
డీల్ విలువ రూ.2,400 కోట్లు
బైక్ ట్యాక్సీ అగ్రిగేటర్ ర్యాపిడో(Rapido)లోగల వాటాను విక్రయించేందుకు బోర్డు ఆమోదముద్ర వేసినట్లు ఆన్‌డిమాండ్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ(Swiggy) తాజాగా వెల్లడించింది. ర్యాపిడో మాతృ సంస్థ రోపెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్‌లో వాటా విక్రయం ద్వారా దాదాపు రూ.2,400 కోట్లు అందుకోనున్నట్లు తెలియజేసింది. ర్యాపిడో సైతం ఫుడ్ డెలివరీ(Food Delivery) సేవలలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో వాటా విక్రయాన్ని చేపట్టనున్నట్లు జులైలోనే స్విగ్గీ సంకేతమిచ్చింది.
దీనిలో భాగంగా 10 ఈక్విటీ షేర్లతోపాటు.. తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే 1,63,990 సిరీస్ డి ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను ఎంఐహెచ్ ఇన్వెస్ట్‌మెంట్స్ వన్ బీవీ(నెదర్లాండ్స్)కు విక్రయించనుంది. వీటి విలువ రూ. 1,968 కోట్లుకాగా.. వాటాదారులకు లబ్దిని చేకూర్చేబాటలో పెట్టుబడులను ప్రోజస్ గ్రూప్ సంస్థ ఎంఐహెచ్‌కు విక్రయించనున్నట్లు స్విగ్గీ తెలియజేసింది. ఈ బాటలో ర్యాపిడోకు చెందిన తప్పనిసరిగా మార్పిడికి లోనయ్యే 35,958 సిరీస్ డి ప్రిఫరెన్స్ షేర్ల(సీసీపీఎస్)ను సెబీ వద్ద రిజిస్టరైన వెస్ట్‌బ్రిడ్జి సంస్థ సేతు ఏఐఎఫ్ ట్రస్ట్‌కు అమ్మివేయనున్నట్లు పేర్కొంది.
ఈ డీల్ విలువ రూ. 431.5 కోట్లుగా వెల్లడించింది. వెరసి ర్యాపిడోలో వాటాను రూ. 2,400 కోట్లకు విక్రయించనుంది. కాగా.. ఇన్‌స్టామార్ట్ బ్రాండుతో నిర్వహిస్తున్న క్విక్ కామర్స్ బిజినెస్ విభాగాన్ని పరోక్ష సొంత అనుబంధ సంస్థ స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ప్రయివేట్ లిమిటెడ్‌కు బదిలీ చేయనున్నట్లు వివరించింది. స్లంప్ సేల్ పద్ధతిన విక్రయాన్ని చేపట్టనున్నట్లు తెలియజేసింది.
ఇదీ చదవండి: వడ్డీ రేట్ల కోతపై ఎస్‌బీఐ అంచనా