breaking news
damaging
-
వాడని నెయ్యి.. తయారుకాని లడ్డూ.. జరగని తప్పుపై ‘పచ్చ’ గోల
-
ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీస్తున్న సీఎం కేసీఆర్
హైదరాబాద్: ముదిరాజ్‌ల ఆత్మగౌరవం దెబ్బతీసేవిధంగా సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ముదిరాజ్‌ల ఆత్మగౌరవసభలో ఈటల మాట్లాడుతూ జనాభానిష్పత్తి ప్రకారం ముదిరాజ్ లు 11 శాతం ఉన్నారని, పదకొండుమందికి ఎమ్మె ల్యేలుగా అవకాశం దక్కాలని, ఇరవై ఏళ్ల నుంచి ఇద్దరు లేక ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నారు. తెలంగాణలో బీసీలు 52 శాతం ఉంటే... 9 మంత్రి పదవులు రావాలని, కానీ మూడు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఒకశాతం జనాభా లేని జాతి నుంచి సీఎంతో పాటు నలుగురుæ మంత్రులు ఉన్నారన్నా రు. మేము ఈ రాష్ట్రానికి ఏటా రూ.20 వేల కోట్ల ఆదాయం ఇస్తున్నామని, కానీ మీరు చేపపిల్లల పేరిట రూ. 500 కోట్లు ఖర్చు చేస్తున్నారని, చేపపిల్లలు కాదు నేరుగా నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో బీసీలు ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలు ముదిరాజ్‌లకు సముచిత స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌ల ఆత్మగౌరవ సభను అడ్డుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారని, మీటింగ్‌కు వెళితే ప్రభుత్వ పథకాలు రావని బెదిరించారని ఈటల ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అన్నింటిని ఎదుర్కొని ఆత్మగౌరవసభకు భారీగా తరలివచ్చారన్నారు. తన 20 ఏళ్ల రాజకీయ జీవితం అందరికీ తెలుసని తాను ప్రజల మనిషినని చెప్పారు. ఎన్ని కేసులు పెట్టినా, గుండాలు చంపుతామని బెదిరించినా వెనక్కి తగ్గలేదని, రాష్ట్రంలో అన్ని కులాల సమస్యలపై గొంతెత్తి పోరాడానని గుర్తు చేశారు. ముదిరాజ్‌లను బీసీ డి నుంచి బీసీ ఏలోకి మార్చాలని తాను ఎమ్మెల్యే అయిన మొదటిరోజు నుంచే కొట్లాడుతున్నానని, వైఎస్.రాజశేఖరరెడ్డి 2008 జడ్చర్ల సభలో ముదిరాజ్‌లను బీసీడి నుంచి బీసీ ఏలోకి మారుస్తా అని చెప్పారని, అదే సభలో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్ ప్రకటించారన్నారు. అయితే బీసీ ఏ రిజర్వేషన్ ఒక్క సంవత్సరం మాత్రమే అమలైందని, మైనారిటీ వారు ఏడుగురు ఎమ్మెల్యేలుగా ఉన్నారని, సుప్రీంకోర్టుకు వెళ్లి వారు గెలిచారని, మనకు ఎవరు లేక పట్టించుకోవడం లేదని చెప్పారు. మేం వేరే రాష్ట్రం నుంచి వచ్చామా : నీలం మధు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏ పార్టీ అయినా మా ముదిరాజ్‌లను గుండెల్లో పెట్టుకొని ఎవరు ఎన్ని సీట్లు కేటాయిస్తారో, వారితోనే పొత్తు పెట్టుకొని వారితోనే ఉంటామని ముది రాజ్ సంఘం రాష్ట్ర నాయకుడు నీలంమధు చెప్పారు. ఆరోజు తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఎలా పోరాడామో.. అదే ఆత్మగౌరవం ముదిరాజ్ జాతికి దక్కేలా పోరాడతామన్నా రు. బీసీల్లో 60 లక్షల మంది ఉన్న ముదిరా జ్లకు రాజకీయ గుర్తింపు లేదా..?మేము వేరే రాష్ట్రం నుంచి వచ్చామని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. ముదిరాజ్‌లందరం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆత్మగౌరవ సభతో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ దద్దరిల్లింది. ఈటల రాజేందర్ ప్రసంగిస్తుండగా సభకు హాజరైన పలువురు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో అంబర్‌పేట శంకర్, పులుమేడ రాజు, చొప్పారి శంకర్ తదితరులు పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడార్ : విశాఖ ఇమేజ్ దెబ్బతీయడానికి చంద్రబాబు కుట్రలు
-
జిల్లా అతలాకుతలం
మెదక్ బ్యూరో: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు జిల్లా అతలాకుతలం అవుతోంది. ఎక్కడికక్కడ చెరువులు, వాగులు పొంగుతున్నాయి. పాత ఇళ్లు కూలుతున్నాయి. ఆయా మండలాల పరిధిలో జరిగిన నష్టం వివరాలు.. ఝరాసంగం మండలం గంగాపూర్ చెరువు, జీర్లపల్లిలోని ప్యాలవరం ప్రాజెక్టు, కుప్పానగర్ గుండం చెరువు, మేదపల్లి ఏనుగుల చెరువు, ఏడాకుపల్లి కొత్తూర్, బర్దీపూర్‌లోని పెద్ద కుంటలు, చెక్‌డ్యాంలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. మండలంలో 26 ఇళ్లు పాక్షికంగా కూలాయి. చేతికొచ్చిన పత్తి, సోయాబీన్, మినుము, కంది పంటలు నీటమునిగాయి. దుబ్బాక మండలం చిట్టాపూర్ వద్ద అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోవడంతో సిద్దిపేట, మెదక్, సంగారెడ్డికి వెళ్లాల్సిన వాహనాలు హబ్షీపూర్, చేర్వాపూర్, దుబ్బాక, లచ్చపేట, చౌదర్పల్లి మీదుగా మళ్లించారు. పోతాన్‌పల్లి రామచెరువు, కసాన్పల్లి ఊర చెరువులకు బుంగలు పడ్డాయి. దుబ్బాక మండలంలో 500 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. మిరుదొడ్డి మండలం లింగుపల్లి, అల్వాల కూడవెల్లి వంతెనలపై వరద నీరు ఊహించని రీతిలో ప్రవహిస్తోండటంతో రాకపోకలు స్థంభించిపోయాయి. మిరుదొడ్డి కాసులాబాద్‌కు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రేగోడ్: మండలంలో దాదాపు 25 ఇళ్లు కూలిపోయాయి. చౌదర్పల్లి, గజ్వాడ, రేగోడ్, సాయిపేట, జగిర్యాల చెరువులు, కుంటల్లోకి వర్షపునీరొచ్చి చేరుతుంది. గజ్వాడలోని కామెల్లి చెరువు చిన్నతూము మట్టి కొట్టుకుపోయింది. మునిపల్లి మండలం పెద్దలోడిలో శిథిలావస్థకు చేరిన సుమారు 18 ఇళ్లు కూలాయి. జగదేవ్‌పూర్ మండలంలో మొత్తం 92 ఇళ్లు కూలినట్టు అంచనా. వెల్దుర్తి మండలంలో 220 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రెండు హెక్టార్ల కంది, 20 హెక్టార్ల వరి, 10 హెక్టార్ల మక్కజొన్న పంటలు నీట మునిగాయి. హత్నూర మండలంలో ఈ నాలుగు రోజుల్లో 332 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 218 చెరువు, కుంటలు నిండి అలుగులు పారుతున్నాయి. వరి 60 హెక్టార్లు, పత్తి 80 హెక్టార్లు, సోయాబిన్ 20హెక్టార్లలో నీట మునిగింది. శివ్వంపేట మండలంలోని 206 కుంటలు, చిన్నచెరువులు, 16 పెద్ద చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. శివ్వంపేట పెద్దచెరువు, గూడూర్లోని బ్రహ్మసముద్రం చెరువులు 20 ఏళ్ల తర్వాత అలుగు పారాయి. దొంతిలోని పెద్ద చెరువు 30 ఏళ్ల తర్వాత అలుగు పారింది. మండలంలో 20 ఇళ్లు కూలాయి. నారాయణఖేడ్ మండలంలో 55 ఎకరాల్లో వరి, 750 హెక్టార్లలో సోయా, కంది, పత్తి తదితర పంటలు దెబ్బతిన్నాయి. కల్హేర్‌లో వరి 250 ఎకరాలు, సోయా 550 ఎకరాలు, మనూరు మండలంలో దాదాపు వెయ్యి ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. కంగ్టి మండలం దామర్గిద్దాలో దాదాపు 40 కుటుంబాలకు చెందిన 135 మందిని స్థానిక పాఠశాల, పంచాయతీ కార్యాలయం, రామాలయంలో పునరావాసం కల్పించారు. రెండు రోజులపాటు కురిసిన భారీ వర్షానికి దాదాపు 3 వేల ఎకరాల్లో సోయా, కంది, పత్తి పంటలకు నష్టం వాటిల్లింది. 200పైగా ఇళ్లుకూలిపోయాయి. రాయికోడ్ మండలంలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాయికోడ్, సింగితం, నాగ్వార్, కుసునూర్, రాయిపల్లి, యూసుఫ్పూర్, హుల్గేర తదితర గ్రామాల శివార్లలోని వాగుల్లో వరద ఉధృతి కారణంగా ఆయా గ్రామాలకు బస్సు సర్వీసులను రద్దు చేశారు. మెదక్ మండలంలో వంద ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కాల్వలు, చెరువులు, కుంటలు పొంగి పొర్లుతున్నాయి. వంద ఎకరాలకుపైగా పంటలు నీట మునిగాయి. కౌడిపల్లి మండలంలో 94 ఇళ్లు కూలాయి. 50 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. జిన్నారం మండలం నర్రిగూడ, జంగంపేట వద్ద కల్వర్టులు పొంగి పొర్లుతుండంతో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జంగంపేట, జిన్నారం గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మండలంలో దాదాపు వంద ఎకరాల్లో వరి పంట మునిగింది.