ఇది ఏఐ ఆధారిత చిత్రం
చేతికి వాచ్ లేదు.. వేళ్లకు ఉంగరాలు కనిపించవు.. మెడలో చైన్, చెవులకు ఆభరణాలు కూడా ధరించరు.. ఇలాంటి వారిని చూసినప్పుడు చాలామందికి ఒకే ప్రశ్న వస్తుంది.. “ఇదేం అలవాటు?” అని. కొందరు వీరికి ఫ్యాషన్‌పై ఆసక్తి ఉండదని అనుకుంటారు. కానీ ఆభరణాలకు దూరంగా ఉండటానికి కేవలం ఫ్యాషన్ కారణమే కాదు.. ఇతర కారణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
సైకాలజీ ప్రకారం.. ఒక వ్యక్తి ఏ వస్తువులు ధరిస్తారు.. ఏవి ధరించరు అన్నది వారి వ్యక్తిగత ఆలోచనా విధానాన్ని ప్రతిబింబించొచ్చు. కొందరికి చేతికి వాచ్, బ్రేస్‌లెట్, ఉంగరం వంటి వస్తువులు పెట్టుకోవడం అసౌకర్యంగా అనిపిస్తుంది. రోజువారీ పనుల్లో అవి ఇబ్బందిగా అనిపించడం, శరీరంపై అదనంగా ఏదైనా ఉండటం ఇష్టం లేకపోవడం వంటి కారణాలతో వాటికి దూరంగా ఉంటారు.
ముఖ్యంగా సింపుల్ జీవనశైలిని ఇష్టపడేవారు తక్కువ వస్తువులతోనే ఉండాలని కోరుకుంటారు. వారికి ఆర్భాటం కంటే సౌకర్యం, స్వేచ్ఛ, సమయం ముఖ్యమని సైకాలజీ నిపుణులు చెబుతున్నారు.
ఫ్యాషన్ అంటే వ్యతిరేకత కాదు!
ఆభరణాలు ధరించని వారంతా ఫ్యాషన్‌కు వ్యతిరేకమని భావించడం తప్పు. కొందరు తమ రూపాన్ని సహజంగా ఉంచుకోవాలని కోరుకుంటారు. మరికొందరు దుస్తులు, అలంకరణ కంటే వ్యక్తిత్వం, పనితీరు, ఆలోచనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. అలాగే కొందరికి చిన్నప్పటి నుంచి అలాంటి అలవాటే ఉండొచ్చు. కుటుంబ వాతావరణం, పెరిగిన తీరు, వ్యక్తిగత అనుభవాలు కూడా ఇలాంటి అభిరుచులపై ప్రభావం చూపుతాయి.
ఆర్థిక కారణాలు కూడా ఉండొచ్చు!
ఆభరణాలకు దూరంగా ఉండటానికి ఆర్థిక కారణాలు కూడా ఒక అంశం కావచ్చు. బంగారం, వెండి వంటి ఆభరణాలు కొనుగోలు చేయడం అందరికీ సాధ్యపడకపోవచ్చు. కొందరు అవసరమైన ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తూ ఆభరణాల కొనుగోలును పక్కన పెడతారు. మరికొందరు ఆభరణాలు కొనుగోలు చేయగల సామర్థ్యం ఉన్నప్పటికీ.. వాటిపై డబ్బు ఖర్చు చేయడం కంటే పొదుపు, పెట్టుబడులు లేదంటే ఇతర అవసరాలకు ప్రాధాన్యం ఇస్తారు. కాబట్టి ఎవరైనా ఆభరణాలు ధరించకపోతే దాన్ని కేవలం వారి అభిరుచితోనే ముడిపెట్టలేమని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ వస్తువులు.. తక్కువ ఆందోళన
కొంతమంది జీవితంలో మినిమలిజం (తక్కువ వస్తువులతో సరళంగా జీవించడం)ను పాటిస్తారు. ఎక్కువ వస్తువులను నిర్వహించడం కంటే అవసరమైన వాటితోనే జీవించడం వారికి ఇష్టం. ఇలాంటి వారు దుస్తులు, ఆభరణాలు, ఇతర వస్తువుల ఎంపికలో కూడా సరళతకు ప్రాధాన్యం ఇస్తారు.
అయితే ఆభరణాలు ధరించని వ్యక్తి తప్పనిసరిగా అంతర్ముఖి అని, సామాజికంగా కలవలేడని చెప్పలేం. అదే విధంగా ఆభరణాలు ఎక్కువగా ధరించే వారు ఆర్భాటాన్ని ఇష్టపడతారని కూడా భావించకూడదు.
అలవాటు వెనుక కారణం ఒక్కటే కాదు..
మనిషి ప్రవర్తన అనేది అనేక అంశాల కలయిక. వ్యక్తిగత అభిరుచులు, సౌకర్యం, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం.. ఇలా ఎన్నో విషయాలు కలిసి ఒకరి అలవాట్లను నిర్ణయిస్తాయి. అందుకే బోసి మెడ, ఖాళీ చేతులు కనిపిస్తే దాని వెనుక ఒకే కారణం ఉందని భావించకూడదు. అది వారి స్వంత ఎంపిక కావచ్చు.. వారి జీవనశైలిలో భాగం కావచ్చు.
(గమనిక: ఇవి సైకాలజీ, ప్రవర్తనా విశ్లేషణల ఆధారంగా చెప్పే సాధారణ అంశాలు మాత్రమే. ఒక్క అలవాటుతో ఒకరి వ్యక్తిత్వం లేదంటే ఆర్థిక పరిస్థితిని నిర్ణయించలేం.)


