
కుమార్తె పెళ్లి కోసం ఓ తండ్రి 1995లో భూమి అమ్మాడు. అయితే తన పెద్ద కుమారుడు తండ్రిపై చేసిన ఆరోపణను సుప్రీంకోర్టు కొట్టేసి.. హిందూ అవిభాజ్య చట్టంలోని అంశాలను ప్రస్తావిస్తూ తీర్పును వెలువరించింది. అసలు కుమారుడు తండ్రిపై చేసిన ఆరోపణ ఏమిటో.. కోర్టు ఏం చెప్పిందో ఈ కథనంలో తెలుసుకుందాం.
అసలు కేసేంటి..?
శరణప్ప అనే వ్యక్తికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. తన కుమార్తె వివాహ ఖర్చుల నిమిత్తం కుటుంబానికి చెందిన భూమికి తానే యజమానిగా ఉండడంతో 1995లో ఓ వ్యక్తికి అమ్మేశాడు. అయితే ఈ సంఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత అంటే 1999లో అతని పెద్ద కుమారుడికి విషయం తెలిసి ఈ అమ్మకాన్ని కోర్టులో సవాలు చేశాడు. తన తండ్రి శరణప్ప మద్యపానానికి బానిసై, వృథా ఖర్చుల కోసం ఈమేరకు అమ్మకం చేశాడని, తిరిగి ఆ భూమిని తమకు ఇప్పించాలని కోర్టులో దావా వేశాడు.
కోర్టు తీర్పు
కొనుగోలు దారుడు అప్పటికే పక్కాగా ధ్రువపత్రాలను సిద్ధం చేసుకున్నాడు. కుమారుడు వేసిన దావా కారణంగా 2000 సంవత్సరం నుంచి వివిధ కోర్టుల్లో, వివిధ దశల్లో వాదోపవాదాలు జరిగాయి. చివరగా ఈ కేసు కిందిస్థాయి కోర్టుల నుంచి సుప్రీంకోర్టు చేరింది. ఇటీవల హిందూ అవిభాజ్య కుటుంబ(హెచ్‌యూఎఫ్) చట్టంలోని అంశాలను ప్రస్థావిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
‘కుటుంబంలోని వ్యక్తుల వివాహ ఖర్చుల కోసం యజమానికి చెందిన భూమిని తాను అమ్మే హక్కు ఉంటుంది. హెచ్‌యూఎఫ్ ప్రకారం కుటుంబ కర్తగా తండ్రి ఉంటాడు. నిజమైన కుటుంబ అవసరాల కోసం ఆస్తిని అమ్మే సర్వహక్కులు శరణప్పకు ఉన్నాయి. అందుకు ఎవరినీ సంప్రదించాల్సిన అవసరం లేదు’ అని ధర్మాసనం తెలిపింది. తండ్రి మద్యపానం సేవించి ఈ లావాదేవీ చేశాడు అనడానికి ఎలాంటి రుజువులు చూపకపోవడంతో కుమారుడి దావాను కోర్టు కొట్టేసింది. జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ జాయ్యాల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది.
ఇదీ చదవండి: వర్షంలో ఫుడ్ ఆర్డర్ చేస్తే ‘రెయిన్ ఫీజు’పై జీఎస్టీ