సోషల్ మీడియా
పిల్లలకు కార్టూన్ షోలు కొత్తేమీకాదు. వారి ప్రపంచంలో ఏ మూలన చూసినా అవి కనిపిస్తాయి. అయితే అడవి బిడ్డల సంగతి వేరు! వారికి టీవీలు, స్మార్ట్‌ఫోన్ సౌకర్యం ఉండదు కాబట్టి.. కార్టూన్ షోలు వారికి బొత్తిగా అపరిచితం. ఛత్తీస్‌ఘడ్ అడవుల్లోని ఆదివాసి బిడ్డలకు ఒక సీఆర్‌పీఎఫ్ కోబ్రా జవాన్ తన ఫోన్‌లో కార్టూన్ షో చూపిస్తున్న దృశ్యం, పిల్లలు సంతోషంతో కేరింతలు కొడుతున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ వీడియోకు నెటిజనుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ‘చాలా ఆలస్యంగా అయినా మిక్కీ మౌస్‌లాంటి కార్టూన్ క్యారెక్టర్‌లు అడవిబిడ్డలకు పరిచయం కావడం సంతోషంగా ఉంది’ ‘ఈ పిల్లలను చూస్తుంటే చాలా జాలిగా ఉంది. కార్టూన్ షోలాంటివి ఎన్నో మిస్ అవుతున్నారు’ అని కొందరు కామెంట్ చేశారు. కొందరు మాత్రం... ‘దురదృష్టం కాదు. చాలా అదృష్టం. డిజిటల్ పోల్యూషన్‌లేని స్వచ్ఛమైన బాల్యాన్ని అడవిబిడ్డలు అనుభవిస్తున్నారు’ అని కొందరు స్పందించారు.


