టీమిండియా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర లిఖించాడు. న్యూజిలాండ్‌తో తొలి టీ20లో కేవలం 22 బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకుని.. కివీస్ మీద ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు.
అదే విధంగా.. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో ఇంగ్లండ్ స్టార్ ఫిల్ సాల్ట్ (Phil Salt) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును అభిషేక్ శర్మ ఈ సందర్భంగా బద్దలు కొట్టాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్- న్యూజిలాండ్ (IND vs NZ 1st T20I) బుధవారం తొలి టీ20లో తలపడ్డాయి.
నాగ్‌పూర్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ సంజూ శాంసన్ (Sanju Samson- 10), టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (8) పూర్తిగా నిరాశపరిచారు.
ఆకాశమే హద్దు
అయితే మరో ఓపెనర్, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. మొత్తంగా 35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 84 పరుగులు సాధించాడు. ఇష్ సోధి బౌలింగ్‌లో జెమీషన్‌కు క్యాచ్ ఇవ్వడంతో అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
మిగతా వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (32), హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 25) ఫర్వాలేదనిపించగా.. రింకూ సింగ్ (20 బంతుల్లో 44 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి భారత్ 238 పరుగులు సాధించింది.
కివీస్ ఓటమి
భారీ లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులకే పరిమితమైంది. దీంతో టీమిండియా 48 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది. ఈ మ్యాచ్ సందర్భంగా అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు హాఫ్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు.
అంతర్జాతీయ టీ20లలో 25 లేదంటే అంతకంటే తక్కువ బంతుల్లో అత్యధికసార్లు ఫిఫ్టీలు బాదిన క్రికెటర్లు వీరే
🏏అభిషేక్ శర్మ- ఎనిమిది సార్లు
🏏ఫిల్ సాల్ట్- ఏడుసార్లు
🏏సూర్యకుమార్ యాదవ్- ఏడుసార్లు
🏏ఎవిన్ లూయీస్- ఏడుసార్లు.
చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్
You keep on counting, he keeps on hitting! 🤩😍
𝗠𝗿. 𝗠𝗔𝗫𝗜𝗠𝗨𝗠, Abhishek Sharma, is taking bowlers to the cleaners as he smashes his 5th SIX of the innings! 🔥👏🏻#INDvNZ | 1st T20I | LIVE NOW 👉 https://t.co/o7KbRwpZwK pic.twitter.com/1MyyCmbcP6— Star Sports (@StarSportsIndia) January 21, 2026


