సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా చోటు చేసుకున్న అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తునకు ఏర్పాటైన కొత్త స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) తన వ్యూహం మార్చింది. ఓ పక్క సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జూబ్లీహిల్స్ ఠాణాలోని కార్యాలయంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్‌రావును విచారిస్తోంది. మరోపక్క ఆయనకు పదవీ విరమణ అనంతరం ఎక్స్‌టెన్షన్ లభించడం, సుదీర్ఘకాలం విధులు నిర్వర్తించడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంది. దీనికి వెనుక బలమైన రాజకీయ కారణాలు, ఒత్తిళ్లు ఉంటాయని భావిస్తోంది. ఈ విషయం నిగ్గు తేల్చడానికి అప్పట్లో కీలక బాధ్యతల్లో పని చేసిన అధికారులను ప్రశి్నస్తోంది. ఇప్పటికే మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్, నిఘా విభాగం మాజీ చీఫ్ నవీన్ చంద్‌లకు నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ సాక్షులుగా పరిగణిస్తూ విచారించి వాంగ్మూలాలు నమోదు చేసింది.
త్వరలోనే గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) కార్యదర్శిగా పని చేసిన వారితో పాటు కొందరు సలహాదారులకు నోటీసులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నెల 25 వరకు ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణకు అవకాశం ఉంది. ఆ తర్వాతే ఈ విచారణ చేపట్టాలని సిట్ భావిస్తోంది. వచ్చే నెల 16న సుప్రీం కోర్టులో కేసు విచారణకు వచ్చే సమయానికి కొత్తగా మరికొన్ని కీలకాంశాలను గుర్తించాలని, న్యాయస్థానానికి నివేదించడం ద్వారా తదుపరి చర్యలు తీసుకోవాలని సిట్ నిర్ణయించింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) డీసీపీగా పని చేసిన ప్రభాకర్‌రావు 2016లో ఎస్‌ఐబీకి డీఐజీగా వెళ్లారు. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్‌రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా (ఓఎస్డీ) నియమించింది. హోదా ఏదైనా ఆయన మాత్రం ఎస్‌ఐబీ చీఫ్‌గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్‌చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్‌రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించినప్పటికీ ఎస్‌ఐబీని మాత్రం వదల్లేదు. 2023 డిసెంబర్ వరకు ఎక్స్‌టెన్ష¯Œన్‌పై కొనసాగుతూనే ఉన్నారు. ఆయన ఎక్స్‌టెన్షన్ కోసం నిఘా విభాగాధిపతి ప్రతిపాదించాల్సి ఉంటుంది.
ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యంతోనే ప్రధాన కార్యదర్శి దానిపై నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే 2019 డిసెంబర్ నుంచి 2023 జనవరి వరకు చీఫ్ సెక్రటరీగా పని చేసిన సోమేష్ కుమార్‌తో పాటు 2016 సెపె్టంబర్ నుంచి 2020 నవంబర్ వరకు నిఘా విభాగాధిపతిగా పని చేసిన నవీన్‌చంద్ వాంగ్మూలాలూ ఈ కేసులో కీలకంగా మారాయి. ప్రభాకర్‌రావు కొనసాగింపు వెనుక పెద్దల ప్రమేయం, ఒత్తిడి ఉందని భావిస్తున్న సిట్ ఆ కోణంలోనూ వీరిద్దరినీ విచారించింది. ప్రభాకర్‌రావుకు ఎక్స్‌టెన్సన్ ఎందుకు ఇచ్చారు? అలాంటి ప్రతిపాదనలు రూపొందించమని ఎవరు చెప్పారు? ఎవరి ఒత్తిళ్ల మేరకు ఈ ప్రక్రియ జరిగింది? తదితర అంశాలను ప్రశి్నంచారు. త్వరలోనే మరికొందరినీ ప్రశి్నంచడానికి సిట్ సన్నాహాలు చేస్తోంది. సోమేష్‌కుమార్, నవీన్ చంద్ ఇచి్చన వాంగ్మూలాల్లోని అంశాల ఆధారంగా గత సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన అధికారులను అడగాల్సిన ప్రశ్నల్ని సిట్ సిద్ధం చేస్తోంది. కొందరు రాజకీయ నాయకులు, ప్రజా ప్రతి«నిధులకు సైతం నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉందని తెలిసింది.


