కొన్నాళ్ల క్రితం వరకు ఎక్కువ మంది నోట వినిపించిన పేరు మడ్వి హిడ్మా. ఏపీలోని మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ తర్వాత హిడ్మాను అభినవ భగత్‌సింగ్ అని, మరో అల్లూరి సీతారామరాజు అంటూ కొందరు కీర్తించగా.. హిడ్మా పేరిట ఉన్న క్రైం రికార్డుల మాటేమిటని మరికొందరు ప్రశి్నస్తున్నారు. కానీ ఇరువర్గాలను తల్లడిల్లిపోయేలా చేస్తోన్న ఒకే అంశం హిడ్మా తల్లి పొజ్జి. ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ ఆమెను కలిసినప్పుడు తొలిసారిగా పొజ్జి వార్తల్లోకి ఎక్కింది. ఆ తర్వాత హిడ్మా అంత్యక్రియల సమయంలో ఆమె ఫొటోలు, వీడియోలు చూసిన వారి మనుసులు బరువెక్కాయి. ఇప్పుడా పొజ్జి ఎలా ఉంది.. ఏం చేస్తోందని పలువురు ఆరా తీస్తుండగా ఆ ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం..
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పూవర్తి నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఓయ్ పారా అనే చిన్న పల్లెలో ఊరికి చివరగా అడవికి దగ్గరగా పాకలో మడ్వి పొజ్జి నివసిస్తోంది. ఆ పాకలో తిండి గింజలు దాచుకునేందుకు వీలుగా చుట్టూ కర్రలతో కట్టిన ఒక గది ఉంది. ఆ గదికి ఉన్న కర్ర తలుపులు జంతువులు లోపలికి పోకుండా తాళ్లతో కట్టి ఉన్నాయి. తాళం కూడా లేని ఇంట్లో ఆమె జీవిస్తోంది. గోండి భాషలో ఆమె చెప్పిన విషయాలను అక్కడ తెలుగు తెలిసిన మరో ఆదివాసీ యువకుడు తర్జుమా చేసి చెప్పిన వివరాల ఆధారంగా... ‘నా కొడుకు ఉన్నప్పుడు ఎవరూ ఇటు రాలేదు.
ఇవన్నీ నాకెందుకు ?
ఇప్పుడు ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు. ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నారు. కొందరు దుప్పట్లు, బట్టలు ఇస్తున్నారు. ఇంకొందరు డబ్బులు ఇస్తున్నారు. మరికొందరైతే ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అందిందా, దాచమని నీ కొడుకు ఎన్ని డబ్బులు ఇచ్చాడు అని అడుగుతున్నారు. వాడు (హిడ్మా) పార్టీలోకి వెళ్లిన తర్వాత నన్ను కలిసింది తక్కువ. మాట్లాడింది తక్కువ. నాకు వాడు ఇచ్చిన, మీరు ఇచ్చినా... అవన్నీ ఎక్కడ పెట్టుకోవాలి? అసలు వాటితో నాకు ఏం అవసరం ఉంది’అంటూ పూవర్తిపైకి దండెత్తి వస్తున్న మీడియా బృందాలపై పొజ్జి కోప్పడింది.
ఆయన మాటలు నమ్మాను
‘ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం విజయ్‌శర్మ మా ఊరికి వచ్చాడు. మాతో మాట్లాడాడు. మాతో కలిసి అన్నం తిన్నాడు. ‘నీ కొడుకును లొంగిపొమ్మని చెప్పమ్మా’అని అడిగాడు. ‘వాడు నా మాట వినడయ్యా.. జనం కోసమని పోయిండు, నేను రమ్మంటే రాడు’అని చెప్పిన. ‘లేదమ్మా! మేము చెబితే అతను రావడం లేదు. నీ కొడుకు నీ మాట వింటాడు, నువ్వు చెబితే తప్పకుండా వస్తాడు. ఒక్కసారి అజ్ఞాత జీవితం వదలి రమ్మని అతనికి నువ్వు చెప్పు’అని అడిగాడు. అంత పెద్దమనిషి మా ఊరికి వచ్చి అడుగుతున్నాడు కదా అని మనసులో ఇష్టం లేకపోయినా లొంగిపో కొడుకా అని చెప్పాను. (హిడ్మాను లొంగిపొమ్మంటూ ఆమె చెబుతున్నట్టుగా వీడియోను గతంలో షూట్ చేసి రిలీజ్ చేశారు). ఆయన (విజయ్ శర్మ) మాటల మీద నమ్మకం ఉంచుకున్న.
నా కొడుకు లొంగిపోయి ఇంటికి వస్తాడని ఆశలు పెట్టుకున్న. కానీ కొన్ని రోజులకే నా కొడుకును శవంగా మార్చి ఇంటికి పంపారు. ఆ రోజు (విజయ్ శర్మ పూవర్తికి వచ్చిన రోజు)న జరిగింది గుర్తుకు వస్తేనే అంటూ చెప్పే ప్రయత్నంలో ఆమె గొంతు బాధతో పూడుకుపోయింది. మాటలు ఆగిపోయాయి, కానీ కన్నీళ్లు ఆగలేదు. కొద్ది సేపటికే దుఃఖం నుంచి తేరుకుంది. చేతిలో కొడవలి పట్టుకొని, నాకు పని ఉంది అంటూ ఆమె నివసిస్తున్న పాకను ఆనుకొని ఉన్న పొలం వైపు అడుగులు వేసుకుంటూ సమీపంలోని అడవిలోకి పొజ్జి వెళ్లింది.
:::సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం


