
ఆర్‌బీఐ తదుపరి ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రెపో రేటును పావు శాతం మేర (25 బేసిస్ పాయింట్లు) తగ్గించే అవకాశం ఉందని ఎస్‌బీఐ(SBI) పరిశోధన విభాగం (ఎస్‌బీఐ రీసెర్చ్) అంచనా వేసింది. రెపో రేటు తగ్గింపునకు కీలకమైన ద్రవ్యోల్బణం సమీప కాలంలోనే కాకుండా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ నియంత్రణలోనే ఉంటుందని పేర్కొంది.
ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగి రావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆర్‌బీఐ ఎంపీసీ రెపో రేటు(Repo Rate)ను ఒక శాతం తగ్గించడం తెలిసిందే. ఆగస్ట్‌లో జరిగిన చివరి సమీక్షలో మాత్రం రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఈ నెల 29 నుంచి మూడు రోజుల పాటు ఆర్‌బీఐ ఎంపీసీ సమీక్షా సమావేశం జరగనుంది. అక్టోబర్ 1న నిర్ణయాలు వెలువడనున్నాయి. తదుపరి సమీక్షలోనూ రేట్ల కోతకు వెళ్లేందుకు హేతుబద్దత ఉన్నట్టు ఎస్‌బీఐ రీసెర్చ్ పేర్కొంది. ఆ సందర్భంగా ఆర్‌బీఐ ఎంపీసీ వ్యక్తం చేసే అభిప్రాయాలు భవిష్యత్తు మానిటరీ పాలసీకి కీలకమవుతాయని, ఈల్డ్స్‌పై ప్రభావం చూపుతాయని తెలిపింది.
ద్రవ్యోల్బణం నియంత్రణల్లో ఉన్నందున, తటస్థ విధానంతో మరో విడత రేటు కోతను చేపట్టకపోవడం వల్ల ఒనగూరే ప్రయోజనం ఉండదని ఎస్‌బీఐ నివేదిక పేర్కొంది. జీఎస్‌టీలో రేట్లను క్రమబద్దీకరించడం ఫలితంగా ద్రవ్యోల్బణం మరో 65–75 బేసిస్ పాయింట్లు తగ్గుతుందని అధ్యయన నివేదికను రూపొందించిన, ఎస్‌బీఐ గ్రూప్ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్యకాంతి ఘోష్ అంచనా వేశారు. కొత్త సీపీఐ సిరీస్‌తో ద్రవ్యోల్బణం మరో 20–30 బేసిస్ పాయింట్లు దిగొస్తుందని చెప్పారు. దీంతో 2025–26లో, 2026–27లో ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత స్థాయిలో దిగువనే ఉండొచ్చని (4 శాతానికి మైనస్, ప్లస్ 2 శాతం.. అంటే 2 శాతం) పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సీఆర్‌పీఎఫ్‌కు రైఫిల్స్ సరఫరా