సమ్మెలో పాల్గొంటున్న జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్,ఫ్లిప్‌కార్ట్‌ల డెలివరీ సిబ్బంది
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ గిగ్ వర్కర్లు సమ్మె బాంబు పేల్చారు. బుధవారం దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నట్లు ప్రకటించారు. జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల డెలివరీ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. ఏడాదిలోనే అత్యంత బిజీగా ఉండే రోజున సమ్మె కారణంగా కస్టమర్ల ప్రణాళికలు తలకిందులవడమే కాకుండా, సంవత్సరాంత ఆదాయ లక్ష్యాలను చేరుకునేందుకు లాస్ట్–మైల్ డెలివరీలపై ఆధారపడే వ్యాపారులపై కూడా తీవ్ర ప్రభావం పడే ప్రమాదముంది. ఈ సమ్మెకు తెలంగాణ గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్, ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్‌పోర్ట్ వర్కర్స్ సంఘాలు మద్దతు పలికాయి.
మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీ–ఎన్‌సీఆర్, పశ్చిమబెంగాల్, తమిళనాడులోని కొన్ని ప్రాంతాల వారు సమ్మెలో పాల్గొంటున్నారు. ఎక్కువ గంటలు పనిచేయించుకుంటున్న కంపెనీలు ఇచ్చే ప్రతిఫలాన్ని మాత్రం అంతకంతకూ తగ్గిస్తున్నాయని డెలివరీ ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. ‘ఈ ఉద్యోగంతో జాబ్ గ్యారెంటీ లేదు, భద్రతతోపాటు గౌరవం కూడా లేదు’అని వాపోతున్నారు. పుణె, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతాతోపాటు టయర్–2 నగరాల్లో ముఖ్యంగా ఫుడ్ ఆర్డర్లు, గ్రోసరీ డెలివరీలపై ఎక్కువ ప్రభావ పడుతుందని అంటున్నారు.


