రాష్ట్రం దివాలా తీసింది | Union Minister Bandi Sanjay in a Sakshi interview | Sakshi
Sakshi News home page

రాష్ట్రం దివాలా తీసింది

Feb 8 2026 3:22 AM | Updated on Feb 8 2026 3:22 AM

Union Minister Bandi Sanjay in a Sakshi interview

కాంగ్రెస్‌కు 6 గ్యారంటీల అమలుకే అణాపైసా లేదు

బీఆర్‌ఎస్‌ అస్తమిస్తున్న పార్టీ... పోటీలోనే లేదు

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో కాషాయజెండా ఎగరబోతోంది

‘సాక్షి’ ఇంటర్వ్యూలో కేంద్రమంత్రి బండి సంజయ్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: పదేళ్ల బీఆర్‌ఎస్, రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రం పూర్తిగా దివాలా తీసిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఎవరూ నమ్మడం లేదని, ఆయన్ను చెప్పులు ఎత్తుకుపోయే దొంగలా చూస్తున్నారని తెలిపారు. కేంద్రం నుంచి నిధుల వరద రావాలంటే, కరీంనగర్‌ కార్పొరేషన్‌ సహా మున్సి పాలిటీల్లో అభివృద్ధి జరగాలంటే ఈ ఎన్నికల్లో బీజేపీని ఆశీర్వదించి గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో కేంద్రమంత్రి బండి సంజయ్‌ ‘సాక్షి’ప్రతినిధికి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

ప్ర: మున్సిపాలిటీల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా రానివ్వబోనని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారు.. మీరేమంటారు?
సీఎం రేవంత్‌రెడ్డిని చూస్తే జాలేస్తుంది. 6 గ్యారంటీలను అమలు చేయడానికి అణాపైసా లేక బిక్కమొహంతో దిక్కులు చూస్తున్నడు. ఢిల్లీకి మూటలు పంపలేక ఆపసోపాలు పడుతున్నడు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేల గ్రూపు తగాదా లపై ఏమీ చేయలేని నిస్సహాయత ఆయనది. 

కాంగ్రెస్‌ హైకమాండ్‌తో కేసీఆర్‌కు ఉన్న ఆర్థిక లావాదేవీల మూలంగా అవినీతి కేసుల్లో ఆధారాలున్నా కేసీఆర్‌ కుటుంబాన్ని అరెస్ట్‌ చేయలేకపోతు న్నాననే బాధ ఆయన కళ్లలో కనిపిస్తోంది. జనం కాంగ్రెస్‌ను ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేయాలా అని ఎదురు చూస్తున్నరు. ఇవన్నీ తెలుసు కాబట్టే ప్రజల దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఏదో ఒక మాట మాట్లాడుతూ ప్రజలను దారి మళ్లించాలనుకుంటున్నడు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కర్రుకాల్చి వాత పెట్టబోతున్నరు. బీజేపీని ఆశీర్వదించబోతున్నారు.

ప్ర: బీజేపీ ఎన్ని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి?
వందకు వందశాతం కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగరేయబోతున్నం. ఒక్క నా కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోనే మరో మూడు మున్సిపాలిటీల చైర్మన్‌ పీఠాలను కైవసం చేసుకుంటాననే నమ్మకం ఉంది. వివిధ సర్వే రిపోర్టులు, ప్రజాస్పందన చూస్తుంటే.. రాష్ట్రంలో మెజారిటీ కార్పొరేటర్, కౌన్సిలర్ల స్థానాలను సాధించుకుని తిరుగులేని శక్తిగా ఎదిగే అవకా శాలు పుష్కలంగా కన్పిస్తున్నాయి. 

కరీంనగర్‌ కార్పొరేషన్‌లో వార్‌ వన్‌ సైడ్‌ ఉంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ మూడో స్థానం కోసం పోటీ పడు తున్నాయి. ఈ విషయం తెలిసి మజ్లిస్‌కు మేయర్‌ సీటు ఇస్తామని కాంగ్రెస్‌ లోపాయికారీ ఒప్పందం చేసుకొని ముస్లింలను తమవైపు తిప్పుకునే పనిలో పడ్డారు.

ప్ర: ఈ ఎన్నికల్లో ప్రజలకు ఏమని విజ్ఞ్ఞప్తి చేస్తున్నారు ? 
ఈ ఎన్నికల్లో గుణవంతులకు, ధనవంతులకు మధ్య పోటీ జరుగుతోంది. అవినీతిపరులకు, నిజాయితీగా మీ కోసం కొట్లాడే బీజేపీ అభ్యర్థుల మధ్య జరిగే యుద్ధమిది. అధికారంలో ఉన్నంతకాలం కబ్జాలు, దోపిడీలు, కమీషన్లతో దోచుకుంటే.... వాళ్ల అరాచకాలు, కబ్జాలపై బీజేపీ అభ్యర్థులు పోరాటాలు చేసి జైళ్లకు వెళ్లారు. కబ్జాకోరులు, దోపిడీదారులు మళ్లీ మాయమాటలతో మీ ముందుకు వస్తున్నారు. నమ్మి ఓటేస్తే ఐదేళ్లు నరకయాతన తప్పదు. నిధులిచ్చేది కేంద్రం. ఆ నిధుల వరద కొనసాగాలంటే... అభివృద్ధి ఆగకూడదంటే బీజేపీని ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.   

ప్ర: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పరిస్థితి ఏవిధంగా ఉంది? 
ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా ఎన్నికల ఫలితాలే గీటురాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఓడిపోయింది. పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎంపీ సీటు కూడా రాలేదు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో అసలు పోటీలోనే లేకుండా చేతులెత్తేసింది. నా దృష్టిలో బీఆర్‌ఎస్‌ గతించిన పార్టీ. మున్సిపల్‌ ఎన్నికల్లో అరకొర బీఆర్‌ఎస్‌ సీట్లు గెలుచుకున్నా, ఎన్నికలయ్యాక వాళ్లంతా మళ్లీ కాంగ్రెస్‌లోకే వెళ్లే అవకాశాలున్నాయి.

ప్ర: నిత్యం హిందుత్వం మాట్లాడే మీరు ఈ ఎన్నికల్లో అభివృద్ధి అంశాన్నే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారెందుకు?
హిందుత్వం మా శ్వాస. అందులో తగ్గేదేలే. బండి సంజయ్‌ హిందుత్వం తప్ప ఏమీ మాట్లాడరని, అభివృద్ధి కోసం నయాపైసా తేలేదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ వారు విష ప్రచారం చేశారు. అందుకే కరీంనగర్‌ పార్లమెంట్‌ అభివృద్ధికి నేను ఏం చేశాను? ఎన్ని నిధులు తెచ్చా ను? ఏఏ అభివృద్ధి పనులు చేశాననే వివరాలతో బుక్‌లెట్‌ ప్రింటింగ్‌ చేసి ఇంటింటికీ పంపుతున్నా. నేను వాస్తవాలు చెప్పే సరికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలకు దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అయితోంది.  

Advertisement
 
Advertisement
Advertisement