వచ్చే ఐదేళ్లలో దాదాపు 120 బిలియన్ డాలర్ల (రూ.11.45 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టాలని టాటా సన్స్ పెద్ద ప్లాన్ వేసుకుంది. కానీ.. చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఆకస్మిక రాజీనామాతో ఈ ప్రణాళికపై కొంత అనిశ్చితి ఏర్పడింది. కొత్త నాయకుడు వచ్చే వరకు.. కొన్ని భారీ ప్రాజెక్టులు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
చంద్రశేఖరన్ దాదాపు పదేళ్ల పాటు టాటా గ్రూప్‌ను నడిపారు. ఈ సమయంలో ఆయన టాటా భవిష్యత్తు కోసం సెమీకండక్టర్ చిప్స్, ఎలక్ట్రిక్ కార్ల బ్యాటరీలు, ఏఐ డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. ఈ ప్రాజెక్టులు వెంటనే లాభాలు ఇచ్చేవి కావు. అయితే.. వీటికి చాలా డబ్బు, సమయం, టెక్నాలజీ అవసరం. ఇలాంటి సమయంలో చంద్రశేఖరన్ తప్పుకోవడం సంస్థ వృద్ధిపై తప్పకుండా ప్రభావం చూపే అవకాశం ఉంది.
చంద్రశేఖరన్ రాజీనామా తరువాత.. నోయెల్ టాటా సంస్థ వృద్ధిలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఎందుకంటే.. చంద్రశేఖరన్ భారీగా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ, నోయెల్ మాత్రం ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలని చూస్తున్నారు. ఎక్కువ కాలం తర్వాత లాభాలు వచ్చే ప్రాజెక్టుల కంటే, పెట్టిన డబ్బు త్వరగా తిరిగి వచ్చే అవకాశమున్న ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.
అందుకే.. టాటా బోర్డు కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను మళ్లీ పరిశీలిస్తోంది. ముఖ్యంగా సెమీకండక్టర్ ప్లాంట్, ఎయిర్ ఇండియా, టాటా డిజిటల్ వంటి వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టింది. ఇందులో పెట్టుబడులు పెడితే.. ఎంత లాభం వస్తుంది, పెట్టుబడి తిరిగి రావడానికి ఎంత సమయం పడుతుంది అనే విషయాలను బోర్డు తెలుసుకోవాలనుకుంటోంది. అంటే టాటా ఇప్పుడు కేవలం పెద్ద ప్రాజెక్టులు చేపట్టడం మాత్రమే కాకుండా, వాటి ఫలితాలు మరియు ఖర్చులను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోంది.
టాటా గ్రూప్ ఇప్పటికే జాగ్వార్ ల్యాండ్ రోవర్, తాజ్ హోటల్స్, ఎయిర్ ఇండియా, టెట్లీ టీ వంటి పెద్ద వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఇదే సమయంలో సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలు, ఏఐ డేటా సెంటర్లు వంటి కొత్త రంగాల్లోకి అడుగుపెడుతోంది. ఈ పెట్టుబడులు టాటాకు మాత్రమే కాకుండా భారతదేశానికి కూడా ముఖ్యమైనవి.
భారత్‌ను ప్రపంచ స్థాయి తయారీ కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ లక్ష్యానికి టాటా పెట్టుబడులు ఉపయోగపడతాయి. అందుకే.. కొత్త టాటా చైర్మన్ ముందు పెద్ద బాధ్యత ఉంది. చంద్రశేఖరన్ ప్రారంభించిన పెద్ద ప్రణాళికలను కొనసాగించాలా, లేక పెట్టుబడులను కొంత తగ్గించి ముందుగా లాభాలపై దృష్టి పెట్టాలా అనేది నిర్ణయించాలి.
ఇదీ చదవండి: కేంద్రం కీలక నిర్ణయం.. EV కొనేవారికి గుడ్‌న్యూస్!


