్వభావం గురించి బహిరంగంగా వివరాలు వెల్లడికాలేదు. రాన్సమ్‌వేర్ లేదా ఇతర రకాల మాల్వేర్ దాడి జరిగిందా అనేది అస్పష్టంగా ఉంది.
ఇదీ చదవండి: ర్యాపిడోలో స్విగ్గీ వాటా విక్రయం