
కేంద్ర సాయుధ బలగాల సంస్థ సీఆర్‌పీఎఫ్‌కు రెండు వందల సీఎస్‌ఆర్ 338 స్నైపర్ రైఫిళ్లను సరఫరా చేసే కాంట్రాక్టును ఐకామ్-కారకాల్ దక్కించుకుంది. వీటిని హైదరాబాద్‌లోని ప్లాంటులో తయారు చేయనుంది. దేశీయంగా తొలిసారిగా ఉత్పత్తి చేసిన ఈ రైఫిల్‌ను ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో అందించనుంది.
భారత్–యూఏఈ రక్షణ రంగ సహకారానికి సంబంధించి ఈ తరహా చిన్న ఆయుధాల సాంకేతిక పరిజ్ఞానం బదిలీ ఒక కీలక పరిణామం అని కారకల్ సీఈవో హమద్ అలమెరి తెలిపారు. దేశీయంగా రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్న తమ దీర్ఘకాలిక వ్యూహానికి ఈ కాంట్రాక్టు దోహదపడుతుందని ఐకామ్ టెలీ డైరెక్టర్ సుమంత్ పాతూరు వివరించారు.
చిన్న ఆయుధాల తయారీ సాంకేతికత కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కి చెందిన ఎడ్జ్ గ్రూప్ సంస్థ కారకాల్ ఇంటర్నేషనల్‌తో మౌలిక రంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) గ్రూప్ సంస్థ ఐకామ్‌కి ఒప్పందం ఉంది. ఇరు సంస్థలు కలిసి ఈ ఏడాది ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో అధునాతన చిన్న ఆయుధాల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాయి. ఇక్కడి నుంచి కారకాల్ వివిధ ఆయుధాలను ఎగుమతి కూడా చేయనుంది.
ఇదీ చదవండి: ‘నా తండ్రి మందు తాగి భూమి అమ్మాడు’