తయారీ సామర్థ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా.. మహీంద్రా & మహీంద్రా మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో ఆటోమొబైల్స్ & ట్రాక్టర్ల కోసం తన అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించాలని ప్రకటించింది. దీనిని ఏర్పాటు చేయడానికి కంపెనీ రూ. 15,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధమైంది.
మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. విదర్భలో 1,500 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక సౌకర్యాన్ని అభివృద్ధి చేయనుంది. దీనికి అనుబంధంగా శంభాజీనగర్‌లో 150 ఎకరాల సప్లయర్ పార్క్ కూడా ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కర్మాగారం ఏడాదికి ఐదు లక్షల వాహనాలు & లక్ష ట్రాక్టర్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. నాగ్‌పూర్‌లో జరిగిన అడ్వాంటేజ్ విదర్భ సమ్మిట్ సందర్భంగా కంపెనీ ఈ ప్రకటన చేసింది. ఈ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం & మహీంద్రా అండ్ మహీంద్రా మధ్య ఒక అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.


