అతడికి ఎక్కడున్నా అదే ఆలోచన.. సంతోషంగా ఉంది: సూర్య | IND s NZ Suryakumar Yadav Praises Team And Abhishek Sharma knock | Sakshi
Sakshi News home page

అతడికి ఎక్కడున్నా అదే ఆలోచన.. సంతోషంగా ఉంది: సూర్య

Jan 22 2026 1:18 PM | Updated on Jan 22 2026 1:31 PM

IND s NZ Suryakumar Yadav Praises Team And Abhishek Sharma knock

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. నాగ్‌పూర్‌ వేదికగా తొలి టీ20లో 48 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ విజయంలో కీలక పాత్ర భారత ఓపెనర్‌ అభిషేక్‌ శర్మదే.

అతిపెద్ద సానుకూలాంశం
ఇక అభిషేక్‌ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు తోడు.. బౌలర్లు కూడా రాణించడంతో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శనపై కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సంతృప్తి వ్యక్తం చేశాడు. ‘‘తొలుత బ్యాటింగ్‌ చేయడం మాకు ఎల్లప్పుడూ సంతోషమే.

మంచు ప్రభావం కూడా ఉంది. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో మాకు అతిపెద్ద సానుకూలాంశం అదే. పవర్‌ ప్లేలో వికెట్లు (25-2) కోల్పోయినా మేము పుంజుకున్న తీరు అద్భుతం. 15 ఓవర్‌ వరకు మా ఆట కొనసాగుతూనే ఉంది. ఎక్కడా మాకు అలుపు రాలేదు. మా జట్టు చాలా బాగా ఆడింది.

సరైన సమయంలో క్రీజులోకి
వ్యక్తిగతంగా నా బ్యాటింగ్‌ పట్ల కూడా తృప్తిగానే ఉంది. సరైన సమయంలో నేను క్రీజులోకి వెళ్లాను. నెట్స్‌లో నేను చాలా బాగా బ్యాటింగ్‌ చేస్తున్నాను. ఈరోజు ఇక్కడ మైదానంలోనూ అదే పునరావృతం చేశాను. గత 2-3 వారాలుగా తీవ్రంగా శ్రమిస్తున్నా. నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉంది.

ఎక్కడున్నా అదే ఆలోచన
ఇక అభిషేక్‌ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మ్యాచ్‌ కోసం అతడు సన్నద్ధమయ్యే తీరు నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. హోటల్‌లో.. టీమ్‌ బస్‌లో.. ఇలా ఎక్కడ ఉన్నా సరే తన గ్లేమ్‌ ప్లాన్‌ గురించే ఆలోచిస్తాడు. 

చిన్న చిన్న విషయాలపై కూడా దృష్టి సారిస్తాడు. అందుకు తగ్గ ఫలాలను అతడు పొందుతూ ఉండటం మనం చూస్తూనే ఉన్నాము’’ అని సూర్యకుమార్‌ యాదవ్‌ ప్రశంసించాడు.

238 పరుగులు
కాగా నాగ్‌పూర్‌లో బుధవారం నాటి తొలి టీ20లో టాస్‌ ఓడిన భారత జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 238 పరుగులు చేసింది. అయితే, కివీస్‌ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది.

ఇక ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ 22 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఒక సిక్స్‌ బాది 32 పరుగులు చేయగలిగాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది’ మ్యాచ్‌ అభిషేక్‌ శర్మ మెరుపు హాఫ్‌ సెంచరీ (35 బంతుల్లో 84)తో దుమ్ములేపాడు. భారత్‌- కివీస్‌ మధ్య శుక్రవారం జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు రాయ్‌పూర్‌ వేదిక.

చదవండి: చరిత్ర సృష్టించిన అభిషేక్‌ శర్మ.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా రికార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement