వేగంగా తింటున్నారా? ఇది మీ కోసమే.. | Your Eating Speed May Reveal These Personality Traits Say Psychologists | Sakshi
Sakshi News home page

వేగంగా తింటున్నారా? ఇది మీ కోసమే..

Jul 21 2026 8:17 AM | Updated on Jul 21 2026 8:40 AM

Your Eating Speed May Reveal These Personality Traits Say Psychologists

ఉదయం హడావుడి.. ఆఫీసుకు వెళ్లే తొందర.. సమయం సరిపోకపోవడం.. ఇలా కారణాలు ఏవైనా కావచ్చు. కానీ కొందరి భోజనం చేసే స్టైల్‌ మాత్రం అందరికీ కనిపిస్తుంది. పక్కన కూర్చున్న వారు ఇంకా మొదటి ముద్దలో ఉండగానే.. వీరు మాత్రం ప్లేట్‌ ఖాళీ చేసేస్తారు. ఒక్కో ముద్దను వేగంగా తీసుకుంటూ.. మధ్యలో పెద్దగా విరామం లేకుండా భోజనం ముగించేస్తారు. “త్వరగా తినడం ఒక అలవాటే కదా.. ఇందులో ఏముంది?” అనుకుంటాం. కానీ..

మనం తినే వేగం కూడా మన ఆలోచనా విధానం, జీవనశైలి, కొన్ని ప్రవర్తనా లక్షణాలకు చిన్న సంకేతం కావచ్చట. సైకాలజిస్టులు చెబుతున్న విషయం ఆసక్తికరంగా ఉంది మరి. ఆ విషయాలు పరిశీలిస్తే.. వేగంగా తినే అలవాటు వెనుక కేవలం తొందర మాత్రమే కాకుండా.. సమయాన్ని చూసే విధానం, పనులను పూర్తి చేసే తీరు, రోజువారీ జీవితంలో ఉండే వేగం వంటి అంశాలు కూడా దాగి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది వ్యక్తిత్వాన్ని పూర్తిగా అంచనా వేసే పరీక్ష కాదని.. కేవలం కొన్ని ప్రవర్తనా ధోరణులను అర్థం చేసుకునేందుకు ఉపయోగపడే చిన్న సంకేతంగా మాత్రమే చూడాలని సూచిస్తున్నారు.

లక్ష్యాలపై ఫోకస్‌ ఎక్కువగా ఉంటుందా?.. వేగంగా తినే వ్యక్తుల్లో.. కొంతమంది లక్ష్యాలపై ఎక్కువ దృష్టి పెట్టే స్వభావం కలిగి ఉంటారని నిపుణులు చెబుతున్నారు. వీరికి సమయం చాలా విలువైనదిగా అనిపిస్తుంది. చేయాల్సిన పనుల జాబితాను త్వరగా పూర్తి చేసి.. తర్వాతి లక్ష్యానికి వెళ్లాలనే ఆలోచన ఎక్కువగా ఉండొచ్చు. అందుకే భోజనం కూడా ఆస్వాదించే సమయం కంటే.. పూర్తి చేయాల్సిన మరో పనిలా మారిపోయే అవకాశం ఉంటుంది.

వేచి ఉండటం నచ్చదా?.. వేచి ఉండటాన్ని ఇష్టపడకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. క్యూలో నిలబడటం, ఆలస్యంగా జరిగే పనులు, నెమ్మదిగా సాగే చర్చలు వారికి అసహనాన్ని కలిగించవచ్చు. వారి జీవనశైలి కూడా వేగంగానే సాగుతూ ఉంటుంది. ఒక పని పూర్తయిన వెంటనే మరో పని మొదలుపెట్టాలనే ఆలోచన వారిలో కనిపించవచ్చు. అయితే ప్రతి వేగంగా తినేవారు అసహన స్వభావం కలిగిన వారే అని చెప్పలేం. సమయాభావం, పని ఒత్తిడి వంటి కారణాలు కూడా దీనికి కారణం కావచ్చు.

ఎప్పుడూ తర్వాతి పని గురించే ఆలోచనా?.. కొంతమంది భోజనం చేస్తున్నప్పటికీ వారి మనసు అక్కడ ఉండదు. ఫోన్‌లో మెసేజ్‌లు చూడటం.. ఆఫీస్‌ పనుల గురించి ఆలోచించడం.. తర్వాత చేయాల్సిన పనుల జాబితా సిద్ధం చేసుకోవడం వంటి అలవాట్లు ఉండొచ్చు. సైకాలజిస్టుల ప్రకారం ఇది ‘టాస్క్‌-ఫోకస్డ్‌ మైండ్‌సెట్‌’ కావొచ్చు. అంటే ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించడం కంటే.. తర్వాతి పని పూర్తి చేయడంపై దృష్టి పెట్టే స్వభావం.

👉..అయితే.. వేగంగా తినడం వల్ల శరీరం ఇచ్చే ముఖ్యమైన సంకేతాలను మనం పట్టించుకోకపోవచ్చు. ముఖ్యంగా “ఇక చాలు” అనే తృప్తి సంకేతం మెదడుకు చేరడానికి కొంత సమయం పడుతుంది. కానీ వేగంగా తినేవారిలో భోజనం అప్పటికే పూర్తవుతుంది. దీంతో అవసరానికి మించి తినే అవకాశం పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే నెమ్మదిగా తినడం వల్ల ఆకలి, తృప్తి స్థాయిని మెరుగ్గా అర్థం చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

👉ఈ అలవాటు ఉన్నవారు బిజీ షెడ్యూల్స్‌కు త్వరగా అలవాటు పడే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తక్కువ సమయంలో నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు, ఒత్తిడితో కూడిన పనులు, వేగంగా మారే పరిస్థితుల్లో వీరు సౌకర్యంగా పనిచేయగలరని నిపుణులు భావిస్తున్నారు. అయితే కొందరు కేవలం పరిస్థితుల వల్లే వేగంగా తింటారు. ఉదాహరణకు.. తక్కువ లంచ్‌ బ్రేక్‌, కుటుంబ బాధ్యతలు, చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్లు కూడా కారణం కావచ్చు.

👉భోజనం చేసే సమయంలో ఆహారం రుచి, వాసన, ఆకలి, తృప్తిని గమనిస్తూ తినడాన్ని ‘మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌’ అంటారు. వేగంగా తినే వారిలో ఈ అలవాటు తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. నెమ్మదిగా తినడం వల్ల ఆహారాన్ని ఆస్వాదించడంతో పాటు.. శరీరం ఇచ్చే సంకేతాలను కూడా మెరుగ్గా గమనించవచ్చు.

ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఒక్కటే.. తినే వేగం ఆధారంగా ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేం. చిన్ననాటి అలవాట్లు, కుటుంబ వాతావరణం, సంస్కృతి, పని ఒత్తిడి, జీవన పరిస్థితులు.. ఇలా ఎన్నో అంశాలు మన తినే విధానాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి వేగంగా తింటున్నారని మీరు తప్పనిసరిగా ఓ ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిన వారని కాదు. కానీ మీ రోజువారీ అలవాట్లను గమనించడానికి ఇది ఒక చిన్న సంకేతం కావచ్చు. మరి మీరు ఏ రకం? ప్లేట్‌ అందరికంటే ముందే ఖాళీ చేసేవారా.. లేక నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తినేవారా?.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement