దాదాపు అన్ని సేవలు ఆన్‌లైన్ పూర్తవుతున్న సమయంలో.. సైబర్ మోసాలు కూడా పెరిగిపోయాయి. నకిలీ వెబ్‌సైట్లు, లింకులు, మెసేజ్‌లతో ఉద్యోగులను మోసం చేసే ప్రయత్నాలు ఎక్కువవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈపీఎఫ్ఓ (EPFO) తన సభ్యులను హెచ్చరించింది.
ఈపీఎఫ్ఓ తన అధికారిక ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు చేస్తూ.. ఏదైనా లింక్‌పై క్లిక్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచించింది. నకిలీ లింక్‌లను నమ్మొద్దని, వెబ్‌సైట్ యూఆర్‌ఎల్‌ను జాగ్రత్తగా పరిశీలించాలని తెలిపింది. ముఖ్యంగా.. ఆన్‌లైన్‌లో పీఎఫ్‌కు సంబంధించిన సేవలను ఉపయోగించేటప్పుడు వ్యక్తిగత వివరాలను కాపాడుకోవాలని సూచించింది.
ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు యూఏఎన్, పీఎఫ్ బ్యాలెన్స్, క్లెయిమ్ తదితర సేవల కోసం ఆన్‌లైన్‌లోకి వెళ్తుంటారు. ఇదే సమయంలో కొందరు మోసగాళ్లు ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్‌సైట్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్‌లను తయారు చేస్తున్నారు. వాటి ద్వారా యూఏఎన్, పాస్‌వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే పీఎఫ్‌కు సంబంధించిన సేవలను ఉపయోగించేటప్పుడు తప్పకుండా వెబ్‌సైట్ అడ్రస్‌ను చెక్ చేయాలి. ముఖ్యంగా యూఆర్‌ఎల్‌లో స్పెల్లింగ్ తప్పులు ఉన్నాయా? డొమైన్ పేరు అనుమానాస్పదంగా ఉందా? వంటి విషయాలను గమనించాలి. అంతే కాకుండా ఎస్ఎంఎస్, వాట్సాప్, ఈమెయిల్ లేదా సోషల్ మీడియాలో ఎవరైనా పంపిన లింక్‌ను చూసి వెంటనే క్లిక్ చేయకూడదు.
ఈపీఎఫ్ఓ సభ్యులు తమ యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్, ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి సమాచారాన్ని అనధికారిక వెబ్‌సైట్‌లలో నమోదు చేయకూడదు. ముఖ్యంగా ఎవరి నుంచైనా ఫోన్ కాల్, ఎస్ఎంఎస్, వాట్సాప్ మెసేజ్ లేదా ఈమెయిల్ వచ్చి ఓటీపీ లేదా వ్యక్తిగత వివరాలు అడిగితే.. వెంటనే అప్రమత్తం కావాలి. ఈపీఎఫ్ఓ ఇలాంటి మార్గాల ద్వారా సభ్యుల నుంచి ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు లేదా లాగిన్ వివరాలను అడగదు.
జాగ్రత్తలు
పీఎఫ్‌కు సంబంధించిన సేవల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను మాత్రమే ఉపయోగించాలి
ఇంటర్నెట్‌లో కనిపించే రాండమ్ లింక్‌లను లేదా ఎవరో పంపిన లింక్‌లను నమ్మకూడదు
అనుమానాస్పద లింక్‌లు వస్తే వాటిపై క్లిక్ చేయకుండా.. నేరుగా అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి సేవలను ఉపయోగించాలి.
లాగిన్ చేసే ముందు URLను మరోసారి పరిశీలించాలి
అధికారిక వెబ్‌సైట్‌లా కనిపించే నకిలీ సైట్లు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి.. చిన్న స్పెల్లింగ్ మార్పులను కూడా నిర్లక్ష్యం చేయకూడదు.
ఏదైనా అనుమానాస్పద వెబ్‌సైట్, మెసేజ్ లేదా ఫిషింగ్ వంటివి కనిపిస్తే సంబంధిత అధికారిక ఛానళ్ల ద్వారా ఫిర్యాదు చేయాలి
Think Before You Click! EPFO urges all members to stay vigilant online. Avoid fake links, verify URLs and protect your personal information at all times.
#EPFOWithYou #HumHainNa #EPFO #ईपीएफओ pic.twitter.com/LwQVy0S84g— EPFO (@officialepfo) August 9, 2026


